Devudu neelo vunnadu – దేవుడు నీలోనే వున్నాడు
‘దేవుడు నీలోనే వున్నాడు’, ‘నువ్వు దేవుడితో సమానం’ అని ఎవరైనా అంటే- ‘ఓహో! నేనే దేవుణ్ణయితే, ఇక గుడికెందుకెళ్లాలి? దేవుడి గాథలెందుకు వినాలి?’-
అని విర్రవీగడం ఎంత అవివేకమో, ‘నా మొహం..
నేను దేవుణ్ణేమిటి? దేవుడు నాలో వుండడమేమిటి?’
అని నిర్లక్ష్యంగా వుండడం కూడా అంతే అవివేకం! ‘జన్మలన్నింటిలో మానవ జన్మ ఉత్తమోత్తమమైనది కదా! మనం మాట్లాడగలం, ఆలోచించగలం, చక్కగా స్పందించగలం, అర్థం చేసుకోగలం. ఈ శక్తులు కేవలం మనిషికే ఉన్నాయి. నీ మనసే నిన్ను డైరెక్టు చేయగల దర్శకుడు.
కాబట్టి ఏది మంచిదో, ఏది చెడ్డదో తెలుసుకుని ఆ బాటలో నడిచి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఒక్క మానవుడికే వుంది.
మనలోని జ్ఞానమే నిరంతరం వెలిగే జ్యోతి. దాన్ని గౌరవించుకోవడం, పెంపొందించుకోవడమే దైవత్వం. మ న శరీరం ఒక దేవాలయం. మన మనస్సునీ, హృదయాన్నీ రక్షిస్తూ సర్వవేళలా కాపాడే ఆలయం. కాబట్టి, శరీరాన్ని, దైవత్వాన్నీ కాపాడుకోవడం మనలోనే వుంది-అని ఎవరైనా అంటే కాదనగలమా? ఎండకి ఎండి వాడి, నశించికుండా శరీరాన్ని కాపాడుకోవడం, అలాగే అనవసర విషయాలతో మనసుని నింపేసుకుని, దాన్ని బాధపెట్టడం.. రెండూ అనారోగ్యాలే కదా!
ఎండలు ఒక పక్కన మాడ్చేస్తూ వుంటే, పిన్నా పెద్దా లెక్క చేయకుండా ఎండలో తిరగడం- మనం శరీరానికి చేసే న్యాయమేనంటారా? నాకు తెలిసిన ఒకావిడ.. దుర్గాంబ గారని.. అరవై ఏళ్లు దాటుతున్నా, వచ్చిన ప్రతి తెలుగు సినిమాని, మొదటి రెండు మూడు రోజుల్లోనే టిక్కెట్లను బ్లాకులో కొనుక్కునైనా చూసెయ్యడం, తోడుగా ఇరుగింటావిడనో, పొరుగింటావిడనో తీసుకెళ్లడం చేస్తూ వుంటుంది.
వాళ్లది మధ్యతరగతి కుటుంబమే. ఏదో ఒకటి పొద్దునే్న ఉడకేసేసి, నాలుగు మెతుకులు గతికి, మిట్టమధ్యాహ్నం ఆటోలోపడి సినిమా హాలుకు చేరుకుంటుంది. సెలవుల్లో మనవలూ, మనవరాళ్లూ వస్తే వాళ్లనీ అలాగే పట్టుకెళ్లిపోతుంది. సినిమా మధ్యలో ఇంటర్‌వెల్‌కి ఆలూ చిప్స్, కోకోకోలాలు ఏవి దొరికితే అవి కొనేసి తను తింటుంది, వాళ్లకీ పెడుతుంది.
సినిమా అయిపోయాక ఏ జంక్ ఫుడ్డో, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో కట్‌లెట్లు ఇతర పదార్థాలూ, మళ్లీ కోక్‌లూ తీసుకుని మెల్లగా ‘హుష్యూ.. హుష్యూ’ అంటూ ఇల్లు చేరుకుని ‘అబ్బ.. ఏమి ఎండ.. ఏమి వేడి బాబూ…’ అని విసుక్కుంటూ, రాత్రికి ఏదో ఉడికించి పడేస్తుంది.
