Valmiki Ramayanam Telugu AyodhyaKaanda Day 12 | వాల్మీకి మహర్షి రామాయణం అయోధ్యకాండ

Valmiki Ramayanam Telugu AyodhyaKaanda Day 12

 

Jai Shree Ram ! Valmiki Ramayanam Telugu AyodhyaKaanda Day 12 | వాల్మీకి మహర్షి రామాయణం అయోధ్యకాండ

 

12వ దినము, అయోధ్యకాండ

సుమంత్రుడు అయోధ్యకి తిరిగివచ్చి, రాముడు సీతాలక్ష్మణ సహితుడై గంగని దాటి అరణ్యాలకి వెళ్లిపోయాడని చెప్పాడు. అప్పుడు దశరథుడు, రాముడు ఎలా ఉన్నాడని అడుగగా సుమంత్రుడు ఇలా చెప్పాడు ” రాముడు మీకు నమస్కారములు చెప్పమన్నాడు, కౌసల్యని జాగ్రత్తగా చూసుకోమన్నాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయల యందు తనకెటువంటి బేధభావం లేదన్నాడు. భరతుడిని కుశలమడిగాడు ” అని చెప్పాడు. ఈ మాటలు విన్న దశరథుడు లక్ష్మణుడు ఏమన్నాడు అని అడిగాడు. అప్పుడా సుమంత్రుడు……

” లక్ష్మణుడు పడవెక్కుతూ, మా తండ్రి కామమునకు లొంగిపోయి, సకల సుగుణాభి రాముడిని రాజ్యం నుంచి బయటకి పంపించాడు. అందుకని ఆయనని తండ్రిగా నేను అంగీకరించడం లేదు. ఇక నుంచి దశరథుడు నాకు తండ్రి కాదు. నాకు తండ్రి కాని, తల్లి కాని, గురువు కాని, దైవం కాని, అన్న కాని, తమ్ముడు కాని, ఎవరైనా నాకు రాముడే. ఈ మాట నేను చెప్పానని దశరథుడికి చెప్పు ” అన్నాడు. మరి సీతమ్మ ఎమనిందని దశరథుడు అడుగగా ” సీతమ్మ పడవెక్కుతూ నా వంక చూసి నమస్కారం చేసి వెళ్ళిపోయింది ” అన్నాడు.

అప్పటికే దశరథుడు చాలా పరివేదన చెందుతున్నాడని సుమంత్రుడు గ్రహించాడు. రాజుని ఓదారుద్దామని సుమంత్రుడు ఇలా అన్నాడు  ” ఏమిలేదయ్య, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. రాముడితో పాటు సీతమ్మ సంతోషంగా నడుస్తూ, ఆ వనాలని, ఉపవనాలని అన్నిటినీ చూస్తోంది. సీతమ్మ అరణ్యంలో నడిచివెళుతుంటే, హంసలు కూడా ఆవిడలాగానే నడుద్దామని ప్రయత్నిస్తున్నాయి (ఎందుకంటే, అప్పటిదాకా తమ నడకలని చూసి అందరూ హంసనడక అంటుంటే అవి ఆనందపడేవి, కాని సీతమ్మ అరణ్యానికి వచ్చాక ఆ హంసలన్నీ నడకలు మానేసి ఒక మూల కూర్చున్నాయంట. మీరు ఎందుకు నడవడం లేదు అని ఎవరన్నా అడిగితే, అవి మాకన్నా అందంగా నడిచే ఆవిడ కొత్తగా అరణ్యానికి వచ్చింది, ఆమె నడక ముందు మా నడక ఏపాటిది అని నడవడం మానేసి ఒక మూలను కూర్చున్నాయంట). అలా నడిచిందయ్యా సీతమ్మ ” అని సుమంత్రుడు అన్నాడు.

అప్పుడు కౌసల్య ” ఒక స్త్రీ భర్త చేత, కొడుకు చేత, జ్ఞాతుల(బంధువులు) చేత రక్షింపబడాలి. భర్తవై కూడా నువ్వు నాకు రక్షణ ఇవ్వలేదు. నాకు ఉన్న ఒకే ఒక్క కొడుకుని నా దెగ్గర లేకుండా చేసేశావు. నాకు జ్ఞాతి అన్నవాడెవరూ దెగ్గరలో లేరు. నువ్వు చేసిన ఈ దారుణమైన పని వలన నేను నా కొడుకుకి దూరమయ్యాను. కాబట్టి నేను దిక్కులేని చావైనా చస్తాను, లేకపోతే రాముడి దెగ్గరికన్నా వెళతాను. ఇక నేను నీ ముఖం చూడను. నీ దెగ్గర ఉండను ” అని అనింది.

కౌసల్య మాటలు విన్న దశరథుడు కృంగిపోయి ఇలా అన్నాడు ” నేను దౌర్భాగ్యుడనే కౌసల్యా, నేను ఎందుకూ పనికిరాని వాడిని, దీనుడిని, నేను ధర్మాత్ముడిని అని కాని, మిమ్మల్ని సరిగ్గా ఒక్కనాడైనా చూశానని కాని నేను అనను. నా కంటికి నిద్ర రావడం లేదు, నోటికి తిండి సహించడం లేదు, నన్ను ఓదార్చే వాళ్ళు లేరు, నేను ఎంత బెంగ పెట్టుకున్నానో నీకేమి తెలుసు. ఓదారుస్తావని కదా నీ దెగ్గరికి వచ్చాను, పరమ సాత్వికమైన ప్రవర్తన కలిగిన నువ్వు కూడా నన్ను ఇలా పోడిచేస్తే, నేను కూడా ఈ క్షణంలోనే ప్రాణాలు విడిచిపెట్టేస్తాను కౌసల్య. నువ్వైనా కనీసం ఇలా మాట్లాడడం మానవా, నీ కాళ్ళు పట్టుకుంటాను ” అని రెండు చేతులతో నమస్కారం చేశాడు.

 

| వాల్మీకి మహర్షి రామాయణం అయోధ్యకాండ Valmiki Ramayanam Telugu AyodhyaKaanda Day 11 | వాల్మీకి మహర్షి రామాయణం అయోధ్యకాండ

 

 

న ఏషా హి సా స్త్రీ భవతి శ్లాఘనీయేన ధీమతా |
ఉభయోః లోకయోః వీర పత్యా యా సంప్రసాద్యతే ||

 

కౌసల్య పరుగు పరుగున వచ్చి ఆయన పాదాల వద్ద కూర్చుని, ఆయన రెండు చేతులు తన తల మీద పెట్టుకుని ” మహా ధర్మాత్ముడైన భర్త, భార్య దెగ్గర ఇలా రెండు చేతులు పెట్టి, నిన్ను బతిమాలుతున్నాను అన్నాడంటే, ఆ స్త్రీ జీవితంలో అటువంటి దుర్దినం ఇంక వేరొకటి ఉండదు. కొడుకు వెళ్ళిపోయాడన్న ఆక్రోశంలో ఇలా మాట్లాడాను. నన్ను క్షమించు ” అని ఆయన కాళ్ళ మీద పడిపోయింది.

తరువాత కౌసల్య దేవి దశరథుడిని తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టింది. అప్పుడాయన కౌసల్య, కౌసల్య అని కలవరించగా కౌసల్య, సుమిత్ర ఇద్దరూ వచ్చి ఆయన పక్కన కూర్చున్నాక దశరథుడు ” నేను ఎందుకింత బాధ పడుతున్నానో నాకు ఇప్పుడు అర్థమయ్యింది. పాలు తాగుతున్న పిల్లలకి, తల్లుల యొక్క స్తన్యములు కత్తి పెట్టి నరికేసుంటాను, అందుకని నేను ఇంత బాధ పడుతున్నాను అన్నావు కదా, నీది కాదు దోషం. నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది, నీకు ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా విను. నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఒకసారి వేటాడాలని అనిపించింది. అప్పుడు బాగా వర్షం పడి భూమి అంతా తడిగా ఉంది. ఇప్పుడు క్రూరమృగాలు తప్పకుండా నీళ్ళు తాగడానికి బయటకి వస్తాయని, ఆ రోజూ రాత్రంతా ధనుస్సుకి బాణాన్ని సంధించి కూర్చున్నాను. తెల్లవారే వరకు ఏ మృగము వచ్చినట్టు నాకు కనపడలేదు. తెల్లవారుతుండగా నాకు గుడగుడ శబ్దం వినిపించింది, కాని అప్పటికి ఇంకా చీకటిగానే ఉంది, ఏనుగు తొండంపెట్టి నీళ్ళు తాగుతుందని గ్రహించాను. నాకు శబ్దవేధీ విద్య తెలుసు. అందుకని శబ్దాన్ని బట్టి ఏనుగు యొక్క కుంభస్థలం మీద బాణ ప్రయోగం చెయ్యాలనుకొని చీకట్లో బాణ ప్రయోగం చేశాను. ఏనుగు యొక్క ఘీంకారం వినిపిస్తుందని అనుకున్నాను, కాని నాకు ఒక మనిషి ఆర్తనాదాలు వినపడ్డాయి. నేను భయపడి అక్కడికి వెళ్ళి చూసేసరికి, నేను విడిచిపెట్టిన బాణం గుండెల్లో గుచ్చుకొని ఒక ముని కుమారుడు ఆ నది ఒడ్డున పడి తన్నుకుంటున్నాడు. నేను భయపడుతూ అతని దెగ్గరికి వెళ్ళగా, అతను నేను ముని కుమారుడిని, తపస్సు చేసుకుంటున్నాను, తల్లిదండ్రులని పోషించుకుంటున్నాను. ఇటువంటి నన్ను నిష్కారణంగా బాణం పెట్టి ఎందుకు కొట్టావు అని అడిగాడు. అప్పుడు నేను, నిన్ను కొట్టాలని కొట్టలేదు, నీరు తాగుతున్న శబ్దానికి ఏనుగనుకుని బాణం విడిచిపెట్టాను. నా దురదృష్టం ఆ బాణం నీకు తగిలిందని భయపడుతూ నిలబడ్డాను.

అప్పుడా ముని కుమారుడు నన్ను చూసి, నువ్వు భయపడమాకు, నీకు బ్రహ్మహత్యా దోషం లేదు, ఎందుకంటే నా తండ్రి వైశ్యుడు, నా తల్లి శూద్ర స్త్రీ, కాబట్టి శపించే అధికారం నాకు లేదు. కాని నా తల్లిదండ్రులిద్దరూ అంధులు, అరణ్యంలో కూర్చుని ఉన్నారు. రోజూ నేను గ్రంధ పఠనం చేస్తే, అవి వింటూ ఉంటారు. నేనే వారికి ఆహారం, నీరు తీసుకెళుతుంటాను. ఇప్పుడు వాళ్ళు మహా దాహంతో ఉన్నారు, అందుకనే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు ఈ నీళ్ళు పట్టుకెళ్ళి నా తల్లిదండ్రులకు ఇవ్వు. ఈ బాణపు ములుకు నాలో ఉన్నందున నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను, కనుక నువ్వు ఈ బాణం తీసెయ్యి అన్నాడు.

తీసేస్తే అతను చనిపోతాడు, తీయకపోతే అతను ఆ బాధ తట్టుకోలేకపోతున్నాడు, అందుకని అతను బాధ పడడం ఇష్టం లేక బాణం తీసేసాను. ఆ పిల్లవాడు వెంటనే మరణించాడు. అప్పుడు నేను ఆ నీటి కుండ పట్టుకొని అతని తల్లిదండ్రుల దెగ్గరికి వెళ్ళాను. నా అడుగుల శబ్దం విన్న ఆ అంధులైన తల్లిదండ్రులు, నాయనా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు, మీ అమ్మ నీ కోసం బెంగ పెట్టుకుంది, అని ఆ ముని కుమారుడి తండ్రి అడిగితే నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాను. నా వల్ల పొరపాటు జెరిగింది, మీ కుమారుడిని నేనే సంహరించాను అని చెప్పాను. అప్పుడాయన నన్ను తన కుమారుడి కళేబరాన్ని చూపించమన్నాడు. నేను వాళ్ళని అక్కడికి తీసుకువెళ్లగా వాళ్ళు తమ కుమారుడి శవం మీద పడి రోదించారు. తరవాత ఆ తండ్రి నావంక తిరిగి, నేను ఎలాగైతే ఇప్పుడు నా కుమారుడి మీద పడి ‘హా! కుమారా, హా! కుమారా’ అని పుత్రశోకంతో ప్రాణాలు విడిచిపెడుతున్నానో, నువ్వు కూడా అలాగే ఏడుస్తూ ‘హా! కుమారా’ అంటూ ప్రాణాలు విడిచిపెడతావు అని నన్ను శపించాడు.

ఈలోగ స్వర్గలోకం నుండి ఇంద్రుడు వచ్చి, నువ్వు తల్లిదండ్రులకి చేసిన సేవకి నిన్ను స్వర్గానికి తీసుకు వెళతానని, ఆ ముని కుమారుడిని తన రథంలొ తీసుకెళ్ళాడు. ఆ పిల్లవాడిని విడిచి ఉండలేక ఆ వృద్ధ దంపతులు ఇద్దరూ ప్రాణాలు విడిచిపెట్టారు. అప్పుడు నాకు తెలియలేదు కౌసల్య, ‘హా! కుమారా’ అంటూ మరణించడం ఎంత కష్టమో అని. నేను చేసిన పాపం నన్ను వెంటాడింది. నా చెవులు కూడా వినపడడంలేదు. నా కళ్ళు కనబడడం లేదు. నాకు జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంది. అంతా భ్రాంతిలాగ ఉంది. ఎవరో దూతలు వచ్చి నా ప్రాణాలని లాగేస్తున్నారు. రాముడిని చూసే అదృష్టం నాకు ఇంక లేదు. నేను ఏ తప్పు చెయ్యలేదు, నన్ను మన్నించు. కౌసల్యా, సుమిత్రా, రామా……రామా………” అని ఆ దశరథ మహారాజు ప్రాణాలు విడిచిపెట్టాడు.

అక్కడే కూర్చున్న కౌసల్యా సుమిత్ర, దశరథుడు మూర్చపోయాడనుకున్నారు. వాళ్ళు అక్కడే పడుకొని నిద్రపోయారు. మరునాడు ఉదయం వంది మాగధులు వచ్చి స్తోత్రం చేశారు, కాని మహారాజు ఎంతసేపటికి మేల్కొనకపోయేసరికి అక్కడే నిద్రిస్తున్న కౌసల్యని అడిగారు, ప్రభువు కదలడం లేదని. అప్పుడు కౌసల్య పరదాలను తొలగించి లోపలికి వెళ్ళి చూసేసరికి దశరథుడు మరణించి ఉన్నాడు.

దశరథుడు మరణించాడన్న విషయం తెలుసుకున్న ఆయన భార్యలందరూ అంతఃపురంలో క్రౌంచ పక్షులు లాగ బిగ్గరగా ఏడ్చారు. కౌసల్య దుఃఖానికి అంతులేకుండా పోయింది. నలుగురు కుమారులు ఉన్నప్పటికీ అంచేష్టి సంస్కారం నిర్వహించడానికి ఒక్క కుమారుడు కూడా అందుబాటులో లేని కారణం చేత దశరథుడి శరీరాన్ని తైల ద్రోణిలొ(రాసాయనములలో శరీరాన్ని నిలువ చేసే పద్ధతి, అందులో అలా పెడితే శరీరం పాడవదు) పెట్టారు. ఆ రోజు అందరూ జెరిగినటువంటి ఈ హఠాత్ పరిణామానికి బాధపడుతూ ఉన్నారు. ఆ రాత్రి గడిచిన తరువాత మరునాడు ఉదయం మహర్షులందరూ కూడా సభా మంటపానికి చేరారు.

మార్కణ్డేయో అథ మౌద్గల్యో వామదేవః చ కాశ్యపః |

కాత్యయనో గౌతమః చ జాబాలిః చ మహా యశాః ||
ఏతే ద్విజాః సహ అమాత్యైః పృథగ్ వాచం ఉదీరయన్ |

వశిష్ఠం ఏవ అభిముఖాః శ్రేష్ఠః రాజ పురోహితం ||

 

ఆ  సభలో  మార్కండేయుడుమౌద్గల్యుడువామదేవుడుకాశ్యపుడుకాత్యయనుడుగౌతముడుజాబాలి  మొదలైన  మహర్షులందరూ సమావేశమయ్యారు. ఆ మహర్షులందరూ వశిష్ఠుడితో ఇలా అన్నారు ” మహానుభావ! ఒక్క రోజు రాత్రి రాజు లేకుండా రాజ్యం గడవవలసి వస్తే 100 సంవత్సరాలు గడిచినట్టు ఉంది. రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు. రాజులేని రాజ్యం మీద శత్రువుల దృష్టి పడడం ఒక్కటే కాదు, మెరుపులతో కూడిన వర్షం పడదు, రాజ్యంలోని ఏ కుటుంబంలొ కూడా భర్త మాట భార్య వినదు, ఎక్కడా యజ్ఞయాగాది క్రతువులు చెయ్యరు, ఒకవేళ జెరిగినా దక్షిణలు ఇవ్వరు, ఎక్కడా కూడా పురాణాలు, కావ్యములు మొదలైన వాటిలో ఉండేటటువంటి విశేషములను వివరించడానికి పండితులైన వారు ముందుకి రారు, యుక్త వయస్సులో ఉన్నటువంటి కన్యలు గొప్ప గొప్ప బంగారు ఆభరణములను ధరించి సాయంత్రం పూట సంతోషంగా ఉద్యానవనాలలోకి వెళ్ళి పూవులని కోసుకుంటూ ఆనందంగా కూర్చొని మాట్లాడుకునేటటువంటి పరిస్థితి ఉండదు, ఆడపిల్ల కనబడితే వేధించుకు తినేటటువంటి దుష్ట చూపు కలిగినటువంటి, మనుష్య రూపమైన, యవ్వనంలో ఉన్న మృగాలు బయలుదేరతాయి, తపస్సు చేసుకునేటటువంటి ఋషులు తమ కడుపుని నింపుకోవడం కోసం గ్రామములలోకి రారు, వర్తకులు తమ సంపదని ఎక్కడో దాచుకున్నా కూడా బిక్కు బిక్కు మంటూ బతకవలసిన రోజులు వస్తాయి, ఇది నా భూమి, ఇది నా పొలము అని చెప్పగలిగే వాడు ఉండడు, అన్నిటినీ మించి ప్రజలలో నిస్పృహ, నిరాశ చోటుచేసుకుంటాయి.

రాజా సత్యం చ ధర్మశ్చ రాజా కులవతాం కులం |
రాజా మాతా పితా చైవ రాజా హితకరో నృణాం ||

 

Valmiki Ramayanam Telugu AyodhyaKaanda Day 12 | వాల్మీకి మహర్షి రామాయణం అయోధ్యకాండ

 

రాజె సత్యం, రాజె ధర్మం, రాజె తల్లి, రాజె తండ్రి, రాజె దైవం, రాజె సమస్తం. అందుచేత సింహాసనం ఖాళీగా ఉండడానికి వీలులేదు. యముడు ప్రాణాలు తీస్తాడు, వాయువు గాలి వీచేటట్టు చేస్తాడు, వరుణుడు వర్షం కురిపిస్తాడు, కాని అష్టదిక్పాలకుల సమస్త విధులను రాజు నిర్వహిస్తాడు. ప్రజలు సంతోషంగా బతికేటట్టు, అన్నం తినగలిగేటట్టు, ఎవరి వృత్తియందు వారు సక్రమంగా ప్రవర్తించేటట్టు రాజు చెయ్యగలడు. అందుకని తొందరగా ఇక్ష్వాకువంశ సంజాతుడైన వారికి పట్టాభిషేకం చెయ్యవలసింది ” అని ఆ మహర్షులు అన్నారు.

అప్పుడు వశిష్ఠుడు ” ఇందులో మీరు కాని నేను కాని ఆలోచించాల్సిన విషయం ఏమి లేదు. ఎందుకంటే, దశరథుడు వెళ్ళిపోతూ ఒక నిర్ణయం చేసి వెళ్ళిపోయాడు, భరతుడికి ఈ రాజ్యం దక్కాలని రాముడు అరణ్యవాసం చెయ్యాలని నిర్ణయించాడు. ఆ కారణం చేత భరతుడిని పిలిపించి ఈ సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చెయ్యాలి. కాని భరతుడు తన తాతగారైన కైకేయ రాజు దెగ్గర ఉన్నాడు, ఆ రాజ్యం చాలా దూరంలో ఉంది కనుక, చాలా వేగంగా అశ్వముల మీద వెళ్ళగలిగే దూతలని పంపుదాము ” అని అన్నడు.

https://sharemebook.com/  https://sharemebook.com/  https://sharemebook.com/
Valmiki Ramayanam Telugu AyodhyaKaanda Day 12 | వాల్మీకి మహర్షి రామాయణం అయోధ్యకాండ

Valmiki Ramayanam Telugu AyodhyaKaanda Day 12 | వాల్మీకి మహర్షి రామాయణం అయోధ్యకాండ

Valmiki Ramayanam Telugu valmiki ramayana telugu, ramayana valmiki summary slokas, valmiki ramayanam telugu lo, baala kaanda ramayanam valmiki telugu, telugu valmiki ramayanam, valmiki ramayanam in telugu book, valmiki ramayanam telugu ayodyakanda sloka, valmiki ramayana meaning, Valmiki Ramayanam Telugu ayodyakanda Day 12 | the ramayana by valmiki summary, andhra valmiki ramayanam in telugu, valmiki ramayana telugu pdf, valmiki ramayanam telugu pdf slokam, samkshepa ramayanam telugu, valmiki bala kanda,valmiki ramayana telugu translation Valmiki Ramayanam Telugu ayodyakanda | Valmiki Ramayanam Telugu AyodhyaKaanda Day 12 | వాల్మీకి మహర్షి రామాయణం అయోధ్యకాండ

Valmiki Ramayanam Telugu AyodhyaKaanda Day 12

 

తరువాత వశిష్ఠుడు సిద్ధార్థుడుజయంతుడువిజయుడుఅశోకుడు అనే నలుగురు దూతలని సిద్ధం చేసి కైకేయ రాజ్యానికి వెళ్ళి ఆ కైకేయ రాజుకి విశేషమైన ధనాన్ని బహుమతిగా ఇవ్వమన్నాడు. కాని అక్కడ మీరు రాముడు అరణ్యాలకి వెళ్లినట్టు కాని, దశరథ మహారాజు మరణించినట్టు కాని ఎవరికీ చెప్పవద్దు అన్నాడు. భరతుడిని నేను కుశలం అడిగానని చెప్పి, ఒక్క క్షణం ఆలస్యం కాకుండా అయోధ్యా నగరాన్ని చేరుకోవాలని నేను ఆజ్ఞాపించానని చెప్పి తీసుకురండి అన్నాడు. అప్పుడా దూతలు మార్గమధ్యంలో తినడానికి కావలసిన ఆహార సంభారములని సమకూర్చుకొని అడ్డదారిలో బయలుదేరారు. వాళ్ళు రాజభక్తి కలిగిన వారు కనుక, వెళ్ళే దారిలో కంటికి తృప్తినిచ్చే విషయాలు కనిపించినా ఆగకుండా వెళ్ళారు. అలా వారు అయోధ్య నుండి పడమటికి బయలుదేరి అపరతాలము అనే పర్వతాన్ని దాటి, మాలినీ నది తీరం గుండా ప్రయాణం చేసి, ప్రలంబ పర్వతానికి ఉత్తరం వైపు తిరిగి, అక్కడినుంచి పశ్చిమాభి ముఖంగా ప్రయాణం చేసి, హస్తిన నగరాన్ని సమీపించి, అక్కడ ప్రవహిస్తున్న గంగా నదిని దాటి, మళ్ళి పశ్చిమాభి ముఖంగా తిరిగి, అక్కడినుంచి కురు దేశంలో ఉండేటటువంటి జాఙ్గలం అనే గ్రామంలోకి వెళ్ళి, అక్కడినుంచి పాంచాల రాజ్యాన్ని చేరి, శరదండము అనే నదిని దాటి, పశ్చిమాభి ముఖంగా ప్రయాణం చేసి, నికూలవృక్షము అనే మహా వృక్షాన్ని చేరి, అక్కడినుంచి కులింగ పట్టణం చేరుకొని అక్కడినుంచి అభికాలము అనే గ్రామాన్ని చేరుకొని, తరువాత ఇక్షుమతి నదిని దాటి, బాహ్లిక దేశాన్ని చేరుకొని, దాని మధ్యలోనుంచి బయలుదేరి సుదామము అనే విష్ణు పధాన్ని చేరుకొని, అక్కడినుంచి విపాశా నదిని దాటి, శాల్మలీ వృక్షము అనే గొప్ప ప్రాంతాన్ని చేరుకొని, అక్కడినుంచి బయలుదేరి రాత్రికి గిరివ్రజాన్ని(గిరివ్రజం కైకేయ రాజ్యానికి రాజధాని) చేరుకున్నారు. తెల్లవారాక భరతుడి దర్శనం కోసం లోపలికి ప్రవేశించారు.

అదే రోజు తెల్లవారుతుండగా భరతుడికి పీడకల వచ్చింది. తెల్లవారే సరికి ఆయన మనస్సులో స్వస్థత లేదు, అందువలన ఆయన కాంతి తగ్గిపోయి చాలా తేజోవిహీనంగా ఉన్నాడు. ఆయన మిత్రులు ఇది గమనించి అడుగగా, భరతుడు ఇలా చెప్పాడు ” నాకు తెల్లవారుజామున ఒక కల వచ్చింది. ఆ కలలో మా తండ్రిగారైన దశరథ మహారాజు ఒక పర్వతం మీద నిలబడ్డారు. ఆయన అక్కడినుంచి కిందపడిపోయారు. పడిపోతున్నప్పుడు తిన్నగా వెళ్ళి పేడతో ఉన్న ఒక పెద్ద బిలంలో పడిపోయారు. అందులో తేలుతూ నూనెని దోసిళ్ళలో పోసుకొని తాగుతున్నారు, తరువాత ఆ నూనెని ఒంటి నిండా పూసుకున్నారు. తరువాత ఆయన తన తలని కిందకి వాల్చేసి ఉండగా నేను ఒక ఆశ్చర్య విషయాన్ని స్వప్నంలొ చూశాను. సముద్రం అంతా ఎండిపోయి భూమి అయిపోయింది. ఆకాశంలో ఉన్న చంద్రుడు భూమి మీద పడిపోయాడు. ఈ భూమండలం అంతా బద్దలయిపోయింది. అనుకోకుండా చీకటి ఏర్పడింది. రాజు ఎక్కే భద్రగాజానికి ఉండే దంతం విరిగిపోయింది. హోమంలొ ఉన్న అగ్ని ఒక్కసారి ఆగిపోయింది. దానితోపాటు మా తండ్రిగారు ఒక ఇనుప పీట మీద కూర్చుని, ఎర్రటి వస్త్రాన్ని కట్టుకొని, ఎర్ర చందనం రాసుకొని, ఎర్రటి మాలలు వేసుకొని పూజ చేసుకుంటున్నారు. అటువంటి సమయంలో ఎక్కడినుంచో నల్లటి ఎర్రటి రంగు వస్త్రములు కట్టుకున్న స్త్రీలు వచ్చి వికృతంగా నవ్వుతున్నారు. అప్పుడు మా నాన్నగారు గాడిదలు పూన్చిన రథం ఎక్కారు. అప్పుడు ఈ స్త్రీలు ఆయన మెడలో పాశాలు వేసి, ఆయనని ఆ రథాన్ని దక్షిణ దిక్కుకి ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇలా తెల్లవారుజామున ఎవరు గాడిదల రథం మీద కూర్చున్నట్టు కనపడ్డాడో, వాడు చితి మీద పడుకొని ఉండగా, ఆ శరీరం కాలిపోతున్నటువంటి ధూమాన్ని కొద్దిరోజులలోనే చూడవలసి వస్తుంది. అందుచేత నాకు నా తండ్రిగారి మీద బెంగ పట్టుకుంది, దానితో పాటుగా నా మీద నాకు ఎందుకో అసహ్యం వేస్తుంది. ఇవన్నీ చూస్తుంటే ఏదో ప్రమాదం జెరిగిందని నాకు అనిపిస్తుంది ” అని అన్నాడు.

ఇంతలో అయోధ్య నుంచి వచ్చిన దూతలు లోపలికి వచ్చారు. వాళ్ళని చూసిన భరతుడు…..

ఆర్యా చ ధర్మ నిరతా ధర్మజ్ఞా ధర్మ దర్శినీ |
అరోగా చ అపి కౌసల్యా మాతా రామస్య ధీమతః ||

 

” సర్వకాలముల యందు ధర్మాన్ని మాత్రమే అనుష్టానము చేస్తూ, ధర్మం వంక చూస్తూ, ధర్మం తెలిసినటువంటి రామ మాత అయిన కౌసల్య ఏ ప్రమాదం లేకుండా ఆరోగ్యంగా ఉందా. శత్రుఘ్నడికి, లక్ష్మణుడికి తల్లి అయిన సుమిత్ర ఏ రోగం లేకుండా ఆరోగ్యంగా ఉందా.

ఆత్మ కామా సదా చణ్డీ క్రోధనా ప్రాజ్ఞ మానినీ |
అరోగా చ అపి కైకేయీ మాతా మే కిం ఉవాచ హ ||

 

మా అమ్మ కైక ఎప్పుడూ కోరికలతో తిరుగుతూ ఉంటుంది, చాలా కోపంతో ఉంటుంది, అటువంటి కైకేయకి ఎటువంటి అనారోగ్యం లేదుకదా. దశరథుడు, రామలక్ష్మణులు కుశలంగా ఉన్నారా ” అని అడిగాడు.

అప్పుడా దూతలు ” నువ్వు ఎవరెవరు కుశలంగా ఉండాలని కోరుకున్నావో, వాళ్ళంతా కుశలంగా ఉన్నారు. నిన్ను తొందరలో లక్ష్మి వరించబోతోంది, నువ్వు ఉత్తరక్షణం బయలుదేరి రావాలని వశిష్ఠుడు ఆదేశించాడని ” చెప్పారు.

అప్పుడు భరతుడు తన తాతగారైన కైకేయ రాజు( ఆయన అసలు పేరు ఆశ్వపతి) దెగ్గరికి వెళ్ళి, తన తిరుగు ప్రయాణానికి అనుమతి తీసుకున్నాడు. అప్పుడా కైకేయ రాజు భరతుడికి ఏనుగులు, మృగ చర్మాలు, 2000 బంగారు హారాలు, 1600 గుర్రాలు బహూకరించాడు. మేనమామైన యుధాజిత్, ఐరావతం యొక్క వంశంలో జన్మించిన ఏనుగుల్ని, కంచర గాడిదలని, వేట కుక్కలని బహూకరించాడు. తన బహుమానలన్నిటిని వెనుక పరివారానికి అప్పగించి తాను మాత్రం తొందరగా వెళ్ళాలని కొంతమందితొ కలిసి అయోధ్యకి బయలుదేరాడు భరతుడు. దూతలు అసలు విషయం చెప్పలేదు కనుక, ఆయన వాళ్ళు వచ్చిన మార్గంలో వెళ్ళలేదు.

ఆయన బయలుదేరి సుదామహ్లాదినిశతద్రువుశిలావాహ అనే నాలుగు నదులను దాటాడు. అక్కడినుంచి శల్య కర్తన నగరాన్ని, చైత్ర రథం నగరాన్ని దాటాడు. సరస్వతిగంగా నదులను దాటాడు. తరువాత వీరమత్సాం అనే దేశానికి వచ్చాడు, కులింగ నదిని దాటాడు, తరువాత మహారణ్యంలోకి ప్రవేశించాడు, అక్కడినుంచి భాగీరథీ నదిని దాటాడు, తరువాత ప్రాగ్వాటము అనే పట్టణానికి చేరుకున్నాడు, తరువాత కుటికోష్ఠికము అనే నదిని దాటాడు, అక్కడినుంచి ధర్మవర్ధనముతోరణమువరూథి అనే గ్రామాలు దాటాడు, తరువాత ఉజ్జహాసం అనే నగరంలోకి వచ్చాడు, తదనంతరం సరస్వతి తీర్థం అనే గ్రామాన్ని దాటాడు, అక్కడ ఉత్తానికా అనే నదిని దాటాడు, అక్కడినుంచి హస్తిపృష్ఠికము అనే గ్రామంలోకి ప్రవేశించి కుటికా నదిని దాటాడు, తరువాత కపివతీ అనే పట్టణానికి చేరుకున్నాడు, అక్కడినుంచి ఏకశాల అనే గ్రామానికి వచ్చాడు, తరువాత స్థాణుమతీ అనే ఊరిని దాటాడు, తరువాత గోమతీ అనే నదిని దాటి ఒక రాత్రంతా ప్రయాణం చేసి అయోధ్యా పట్టణానికి చేరుకున్నాడు. తన తాతగారి దెగ్గరినుండి బయలుదేరి అయోధ్యకి రావడానికి భరతుడికి 8 రాత్రుళ్ళు పట్టాయి. ఆయన అయోధ్యకి రాగానే అక్కడున్న ప్రజల పరిస్థితిని చూసేసరికి ఆయన మనస్సు మరింత బరువయ్యింది. భరతుడిని చూడగానే అందరూ తలుపులు మూసేసి లోపలికి వెళ్ళిపోతున్నారు. ఎవరూ సంతోషంగా కనపడలేదు.

అప్పుడాయన తిన్నగా దశరథ మహారాజు మందిరానికి వెళ్ళాడు. దశరథుడి కోసం అన్ని గదులు వెతికాడు, అక్కడున్న వారెవరూ సంతోషంగా లేరు. రాజు ఇక్కడ లేకపోతే మా అమ్మ కైకేయ మందిరంలో ఉంటాడని, గబగబా కైక మందిరంలోకి వెళ్ళాడు. అక్కడున్న కైకేయకి నమస్కారం చేశాడు. అప్పుడా కైకేయ భరతుడిని సంతోషంగా తన పక్కన కూర్చోపెట్టుకొని ” చాలా సంతోషంగా గడిపావ, అందరూ ఆనందంగా ఉన్నారా, అక్కడి విశేషాలు ఏంటో నాకు చెప్పు ” అని అనింది.

అప్పుడు భరతుడు ” అమ్మ! నాకు ఇక్కడికి రావడానికి 8 రాత్రుళ్ళు పట్టింది, అక్కడ అందరూ బాగానే ఉన్నారు కాని, నా తండ్రిగారైన దశరథ మహారాజుగారి పాదాలకి నమస్కారం చెయ్యాలని నా మనస్సు కోరుకుంటుంది, నీ మందిరంలోని ఈ తల్పం మీద వారు పడుకొని ఉండేవారు కదా, వారు ఇప్పుడు ఇక్కడ లేరు. అమ్మా! తండ్రిగారు కౌసల్య మందిరంలో ఉన్నారా ” అని అడిగాడు.

Valmiki Ramayanam Telugu AyodhyaKaanda Day 12 | వాల్మీకి మహర్షి రామాయణం అయోధ్యకాండ





Valmiki Ramayanam Telugu Balakanda Day 6 | వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండ

 

 

ఈ మాటలు విన్న కైకేయ చాలా తేలికగా,
యా గతిః సర్వ భూతానాం తాం గతిం తే పితా గతః |
రాజా మహాత్మా తేజస్వీ యాయజూకః సతాం గతిః ||

 

” చిట్టచివరికి అన్ని భూతములు ఎక్కడికి వెళ్ళిపోతాయో, మీ నాన్న కూడా అక్కడికి వెళ్ళిపోయాడు ” అనింది.
అప్పటిదాకా తల్లి ఒడిలో కూర్చున్న భరతుడు ఈ మాట వినగానే, ఒక మదించిన ఏనుగు నేల మీద పడినట్టు కింద పడిపోయి పొర్లి పొర్లి ఏడిచాడు.

అప్పుడా కైకేయ ” ఓ రాజా! నువ్వు ఇలా నేల మీద పొర్లి ఏడవచ్చా, గొప్ప గొప్ప సభలలో కుర్చోవలసిన వాడిని ఇలా నేల మీద పొర్లడమేమిటి, పైకి లేచి కూర్చో ” అనింది.

అప్పుడు భరతుడు ” అమ్మా! నాన్నగారు చిట్టచివర ఏ వ్యాధి కలిగి వెళ్ళిపోయారమ్మా, రాముడికి పట్టభిషేకమో లేక నాన్నగారు ఏదన్నా యజ్ఞం చేస్తున్నారేమో, అందుకని నన్ను తొందరగా రమ్మన్నారని వచ్చానమ్మ, నాన్నగారు వెళ్ళిపోయేటప్పుడు రాముడు పక్కనే ఉండుంటాడు. తండ్రిగారు వెళ్ళిపోతే అన్నగారు తమ్ముళ్ళకి తండ్రిలాంటి వాడని ఆర్యులు చెప్తారు కదా. అందుకని నేను ఇప్పుడు రాముడి పాదాలు పట్టుకుంటే దశరథ మహారాజుగారి పాదాలు పట్టుకున్నంత సంతోషం కలుగుతుందమ్మ. అసలు దశరథ మారాజు ఎలా చనిపోయారు, చిట్టచివర చనిపోయేముందు ఆయన ఏమన్నారో నాకు చెప్పమ్మా ” అన్నాడు.

” మీ నాన్న వెళ్ళిపోయేముందు, ‘హా! రామ, హా! లక్ష్మణా, హా! సీతా’ అంటూ చనిపోయాడురా, చినిపోతూ చనిపోతూ, ఈ సీతారామలక్ష్మణులు తిరిగి రాజ్యానికి వచ్చినప్పుడు వాళ్ళని చూసిన వాళ్ళు ధన్యులు, నేను వాళ్ళని చూడలేను కదా అని ఏడ్చి ఏడ్చి చనిపోయాడురా ” అని కైకేయ చెప్పింది.

మరి ఆ సమయంలో సీతారామలక్ష్మణులు ఎక్కడున్నారు అని భరతుడు అడుగగా, వాళ్ళ ముగ్గురూ అరణ్యాలకి వెళ్ళిపోయారు అని కైకేయ చెప్పింది. అరణ్యాలకి ఎందుకు వెళ్ళారు అంటె, మీ నాన్న పంపించేసాడు అని చెప్పింది.
అప్పుడు భరతుడు ” నాన్న ఎందుకు పంపించారమ్మ రాముడిని, రాముడు ధర్మాత్ముడు, అరణ్యాలకి పంపించాలంటే కొన్ని కారణాలు ఉంటాయి. బ్రాహ్మణుల ద్రవ్యాన్ని రామచంద్రమూర్తి అపహరించాడ, పరస్త్రీని దోష బుద్ధితో చూశాడ, పరకాంతని అనుభవించాడ, యజ్ఞయాగాది క్రతువులను ధ్వంసం చేశాడ, అప్పుడే పుట్టిన పిండాన్ని నశింప చేశాడ. ఇలాంటి పాపాలు చేసేవాడు రాముడు కాదె, రాముడిని అడవులకు ఎందుకు పంపించారు, రాముడితో లక్ష్మణుడు ఎందుకు వెళ్ళాడు, అసలు ఏమి జెరిగిందో నాకు యధాతధంగా చెప్పు ” అన్నాడు.

అప్పుడా కైకేయ ఎంతో సంతోషపడిపోతూ ” నీకోసమే నేను ఇదంతా చేశాను. దశరథుడు రాముడికి పట్టాభిషేకం చెద్దామనుకున్నాడు. నువ్వు చెప్పిన దోషాలు రాముడి యందు ఉంటాయ, పరకాంతని అనుభవించడం ఏమిటిరా, రాముడు పరకాంతని కన్నెత్తి చూడడు, అంతటి ధర్మాత్ముడు. కాని నీకు రాజ్యం దక్కాలని నేనే దశరథుడిని రెండు వరాలు అడిగాను. 14 సంవత్సరాలు రాముడిని దండకారణ్యానికి పంపించమన్నాను, నీకు పట్టాభిషేకం చెయ్యమన్నాను. సత్యపాశములకు బద్ధుడైన నీతండ్రి అంగీకరించాడు. అందువలన రాముడు దండకారణ్యానికి వెళ్ళిపోయాడన్న బెంగ చేత రెండు మూడు రోజులలోనే కృంగి కృశించి నశించిపోయాడురా. ఇప్పుడు ఈ రాజ్యంలో నిన్ను ఎదిరించగలిగే వాళ్ళు ఎవరూ లేరు. మీ నాన్నగారి శరీరం ఇంట్లోనే ఉండిపోయింది, దాన్ని తొందరగా తీసుకెళ్ళి ప్రేతకార్యం పూర్తి చేసేసి, చక్కగా వశిష్ఠుడితో మాట్లాడి నువ్వు పట్టాభిషేకం చేయించుకో, నాకు చూడాలని ఉంది ” అనింది.

ఈ మాటలు విన్న భరతుడు కైకేయ వంక విచిత్రంగా చూసి ” అమ్మా! నువ్వు ఇటువంటి దారుణమైన పని చేస్తావని నేను ఎన్నడూ ఊహించలేదు. నేను నీతో మాట్లాడేటప్పుడు ఏనాడైనా నాకు రాజ్యం పట్ల కోరిక ఉందని కాని, రాముడు నాకు కంటకంగా మారుతాడని కాని నీతో చెప్పాన. నిన్ను ఎవరు అడగమన్నారు రాజ్యాన్ని, నీకు మించిన భారాన్ని నెత్తి మీద వేసుకున్నావు, ఇక్ష్వాకు వంశంలో కాళరాత్రి ప్రవేశించినట్టు ప్రవేశించావు,  నువ్వు నాకు తల్లివి కావు, నేను నీకు కొడుకుని కాదు, నేను నిన్ను అమ్మగా విడిచిపెడుతున్నాను. ఇప్పుడే నా మొలకి ఉన్న కత్తి తీసి నీ కుత్తుక కత్తిరించాలి, కాని నిన్ను చంపేస్తే, తల్లిని చంపినవాడు భరతుడు అని రాముడు నాతో మాట్లాడడు. రాముడు మాట్లాడడన్న బెంగ చేత నిన్ను వదిలేస్తున్నాను. రాముడు కౌసల్యని ఎలా చూశాడో, నిన్ను అలానే చూశాడు. ఈ ఇక్ష్వాకు వంశంలో రాజ్యాన్ని ఎప్పుడూ పెద్దవాడు మాత్రమే అనుభవించాలి. నేను రాజ్యాన్ని అంగీకరిస్తానని ఎలా అనుకున్నావు. దశరథ మహారాజు కూడా రాముడి సహకారం తీసుకొని ఈ రాజ్యాన్ని పరిపాలించాడు. నువ్వు చేసిన ఈ పాపకృత్యానికి ఇవ్వాళ మూడు దుష్కరమైన విషయాలు జెరిగాయి, నా తండ్రి శరీరాన్ని విడిచిపెట్టాడు, ధర్మమూర్తి అయిన రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు, ఏ పాపం ఎరుగని నా మీద, భరతుడికి రాజకాంక్ష ఉందన్న అపవాదు పడింది. నేను ఎంతమందికి చెప్పుకుంటే నా మీద పడ్డ అపవాదు పోతుంది, నువ్వు తల్లివి కాదు, నాకు అపవాదు తెచ్చిన దౌర్భాగ్యురాలివి.

అమ్మా! నీకు ఒక విషయం చెప్తాను, ఒకానొకనాడు ఆకాశంలో కామధేనువైన సురభి వెళ్ళిపోతుండగా, భూమండలం మీద ఒక రైతు విపరీతమైన ఎండలో, శోషించిపోతున్న రెండు ఎద్దులని నాగలికి కట్టి, డొక్కలతో పొడుస్తూ సేద్యం చేయిస్తుంటే సురభి కన్నులవెంట నీరు కార్చింది (ఈ భూమండలం మీద ఉన్న ఆవులు, ఎద్దులు ఆ సురభి యొక్క సంతానమే). దేవేంద్రుడు ఐరావతం మీద వెళుతుండగా, ఆయన చేతి మీద సురభి కన్నీటి చుక్కలు పడ్డాయి. దివ్యపరిమళం కలిగిన కన్నీటి బిందువులు ఎవరివా అని ఇంద్రుడు పైకి చూసేసరికి, సురభి ఏడుస్తూ కనిపించింది. వెంటనే ఇంద్రుడు ఐరావతం దిగి అమ్మా! ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు, అప్పుడా సురభి ” నాకు కొన్ని కోట్ల మంది బిడ్డలు ఉండచ్చు, ఈ భూమండలంలో ఉన్న ఆవులు, ఎద్దులు నా శరీరం నుంచి వచ్చినవే. ఇంతమంది బిడ్డలు ఉన్నా, ఈ రెండు ఎద్దులని రైతు పొడుస్తూ, ఎండలో సేద్యం చేయిస్తుంటే, నా బిడ్డలని ఇంత కష్టపెడుతున్నాడని దుఖం ఆగక ఏడిచాను ” అని, కోట్ల మంది బిడ్డలు కలిగిన సురభి అనింది. మరి ఒక్కగానొక్క కుమారుడు అమ్మా కౌసల్యకి, లేకలేక పుట్టినవాడు, ధర్మాత్ముడు, అటువంటి వాడిని 14 సంవత్సరాలు అరణ్యాలకి పంపావె, కొడుకు పక్కన లేడని, భర్త మరణించాడని కౌసల్య ఎంత ఏడుస్తుందో ఆలోచించావ. నువ్వు చెప్తే రాజ్యాన్ని ఎలుతాననుకున్నావా, ఒక్కనాటికి అది జెరగదు. ఇక నువ్వు బతికుండడం అనవసరం. వెంటనే అంతఃపురానికి వెళ్ళి ఉరివేసుకో, అదొక్కటే నీకు ప్రాయశ్చిత్తం ” అని భరతుడు అన్నాడు.

ఈ మాటలు విన్న కైకేయ మీద పిడుగుపడినట్టు అయ్యింది, భరతుడు వేసిన కేకలకి మంత్రులందరూ చుట్టూ చేరారు. ఈ కేకలు విన్న కౌసల్య, భరతుడు వచ్చాడని గ్రహించి, భరతుడిని చూద్దామని సుమిత్రతో కలిసి బయలుదేరింది. ఇక నేను ఈ కైకేయ మందిరంలో ఉండనని, భరతుడు కౌసల్య మందిరానికి బయలేదేరాడు. భరతుడి వెంట శత్రుఘ్నుడు వెళ్ళాడు. అటువేపు నుంచి కౌసల్య, సుమిత్రతో భరతుడికి ఎదురురాగా, భరతుడు కౌసల్య పాదాల మీద పడి ఎడిచాడు. అప్పుడు కౌసల్య భరతుడిని పైకి లేపి ” రాజ్యం కావాలని కోరుకున్నావు కదా, మీ అమ్మ నీ కోరిక తీర్చింది. నువ్వు లేనప్పుడు రెండు వరాలు అడిగింది. నా కొడుకు అడవులని పట్టి వెళ్ళిపోయాడు. నీకు ఎటువంటి కంటకం లేదు. హాయిగా ఈ రాజ్యాన్ని ఏలుకో. నాకు ఒక్క ఉపకారం చెయ్యి. నా భర్త మరణించాడు, ఇక ఈ రాజ్యంలో నా అన్నవారు ఎవరూ లేరు, అందుకని నన్ను అరణ్యంలో ఉన్న నా కుమారుడి దెగ్గర దిగబెట్టు ” అని అనింది.

Valmiki Ramayanam Telugu AyodhyaKaanda Day 12 

 

భరతుడు కౌసల్య కాళ్ళు గట్టిగా పట్టుకొని ” అమ్మా! నువ్వు కూడా నన్ను అలా అనుకున్నావ. నా గురించి నీకు తెలుసు కదా, నేను అటువంటి బుద్ధి ఉన్నవాడినా? నాకు నిజంగా రాముడు అరణ్యాలకి వెళ్ళి పోతున్నాడన్న విషయం తెలిసుంటే, నేను రాజ్యం కోరుకున్నవాడినైతే, ఇటువంటి మహా పాపములు చేసిన వాడినవుదునుగాక ” అని కొన్ని పాపాలు చెప్పాడు భరతుడు. అవి ఏంటంటే ” గురువుల చేత సమస్తమైన విద్యలు తెలుసుకొని కూడా, ఆ విద్యలు ఆచరించనటువంటి కృతజ్ఞుడనవుదునుగాక, నిద్రపోతున్న ఆవుని కాని, ఎద్దుని కాని తన్నినవాడికి, సేవకుల చేత చాలా కష్టమైన పని చేయించుకొని, ఆ పనికి తగిన వేతనము ఇవ్వని వాడికి, ఇంట్లో సౌందర్యవతియై తనని అనువర్తించే భార్య ఉండగా, ఆ భార్యతో క్రిడించకుండా పర భార్యలయందు దృష్టి కలిగిన వాడికి, రుతుస్నానం చేసిన భార్య ఇంట ఉండగా, అటువంటి భార్యతో సంగమించనటువంటి వాడికి, ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులకి పెట్టకుండా మధుర పదార్ధాన్ని తానొక్కడే తిన్నవాడికి, అందరూ తాగే నీళ్ళల్లో విషం కలిపిన వాడికి, విషం, లోహం అమ్ముకున్నవాడికి, యుక్త వయస్సు వచ్చిన తరువాత కూడా వివాహం చేసుకోనటువంటివాడికి, ఋషుల, పితృదేవతల, దేవతల రుణాన్ని తీర్చుకోవడం కోసమని, వివాహం చేసుకొని సంతానం కననటువంటివాడికి, అన్నిటినీమించి ప్రజల దెగ్గర పన్ను తీసుకొని, తిరిగి ఆ ప్రజలకి కావలసిన సదుపాయాలని కల్పించనటువంటి రాజుకి, కొత్తగా ఈనినటువంటి పశువు యొక్క దూడ మళ్ళి పాలు తాగడానికి వస్తే, ఆ పొదుగులో పాలు ఉంచకుండా, ఆ పాలతో జున్ను వండుకొని తిన్నవాడికి, సూర్యుడికి, చంద్రుడికి ఎదురుగా నిలిచి మలమూత్రములు విసర్జన చేసినవాడికి, ఇళ్ళు తగలబెట్టినవాడికి ఎటువంటి పాపము వస్తుందో, నాకు అటువంటి పాపము వస్తుంది ” అని అన్నాడు.

అప్పుడు కౌసల్య ” నాయనా నువ్వు ఎటువంటివాడివో నాకు తెలుసు, కాని పుత్రుడు దూరంగా వెళ్ళిపోయాడన్న బాధతో అలా మాట్లాడను ” అని భరతుడిని తన ఒడిలో కుర్చోపెట్టుకుంది. ఆ రాత్రంతా భరతుడు ఏడుస్తూనే గడిపాడు.

తెల్లవారగానే వశిష్ఠుడు మొదలైన మహర్షులు వచ్చి ” నీ తండ్రి శరీరం తైల ద్రోణిలొ ఉండిపోయింది. ఆయనకి అంచేష్టి సంస్కారం చెయ్యకపోతే ఉత్తమగతులు కలగవు, కావున ఆ పనియందు దృష్టి పెట్టు ”  అన్నారు.

అప్పుడా దశరథ మహారాజు పార్థివ శరీరాన్ని తైల ద్రోణి నుంచి పైకి తీసి బయట పెట్టారు. అందరూ వచ్చి చూశారు. అక్కడినుంచి ఆయనని శిబికలోకి పెట్టారు. తరువాత ఆ శిబికతో శరీరాన్ని చితి మీద పెట్టారు. భరతడు, శత్రుఘ్నుడు అగ్నిహోత్రం తీసుకొచ్చి వెలిగించారు. తరువాత అందరూ సరయు నదికి వెళ్ళి స్నానం చేశారు (ఆ కాలంలో ఇక్ష్వాకు వంశంలో ఆడవారు కూడా చితి దెగ్గరికి వచ్చేవారు). రెండు మూడు రోజుల తరువాత కొన్ని లక్షల గోవుల్ని, బంగారాన్ని దానం చేశారు. అందరికి భోజనాలు పెట్టారు, 13వ రోజున అసౌచం తీరిపోయాక మంత్రులందరూ కలిసి భరతుడి దెగ్గరికి వెళ్ళి సింహాసనం ఖాళీగా ఉండకూడదు, మీ తండ్రిగారి కోరిక ప్రకారం నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించు అన్నారు.

అప్పుడు భరతుడు పట్టాభిషేకానికి తీసుకువచ్చిన సంభారములన్నిటికి ఒకసారి ప్రదక్షిణం చేసి,

రామః పూర్వో హి నో భ్రాతా భవిష్యతి మహీ పతిః |
అహం తు అరణ్యే వత్స్యామి వర్షాణి నవ పంచ చ ||

 

” నాకు ముందు పుట్టిన రాముడు ఈ అభిషేక సంభారములతో యువరాజ పట్టాభిషేకం చేసుకోవాలి, సింహాసనం మీద కూర్చొని రాజ్యం పరిపాలించాలి, కాని మా నాన్నగారి ఆజ్ఞ ప్రకారం 14 సంవత్సరాలు దండకారణ్యంలో ఉన్నాడు. రాముడికి నాకు తేడా లేదు, రాముడి బదులు నేను 14 సంవత్సరములు అరణ్యవాసం చేస్తాను, రాముడు వచ్చి పట్టాభిషేకం చేసుకుంటాడు. అందుకని మీరందరూ వెళ్ళి మంచి వడ్రంగులని, శిల్పులని తీసుకువచ్చి, రాజ్యంనుంచి రాముడు దండకారణ్యంలో ఎక్కడున్నాడో అక్కడివరకు దారి చెయ్యండి. నాతో పాటు అయోధ్యా అంతా కదిలి వెళ్ళిపోవాలి, ఇంతమంది అడిగితే రాముడు కాదనలేడు. కావున ఇంతమంది వెళ్ళడానికి తగిన ఏర్పాట్లు చెయ్యండి ” అన్నాడు.

ఈ వార్త అయోధ్యలోని ప్రతివారికి చేరింది, అందరూ ఆ వార్త విని మురిసిపోయారు.

ఆ ముందు రోజు భరతుడు శత్రుఘ్నుడు ఇలా మాట్లాడుకుంటున్నారు ” అసలు ఇంత జెరుగుతుంటే లక్ష్మణుడు ఎందుకు ఊరుకున్నాడు, మూర్ఖురాలై మా అమ్మా కైకేయ రెండు వరాలు అడిగి ఉండవచ్చు, సత్యపాశములచేత బందింపబడ్డ దశరథ మహారాజు ఆ రెండు వరాలని కైకేయకి ఇచ్చి ఉండవచ్చు, కాని రామలక్ష్మణులు దశరథుడిని నిగ్రహించి రాజ్యం ఎందుకు తీసుకోలేదు, మా అమ్మకి ఎందుకు బుద్ధి చెప్పలేదు ” అని వారు మాట్లాడుకుంటుండగా, అటువైపు నుంచి మంథర వచ్చింది. కైకేయ ఇచ్చిన ఆభరణములతో ఆ మంథర వెళుతుండగా చూసిన భటులు ఆమెని పట్టుకొని అసలు రామలక్ష్మణులు అరణ్యాలకి వెళ్ళడానికి కారణం ఈ మంథర అని చెప్పారు. అప్పుడు శత్రుఘ్నుడు ఆగ్రహంతో తన కత్తిని తీసి ఆ మంథరని ఈడ్చుకుంటూ భరతుడి దెగ్గరికి తీసుకొచ్చాడు. ఆ సమయంలో శత్రుఘ్నుడి భీకరమైన స్వరూపాన్ని చూసి కైకేయ మరియు సుమిత్ర యొక్క అంతఃపురాలలోని జనాలు పారిపోయారు. ఇప్పుడు భరత శత్రుఘ్నులని ఆపగలిగేది కౌసల్య ఒక్కత్తే అని, అందరూ కౌసల్య మందిరానికి పరుగుతీసారు. ఆ మంథరని శత్రుఘ్నుడు పొడవబోతుండగా, అప్పుడే కైకేయ అక్కడికి వచ్చి నిలబడింది.

 

హన్యాం అహం ఇమాం పాపాం కైకేయీం దుష్ట చారిణీం |
యది మాం ధార్మికో రామః న అసూయేన్ మాతృ ఘాతకం ||

 

అప్పుడు భరతుడు ” అయ్యయ్యో శత్రుఘ్ను, ఆ మంథరని చంపుతానంటావేంటి. ఈ మంథర మాటలు విని ఇంత ఉపద్రవం తీసుకొచ్చింది ఆ కైకేయి. నాకు ఆవిడని చంపెయ్యాలని ఉంది, కాని ఎందుకు చంపడంలేదో తెలుసా, ఆమెని చంపేస్తే మాతృఘాతకుడు అని రాముడు నాతో మాట్లాడడు. దాన్నే వదిలేశాక దీన్ని వదిలెయ్యడం పెద్ద లెక్కా. దీన్ని చంపినా, స్త్రీని చంపిన వాళ్ళు అని, రేపు మనం అరణ్యానికి వెళ్ళినప్పుడు రాముడు ముఖం పక్కకి తిప్పుకుంటాడు. రాముడిని చూడకుండా మనం ఉండలేము, అందుకని దాన్ని వదిలెయ్యి ” అన్నాడు.

భరతస్య వచః శ్రుత్వా శత్రుఘ్నః లక్ష్మణ అనుజః |

న్యవర్తత తతః రోషాత్ తాం ముమోచ చ మంథరాం ||

అప్పుడు లక్ష్మణుడి తమ్ముడైన శత్రుఘ్నుడు, భరతుడి మాట విని, తన మనస్సు మార్చుకొని మంథరని విడిచిపెట్టాడు.

మరునాడు ఉదయం వశిష్ఠుడు సామంత రాజులతో, పురోహితులతో, అందరితో గొప్ప సభ ఏర్పాటు చేశారు. తరువాత భరతుడు కూడా వచ్చాడు. అప్పుడు వశిష్ఠుడు ” నాయనా! నీ తండ్రి అయిన దశరథ మహారాజుగారు ఈ రాజ్యాన్ని నువ్వు అనుభవించాలని నిర్ణయం చేసి వెళ్ళిపోయారు. ఆయన ఉన్నంతకాలం ధర్మబద్ధంగా పరిపాలన చేశారు. చంద్రుడిని వెన్నెల ఎలా విడిచిపెట్టదో, అలా పుత్రధర్మాన్ని విడిచిపెట్టకుండా రాముడు అడవికి వెళ్ళాడు. అందుకని నువ్వు కూడా నీ ధర్మాన్ని పాటించాలి. కావున నువ్వు పట్టాభిషేకం చేసుకోవడం ధర్మం. అందుకని జలకలశములు తెప్పించాను, భద్రపీఠం ఏర్పాటు చెయ్యబడింది, ఉత్తమాశ్వాలని, గజాలని తీసుకొచ్చాము, కావున నువ్వు కూర్చొని పట్టాభిషేకం చేయించుకో ” అన్నాడు.

అప్పుడు భరతుడు శత్రుఘ్నుడి వంక చూసి ” నాకు ఈ రాజ్యము అక్కరలేదు, నేను దీన్ని ఎప్పుడూ కోరుకోలేదు ” అని, ఆ నిండు సభలో అందరి ముందు చంటి పిల్లాడు వెక్కి వెక్కి ఏడ్చినట్టు ఏడ్చాడు.

తరువాత భరతుడు వశిష్ఠుడితో ” నువ్వు ఇది చెయ్యవలసిన పనేనా వశిష్ఠ. నేను వేదం చదువుకున్నాను, నేను దశరథ మహారాజుకి పుట్టానయ్య, నాకు ధర్మం తెలుసు, వేరొకడి రాజ్యాన్ని అపహరించే దొంగగా చూస్తున్నావా నన్ను ఇవ్వాళ, ఈ రాజ్యం రాముడిది, నువ్వు ఎవరు ఇవ్వడానికి, నేను ఎవరు పుచ్చుకోవడానికి. ఈ రాజ్యమునకు, నాకు, అందరికి ఆయనొక్కడే రాజు ” అని భరతుడు అనేసరికి వశిష్ఠుడు మనస్సులో పొంగిపోయాడు.

ఈ మాట విన్నవాళ్ళందరూ సంతోషపడిపోయి ” సంతోషం భరతా, ఇక్ష్వాకు వంశంలో ఎటువంటి పిల్లలు పుట్టాలో అటువంటి పిల్లలు పుట్టారు. ఒకడిని మించిన శీలం మరొకడిది. ఇలాంటి పిల్లల్ని చూసిన మేము అదృష్టవంతులం ” అన్నారు.

అప్పుడు భరతుడు ” నేను నిన్ననే ఆదేశించాను, కొంతమంది పరివారం అప్పుడే బయలుదేరి రాముడున్న అరణ్యానికి మార్గం చేస్తున్నారు. మనందరం బయలుదేరి, రాముడి దర్శనం చేసుకోని, ఆయనని వెనక్కి తీసుకువద్దాము ” అన్నాడు.

 

Valmiki Ramayanam ayodyakanda In Telugu, Valmiki Ramayanam Telugu AyodhyaKaanda Day 12 | వాల్మీకి మహర్షి రామాయణం అయోధ్యకాండ  Valmiki Ramayana Vs Kamba Ramayanam, Difference Between Valmiki Ramayana And Kamba Ramayanam Valmiki Ramayanam Telugu ayodyakanda Valmiki Ramayana Facts, Valmiki Ramayana Time, #ValmikiRamayanam #ayodyakanda valmiki ramayanam telugu ayodyakanda, valmiki ramayanam ayodyakanda in telugu valmiki ramayana, valmiki ramayana facts, Valmiki Ramayanam Telugu AyodhyaKaanda Day 12 | వాల్మీకి మహర్షి రామాయణం అయోధ్యకాండ

Valmiki Ramayanam Telugu AyodhyaKaanda Day 12

Spread iiQ8