Budugu Gadi Katha, Telugu Moral Stories బుడుగు గాడి కథ

బుడుగు గాడి కథ

Budugu Gadi Katha, Telugu Moral Stories

 

నేనండీ బుడుగు వాళ్ళ చిన్నాన్న కొడుకుని..!!

మరి నా పేరేమో..! ఇప్పుడే ఎందుకు లెండి ఈ కథ తర్వాత మీరెళ్ళి మా నాన్నకు నా మీద చాడీలు చెప్పినా చెప్తారు..!

పేరు చెప్పను కానీ నా కథ చెప్తా బావుంటుంది..!

మాఇంట్లో నానమ్మ ,తాతయ్య, అమ్మ, నాన్న చెల్లి నేను..!

ముందు వరసలో నానమ్మ ని పెట్టటానికి కారణం మా నాన్నమ్మ నా మీద ఈగను కాదుగా దాని గాలిని కూడా దగ్గరకు రానిచ్చేది కాదు, మా నానమ్మ ఇంట్లో ఉంటే మనం ఆడిందే ఆట పాడిందే పాట, మనం ఏది చేసినా దానికి ఎదురే లేదు, అందుకే ఎక్కువ మార్కులేసి మొదటి ర్యాంకు ఇచ్చా ..!

ఆ తర్వాత మా తాత ఇక్కడ కాబ్బట్టి తాత అంటున్నా మా నాన్న ముందు అంటే తాట తీస్తాడు తాతగారు అనాలి 🙏

మా తాతగారు నాకు కోశాధికారి టైపు, నానమ్మ ద్వారా కొంత వచ్చినప్పటికీ తాతగారు ఇచ్చేది ఎక్కువ మొత్తం, పైగా ప్రతి ఆదివారం ఎడ్లబండిమీద మా పొద్దుతిరుగుడు చేనుకు తీసుకెళ్లి మంచెమీద ఎక్కిస్తాడు, నేరేడు పళ్ళు కోసిస్తాడు,రింగన్న పురుగులు పట్టిస్తాడు, నాకు నా దంటగాళ్లకు ముంజికాయల బండికి కావాల్సిన కర్రలు అవి కూడా తాతగారే కొట్టించేవాడు , టార్చి లైట్ లో పాడైన బ్యాటరీలను నాకోసం దాచి ఇచ్చేవాడు, దాన్నేం చేసేవాడివిరా అని అడిగేరు మెకానికల్ ఇంజనీర్ టైపులో దాంతో ఒక బండి చేసి దానికో కొక్కెం ఉన్న కంది కర్ర తగిలించామంటే నా సామిరంగా బుల్లెట్టు బండి కూడా నా వెనకమాల రావాల్సిందే అంత స్పీడ్ వెళ్లుద్ధి ఇలా తాతతో తిరగటం చాల ఇష్టం, పైగా రాత్రి కాగానే ఆరుబయట తాత దగ్గర పడుకుంటే రకరకాల కథలు , ముచ్చట్లు చెప్పేటోడు ఇవన్నీ చేస్తే మరి తాతకు మంచి ర్యాంకు ఇచ్చి టాప్ 2 లో ఉంచొద్దా మీరే చెప్పండి ..?

Innocent Childhood, Telugu Moral Stories అమాయక బాల్యం

ఇంక అమ్మ నాన్నల గురించి పెద్దగా ఎం లేదు చెప్పడానికి ఎంత తిన్నా సరిగ్గా తినట్లేదనే అమ్మ, ఎంత సేపు చదివినా సరిపోదనే నాన్న అందుకే వాళ్లకు తక్కువ మార్కులు వేసా..!! మార్కులు తక్కువేసింది అందుకు కాదులే ఇంకో కారణం కూడా ఉంది మనకు బడిలో దంటగాళ్లు ఎక్కువ అందరం అరుగుమీద కూర్చుని ఆడపిల్లలలాగా ఏం ఆడతాం చెప్పండి, మట్టిలో ఆడితే గాని ఆడినట్టు ఉండదు అది తప్పంటది అమ్మ..! ఎలాగైనా వీపు పగలగొట్టాలని అమ్మ, కాపాడాలని నానమ్మ వీళ్ళకు కాసేపు వాగ్వాదం, నాన్నమ్మ వల్లనే నేను మాట వినట్లేదని అమ్మ , తాతయ్య గారాబం వల్ల చదవకుండా ఆటలు ఆడుతున్నానని నాన్న, ఇలా నాకు ఇష్టమైన నానమ్మను తాతయ్యను తిడితే అస్సలు నచ్చేది కాదు నాకు., అందుకే మార్కులు తగ్గించేసా, అన్నట్టు మా అమ్మ అని చెప్పటం కాదుకానీ కొడితే వీపు మీద కాంగ్రెసు పార్టీ గుర్తు కనపడాల్సిందే, ఇంకోమాట మేరే చెప్పండి తొడపాశం కన్నా గొప్ప మంట ఇంకేదైనా ఉంటుందా.?

కథలోకొస్తే నా మట్టుకు నేను పొద్దునే లేచి నానమ్మ చేతిలో చక్కగా స్నానం చేసి , తాత చేత్తో పాండ్స్ పౌడర్ వేపించుకుని , చద్దన్నం తిని, తెల్లని యూరియా బస్తాతో చేసిన చక్కని సంచిలో పుస్తకాలు పెట్టుకుని, నాన్న సైకిల్ మీద ముందు చెల్లి వెనకాల నేను కూర్చుని బడికెళ్లే వాడిని.

When Tenali Raman was Blessed by Goddess Kali, Sanaatan Tales

పొద్దునే ప్రార్ధన అవ్వగానే ఒక్కో పీరియడ్ లెక్కపెట్టుకుంటూ, ఇంటర్వెల్ అవ్వగానే తాత ఇచ్చిన అర్ధరూపాయి తో రంగు పుల్ల ఐసు కొనుక్కుని మధ్య మధ్యలో నాలుక రంగు ఉందొ పోయిందో అని చూసుకుంటూ ఉండగా, ఇంకో రెండు పీరియడ్లు అయిపొయ్యేవి, అన్నం గంట కొట్టేవాళ్ళు. ఇంటికెళ్లి నానమ్మ చేత్తో నాలుగు ముద్దలు తిని, పెరట్లో ఉన్న జామచెట్టెక్కి నాలుగు కాయలు కోసుకుని, రెండు నేను తిని, రెండు మా దంటగాళ్ళకిచ్చి, గంట వినపడగానే పరుగెత్తికెళ్లి బళ్ళో కూర్చునే వాడ్ని, మూడు క్లాస్లులు వినేలోపు చివరి గంట మోగేది, ఇంకేముంది తెల్లచొక్కా కాస్త గోధుమ రంగాయే వీపు విమానం మోత మోగె ..!

ఇలా చక్కగా మూడు హస్తం గుర్తులు, ఆరు తొడపాశాలుగా సాగిపోతున్న నాజీవితంలోకి

ప్రోగ్రెస్ కార్డు వచ్చింది….!

మన సదువు సక్కదనం ఇంట్లేదెలిసింది ..!

40కి 50కి మధ్యలో ఉన్న నా అంకెలు మా నాన్నకు నచ్చవు ఎందుకంటే నా చెల్లెమ్మ కార్డులో 95కి 99కి మధ్య ఉన్న అంకెలు ఉండేవి. మా నాన్నారు సంతకం పెట్టకపోగా బడికొచ్చి నా దంటగాళ్ల కార్డులు చూడటం, వాళ్ళు నాకన్నా ఎదవలు అని తెలుసుకోవటం, అవసరం అయితే తోలు తీసెయ్యమని పూర్తి హక్కులు హెడ్ మాస్టర్ కు ఇచ్చేయ్యటం, ఆయన మా క్లాసుకొచ్చి నన్ను మొదటి బల్ల మీద (అమ్మాయిలతో) కూర్చోమనటం అన్ని చక చకా జరిగిపోయాయి, ఎలాగోలా కాలం వెళ్లదీస్తుంటే ఎండాకాలం సెలవులు రానే వచ్చాయి.

మా చెల్లిలాగా అష్టా చెమ్మ, లాంటి ఇంటిపట్టున ఉండే ఆటలు ఎం ఆడతాం చెప్పండి అందుకే పొద్దున్న ఇంట్లోనించి వెలితే మళ్ళీ సూర్యాస్తమయం తర్వాతనే వచ్చేది, ఈ ఆటలు ఆ ఆటలు అని కాకుండా ఏది పడితే అది ఆడేవాణ్ణి, అప్పుడప్పుడు తాతతో చేనుకు వెళ్లి ఈతపళ్ళు , మామిడికాయలు తెచ్చుకుని గడ్డివాములో మాగపెట్టేవాణ్ణి , అలా తాత, నానమ్మ దగ్గర కబుర్లు వినుకుంటు సంతోషంగా ఎండాకాలం సెలవులను ఆస్వాదిస్తున్న సమయంలో..!

ఒకరోజు ఎక్కడినుంచి వచ్చిందో మాయదారి ఇంగ్లీష్ మీడియం బడి వ్యాను మా ఊరొచ్చి, మా వీధి చివర ఆగింది..!! అందులోనుంచి రాక్షసుల్లాంటి 10 మంది దిగారు వాళ్ళు ఎర్రటి ఎండలో కూడా కోట్లు వేసుకుని ఇంటింటికి తిరిగుతూ తప్పిపోయిన కోడిపిల్లలను వెతికినట్టు వెతికి చదువుకునే పిల్లలను పట్టుకుంటున్నారు, ఇంకేముంది మానాన్న ఇంట్లోనే ఉన్నాడు, ఇక్కడే చదివితే ఆటో రిక్షా తొక్కుకు బ్రతకాల్సిందే, కాదు మీవాడు కలెక్టర్ కావాలంటే మా బడిలో ఇంగ్లీష్ మీడియంలో చేర్పించండి ఒప్పించారు, మా నాన్నకు కలెక్టర్ అంటే అంతిష్టo అని అప్పుడే తెలిసింది నాకు.

Tenali Ramakrishna Stories in Telugu, Thaatha, oothuna, తాతా, ఊతునా?

పైగా ఆ దిక్కుమాలిన బడి ఉన్న ఊర్లో వేలు విడిచిన మా చుట్టం ఎవడో ఒకడున్నాడని మా నాన్నకు తెలిసింది ఇంకేముంది ఎమన్నా ఐతే వాడు చూసుకుంటాడు అనే దైర్యం తోడైంది. ఇంగ్లీష్ మీడియంలో వేసెయ్యాలని అమ్మ , నాన్న నిర్ణయం తీసుకున్నారు..!!

నాన్నమ్మ తాతయ్యలు వద్దు అనటం,

ఎప్పుడు తాతగారి ముందు గట్టిగా మాట్లాడని మానాన్న పిల్లల జీవితం మీ వల్లనే పాడవుతుంది అని అనటం,

తాతగారు మనసు నొచ్చుకోవటం,

తర్వాత నానమ్మ కూడా మీ పిల్లోడు మీ ఇష్టం అనటం,

అన్ని చక చకా జరిగిపోయాయి.

ఈసారి నానమ్మ తాతయ్యలు నన్ను కాపాడలేక చేతులెత్తేశారు..!!

నేనేమైన దైర్యం చేసి నాన్నను ఎదిరిద్దాం అనుకుంటే అసలే ఎండాకాలం వీపు పగిలితే మంట మాములుగా ఉండదు,. అందుకే ఆదైర్యo చెయ్యలేదు..!

పోనీ అలిగి అన్నం తినకుండా రెండు రోజులు అమ్మని బెదిరిద్దాం అనుకుంటే ఇది తెలీని మా నాన్నమ్మ అన్నం తిన్నదాకా ఒప్పుకునేది కాదు ఆమె ప్రేమ ఆమెది..!

నాకున్న అన్ని దార్లు మూసుకు పొయ్యాయి ఎండాకాలం సెలవులు కూడా అయిపోయాయి.

జూన్ నెలరానే వచ్చింది, కొత్తబట్టలు, బూట్లు, పెన్నులు, వీటితో పాటు ఒక పెట్టె తెచ్చాడు నాన్న, ఆ పెట్టె చూసాకే తెలిసింది నేను ఉండాల్సింది హాస్టల్ లో అని.

ఇప్పుడు నా జైలు జీవితం..! అదేనండి నా కొత్త బడి జీవితం ..!

Tenali Ramakrishna Stories in Telugu, Kapi – Kavi, కపి-కవి

పొద్దునే ఏదో కొంపలు మునిగినట్టు 4 గంటలకే లేపి స్నానాలు చేయమనేవాళ్లు, ఇంట్లో ఏ పనులు అలవాటు లేని నేను అన్ని పనులు చేసుకోవాల్సి వచ్చింది, అస్సలు నచ్చని మనుషులు, ఇష్టం లేని వంటలు తినాలనిపించేది కాదు ఏడుపొచ్చేది, అమ్మ వాళ్ళు వస్తే కలవకూడదు, మాట్లాడకూదదు అనుకునే వాడిని కానీ వాళ్లొచ్చారని తెలవగానే పరుగెత్తుకెళ్లేవాడిని, నానమ్మ తాతయ్య వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు వస్తే నేను వాళ్ళ మీద బెంగ పెట్టుకుంటానని.

ఒక్కడు కూడా తెలుగు మాట్లాడడు, ఒక వేళ తెలుగులో మాట్లాడితే 50 రూపాయలు కట్టాలి, పొద్దున్న తొమ్మిదికి మొదలైతే రాత్రి తొమ్మిది దాకా చదువుడే చదువుడు, పైగా కిరాణం కొట్టుకు సరుకుల లిస్ట్ పంపినట్టు నెల నెలా నాకొచ్చిన మార్కులు ఇంటికి పోస్ట్ చేసేవాళ్ళు, అది చూసిన మా నాన్న వాత పెట్టిన పిల్లి ఎగిరినట్టు ఎగిరి అదే మంట మీద ఎగురుకుంటూ నాదగ్గరకొచ్చి ఒక ముప్పావుగంట తిట్టేవాడు, మిగిలిన పావుగంట అమ్మ ఓదార్చేది..!

ఒక ఆటా లేదు, ఒక పాట లేదు, జీవితంలో చదువు తప్ప ఇంకోటి లేదు, చదివి చదివి పది సంవత్సరాలు చదివి ఒక కాగితం ముక్క తెచ్చాను అదేనండీ మీ ఇంగ్లీషులో మాటల్లో ఫస్ట్ క్లాస్ మార్కుల షీటు…!

అది చూసిన మా నాన్న నిజంగా నేను కలెక్టర్ అయినట్టు ఫీల్ అయిపోయి ఊరంతా చెప్పేసాడు, ఇంకేముంది ఆ ఇంగ్లీష్ మీడియం బడికి నా వల్ల బిజినెస్ బాగా పెరిగింది, మా ఊరి గొర్రెలకు స్పెషల్ బస్సు వేసాడు ఇప్పుడు పొద్దున్న తీసుకెళ్లి సాయంత్రం ఊర్లో దింపుతున్నారు 🤦🏻‍♂️.

ఆ తర్వాత మీకు తెలవంది ఏముంది చెప్పండి ఇంటరు, డిగ్రీ, పీజీ, ఉద్యోగం, పెళ్లి , సంసారం, కష్టాలు, కోరోనా 😜😂

Tenali Ramakrishna Stories in Telugu, Meka Thoka, Goat Tail, మేకా, తోకా మేకతోకా తోకమేకా *

అన్నట్టు గొర్రెలు అన్నానని మా ఊర్లో వాళ్లకు చెప్పమాకండే..! ఏడుస్తారు 😜😂

చదివినందుకు ధన్యవాదాలు..!!

ఇట్లు

మీ జ్ఞానాచారి

Spread iiQ8

February 23, 2023 3:04 PM

241 total views, 0 today