అన్నింటికీ ‘సర్వరోగ నివారణి’లా కూర పొడి మసాలాలు అనేకం బజార్లో దొరికేవి కొని స్టాకు పెట్టుకోవడం వల్ల అయిదు నిమిషాల్లో వంట రెడీ. మిగతా టైములో రిలాక్సింగ్ పేరుతో టీవీలో వచ్చే పిచ్చి సీరియళ్లూ, గేమ్ షోలూ చూస్తూ గడిపేస్తోంది. దీనివల్ల ఏం జరుగుతోంది? ఎండకి చెమటలు పట్టి శరీరం మీది చర్మం మాడినట్టవుతుంది. తలనొప్పి, వాంతులు లాంటి ‘ఎండాకాలం రోగాలు’ ముంచుకొస్తాయి.
జంక్‌ఫుడ్డు, కోకోకోలా లాంటి డ్రింకులూ, మసాలా కూరలూ కడుపుని పాడు చేస్తాయి, జీర్ణశక్తిని నశింపజేస్తాయ. తద్వారా అనేకమైన రోగాలొస్తాయి. మందులు మింగుతూ ఆరోగ్యాన్ని చేజేతులా పాడుచేసుకుని, మరీ ఎక్కువైతే ఆసుపత్రి పాలవుతారు. ఇవన్నీ అవసరమా?
వృద్ధులూ, పసివాళ్లూ వీలైనంత మట్టుకు వేసవిలో మధ్యాహ్నం పనె్నండు గంటలనుంచి, సాయంత్రం నాలుగు గంటల వరకు బయటకు వెళ్ళకూడదు. ఎండలు మండుతున్నా లెక్కజెయ్యక అనవసరంగా తిరిగే తిరుగుళ్లు మనల్ని ఎండ దెబ్బకీ, వడగాడ్పుకీ గురిచేస్తాయి.
పెద్ద పెద్ద జరీ చీరలు, ముదురు రంగు దుస్తులు కాకుండా పలుచటి, మెత్తని చీరలు కట్టుకోవడం, కాస్త ఒదులుగా వున్న బట్టలు ధరించడం మంచిది.
దాహాన్ని మరింతగా పెంపొందించే మసాలా కూరలకి ఎండాకాలంలో దూరంగా వుండాలి. అడపాదడపా పల్చటి మజ్జిగ తాగడం లేదా కొబ్బరి నీళ్ళు తాగడం మరీ మంచిది.
పిచ్చి పిచ్చి సినిమాలూ, చెత్త సీరియళ్లూ సినిమాలు చూడకుండా, ఇతరుల గురించి నెగెటివ్ కామెంట్స్ చేస్తూ మాట్లాడడం మానుకుంటే శారీరకంగానూ, మానసికంగానూ ఎంతో ఆరోగ్యకరంగా వుంటుంది.
ఖాళీ సమయంలో మంచి పుస్తకాలు చదవడం, పిల్లల చేత చదివించడం, మరేదైనా కళలలో ఆసక్తి వుంటే- బొమ్మలు వేయడం, సంగీతం లాంటివి చేస్తూ వుంటే, మనస్సు హాయిగా, ప్రశాంతంగా వుంటుంది.
మంచి ఆలోచనలు చెయ్యడం కూడా దినచర్యలో ఒక భాగంగా అలవాటైపోతుంది. మనస్సు శరీరాన్నీ, శరీరం మనస్సునీ, ఒకదాన్ని ఒకటి చూసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
ఆరోగ్యమే మహాభాగ్యం కదా! ఆరోగ్యం ఆనందానికి మూల కారణం.
ఏదైనా మంచి లక్ష్యాలను సాధించవచ్చు. నెగెటివ్ థింకింగ్‌కి బ్రేకులు వెయ్యండి.
ఆనందానికి బాటలు వెయ్యండి. ఇవన్నీ పాటిస్తే పగలే వెనె్నల కాకపోయినా, చీకటి మాత్రం చొరబడదు!శ్రీమతి.శారదా అశోకవర్ధన్ .
devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus