Valmiki Ramayanam Telugu AranyaKaanda Day 16
Jai Shree Ram ! Valmiki Ramayanam Telugu AranyaKaanda Day 16
16వ దినము, అరణ్యకాండ Valmiki Ramayanam Telugu AranyaKaanda Day 16
శరభంగుడు వెళ్ళిపోయాక ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి వైఖానసులు (విఖనస మహర్షి యొక్క సంప్రదాయంలో ఉండేవాళ్ళు), చెట్లనుంచి కింద పడినటువంటి ఎండుటాకులను తినేవాళ్ళు, సూర్య కిరణాలని, చంద్ర కిరణాలని తినేవాళ్ళు, గాలిని తినేవాళ్ళు, కేవలం నీరు తాగి బతికేవాళ్ళు, నిలబడే నిద్రపోయేవాళ్ళు, చెట్టుమీదనే ఉండి తపస్సు చేసుకునేవాళ్ళు, ఎప్పుడూ దర్భల మీదనే ఉండేవాళ్ళు, ఇలా రకరకములైన నియమములతో తపస్సు చేసుకుంటూ ఆ శరభంగముని ఆశ్రమంలో ఉండేవారు.
శరభంగుడు వెళ్ళిపోయాక ఆ మహర్షులందరూ రాముడి చుట్టూ చేరి ” రామ! ఇక్కడ తపస్సు చేసుకుంటున్న మమ్మల్ని రాక్షసులు ఇబ్బంది పెడుతున్నారు. మేము సంపాదించుకున్న తపఃశక్తితో రాక్షసులని నిగ్రహించగలము, కాని మేము జితఃక్రోధులం, కోపాన్ని జయించినవాళ్ళము. ఆ రాక్షసులు అజ్ఞానంతో ఈ శరీరాన్ని బాధ పెడుతుంటారు. మేము వారి అజ్ఞానాన్ని మన్నించాము. మేము ఎప్పుడూ మా తపఃశక్తిని మాకోసం ఉపయోగించలేదు. నువ్వు మాకు తల్లిలాంటి వాడివి, మేము నీ కడుపులో ఉన్న పిండంలాంటి వాళ్ళము, మాకు ఒకరికి చెప్పుకోవడం కూడా చేతకాదు, నువ్వు క్షత్రియుడవి కనుక మమ్మల్ని రక్షించడం నీ ధర్మం, నీ దెగ్గర ధర్మం పుష్కలంగా ఉంది, నీకు సత్యం యొక్క, ధర్మం యొక్క స్వరూపం తెలుసు, సత్యధర్మములను రెండిటినీ అనుష్టానము చెయ్యడము తెలుసు. తల్లి బిడ్డలని రక్షించినట్టు, రాజు అరణ్యాలలో ఉన్న ఋషులని రక్షించాలి. అందుకని నీకు చెప్పుకుంటున్నాము రామ.
ఏహి పశ్య శరీరాణి మునీనాం భావిత ఆత్మనాం |
హతానాం రాక్షసైః ఘోరైః బహూనాం బహుధా వనే ||
ఎవ్వరి జోలికి వెళ్ళకుండా, కూర్చుని తపస్సు చేసుకుంటున్న ఎంతమంది మునులను ఆ రాక్షసులు చంపారో ఒకసారి వచ్చిచూడు రామ, చిత్రకూట పర్వతాల మీద, దండకారణ్యంలో, మందాకినీ నది ఒడ్డున ఉండేటటువంటి ఎందరో మహర్షులను ఆ రాక్షసులు చంపేసారు. అందుకని నీ ముందు నిలబడి, రెండు చేతులతో నీకు దండం పెట్టి, నీకు శరణాగతి చేస్తున్నాము రామ, మమ్మల్ని రక్షిస్తావ?” అని ఆ ఋషులు రాముడిని అడిగారు. Valmiki Ramayanam Telugu AranyaKaanda Day 16
ఆ ఋషుల యొక్క ప్రార్ధనలని విన్న రాముడు ” మీరు నన్ను ఆజ్ఞాపించాలి, అంతేకాని మీరు నన్ను ఎప్పుడూ కూడా అలా శరణాగతి చెయ్యకూడదు. ఇప్పటికే నేను చాలా సిగ్గుపడుతున్నాను, నాకు తెలియలేదు మీరు ఇంత కష్టపడుతున్నారని. ఈ అరణ్యాలలో తపస్సు చేసుకునేటటువంటి ఋషులని ఇక నేను రక్షిస్తాను, మీరు నా శక్తిని, నా తమ్ముడి శక్తిని చూస్తారు ” అన్నాడు.
తరువాత రాముడు ఆ మహర్షులందరితో కలిసి సుతీక్ష్ణుడి ఆశ్రమానికి బయలుదేరారు.
వీళ్ళు అక్కడికి వెళ్లేసరికి ఆ సుతీక్ష్ణ మహర్షి కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఆయన ఆశ్రమం అంతా శోభాయమానంగా ఉంది. అప్పుడు రాముడు సీతాలక్ష్మణసహితుడై లోపలికి వెళ్ళి సుతీక్ష్ణ మహర్షి దెగ్గర కూర్చుని ” మహాత్మా! నన్ను రాముడు అంటారు, ఒకసారి మీరు నన్ను చూసి, నాతో మాట్లాడవలసింది అని అభ్యర్దిస్తున్నాను ” అని అన్నాడు.
కళ్ళు తెరిచిన ఆ సుతీక్ష్ణుడు ఇలా అన్నాడు ” రామ! దేవేంద్రుడు నా దెగ్గరికి వచ్చి, నేను చేసిన తపస్సు చేత నేను లోకములన్నిటిని గెలిచాను కనుక నన్ను ఊర్ధలోకములకు తీసుకువెళతాను అని రథం ఎక్కమన్నాడు. చిత్రకూట పర్వతం మీద నివాసం ఉంటున్న రాముడిని దర్శించుకొని, ఆయనకి ఆతిధ్యం ఇచ్చి వస్తానని చెప్పాను. అందుచేత నేను నీ దర్శనం కోసమే వేచి ఉన్నాను రామ ” అన్నాడు.
Valmiki Ramayanam Telugu AranyaKaanda Day 16
శరభంగ మహర్షి చెపినట్టు సుతీక్ష్ణుడు కూడా రాముడికి తాను తపస్సు చేత గెలుచుకున్న లోకాలని ధారపోస్తాను అన్నాడు.
అప్పుడు రాముడు ” మీరు సంపాదించుకున్న లోకములలో నేను విహరించడం కాదు, నా అంతట నేను కూడా తపస్సు చేసి సంపాదించుకుంటాను. అందుకని నేను తపస్సు చేసుకోవడానికి అనువైన స్థలాన్ని నాకు చూపించండి ” అన్నాడు.
“అయితే ఇక్కడ దెగ్గరలో చాలా ఆశ్రమాలు ఉన్నాయి, నువ్వు వాటన్నిటిని చుసిరా. నువ్వు వాటిని చూసి వచ్చాక చెబుతాను ” అని సుతీక్ష్ణుడు అన్నాడు.
” నాకు కూడా ఆ ఆశ్రమాలన్నిటిని చూడాలని ఉంది, అందుకని ఆ ఆశ్రమాలన్నిటిని చూసి అందులో ఉన్న ఋషుల యొక్క ఆశీర్వచనాలు పొంది వస్తాను ” అని రాముడు అన్నాడు.
Valmiki Ramayanam Telugu AranyaKaanda Day 16
ఆ రోజూ రాత్రికి సుతీక్ష్ణుడి ఆశ్రమంలో విశ్రాంతి తీసుకున్నారు. మరునాడు ఉదయం స్నానం చేసి, సంధ్యావందనం చేసి సుతీక్ష్ణుడి ఆశీర్వాదం తీసుకుందామని రాముడు ఆయన దెగ్గరికి వచ్చాడు. అప్పుడా సుతీక్ష్ణ మహర్షి ” రామ! నువ్వు ఇక్కడే ఉండి నీ తపస్సుని యదేచ్ఛగా ఆచరించు, ఇక్కడ ఏవిధమైన ప్రమాదము ఉండదు, కాని ఇక్కడికి మృగములు వస్తుంటాయి, అవి వచ్చినప్పుడు కొంత పరాకుతో ఉంటే చాలు ” అన్నాడు.
అప్పుడు రాముడన్నాడు ” మృగాలని చూస్తే ధనుస్సు పట్టుకోవడం నా అలవాటు, ఋషులు ఉండే ప్రాంతానికి మృగాలు వస్తే, ఆశ్రమాన్ని రక్షించడం కోసం నేను కోదండం పట్టుకొని బాణ ప్రయోగం చేస్తాను. అప్పుడు పారిపోతున్న ఆ మృగాలని చూసి బ్రహ్మజ్ఞానంతో ఉన్న మీకు జాలి కలగచ్చు, అందువలన బాణ ప్రయోగం చేసిన నేను మీకు కంటకుడిగా కనపడవచ్చు. అందుకని నేను ఇక్కడ ఉండకూడదు. నాకు వేరు ఆశ్రమం కావాలి, అందుకని మీరు నాకు ఒక ఆశ్రమం నిర్మించికోడానికి యోగ్యమైన ప్రదేశాన్ని నిర్ణయించండి. ఈలోగా నేను మిగిలిన తాపసుల ఆశ్రమాలని దర్శించుకొని వస్తాను ” అన్నాడు.
” అయితే నువ్వు అన్ని ఆశ్రమాలని దర్శించుకొని మళ్ళి ఇక్కడికి రా, అప్పుడు చెప్తాను ” అని సుతీక్ష్ణుడు రాముడితో అన్నాడు.
సీతమ్మ ఇచ్చిన కోదండాలని ధరించిన రామలక్ష్మణులు, సీతమ్మతో కలిసి బయలుదేరారు. ఆ సమయంలో సీతమ్మ రాముడితో ఇలా అనింది ” నేను పెద్దల దెగ్గర విన్నాను, ధర్మాన్ని చాలా సూక్ష్మబుద్ధితో అనుష్ఠానం చెయ్యాలి అని. మీరు ధర్మాచరణ కోసమని, తండ్రికి ఇచ్చిన మాట కోసమని అరణ్యానికి వచ్చి ఒక తాపసిలా జీవిస్తాను అన్నారు కదా. కాని మనిషికి కామము చేత మూడు దుర్గుణములు కలుగుతాయి, అందులో మొదటిది అసత్యము పలకడం, మీరు ఎన్నడూ అసత్యము చెప్పరు, ఇక ముందు కూడా అసత్యము చెప్పరని నాకు తెలుసు. ఇక రెండవది పరస్త్రీ వాంఛ, నేను మీ భార్యని, నాకు తెలుసు మీరు ఎన్నడూ పర స్త్రీని అటువంటి భావనతో చూడరని. మూడవది ఏంటంటే…..
తృతీయం యద్ ఇదం రౌద్రం పర ప్రాణ అభిహింసనం |
ఏ కారణము లేకుండా, అవతలి వారితో వైరము లేకపోయినా వారిని హింసించాలన్న కోరిక పుట్టడం. కాని ఆ మూడవ దోషం ఇవ్వాళ మీయందు నాకు కనబడుతోంది. మీరు నిన్న తాపసుల ఆశ్రమాలకి వెళ్ళారు, అప్పుడా తాపసులు తమని హింసిస్తున్న రాక్షసుల నుంచి రక్షించమని కోరారు. అప్పుడు మీరు ఏమన్నారు, ఇకనుంచి నా పౌరుషం చూడండి నా తమ్ముడి పౌరుషం చూడండి అని, తాపసులని హింసించే రాక్షసులని ఇకనుంచి సంహరిస్తానని మీరు ప్రతిజ్ఞ చేశారు. మీకు, రాక్షసులకి ప్రత్యక్ష వైరం ఏదన్నా ఉందా? రాక్షసులు మీకేదన్నా అపకారం చేశారా? ఆ రాక్షసులు మీకేదన్నా అపకారం చేస్తే, మీరు క్షత్రియులు కనుక వాళ్ళని సంహరించండి, కాని ఇప్పుడు మీరు ఒక తాపసిలాగ ఈ అరణ్యాలలో తిరుగుతున్నారు. అలాంటి మీరు ఆ తాపసులకి రాక్షసులను సంహరిస్తానని ఒక రాజులాగ ఎలా ప్రతిజ్ఞ చేశారు. అందువలన కామజనితమైన ఆ మూడవ దోషము మిమ్మల్ని ఆవహించింది. కాబట్టి నాకు ఈ దండకారణ్యానికి రావడం ఇష్టం లేదు. కాలుతున్న అగ్ని తన చుట్టూ ఉన్న వస్తువులని ఎలా మెల్లగా ఆవహించి కాల్చుకుపోతుందో, అలా మీకు కలిగిన ఈ దోషము వలన, క్రమక్రమంగా మృగాలని, రాక్షసులని చంపుదామని మీరు కోదండం పట్టుకొని తిరుగుతారు. అప్పడు మీకు, రాక్షసులకి మధ్య నిష్కారణంగా శతృత్వాలు రావడం నాకు ఇష్టం లేదు. అందువలన దండకారణ్యానికి వెళ్ళడమనేది వ్యక్తిగతంగా నాకు ఆనందదాయకం కాదు. నేను చెప్పిన ఈ మాటలకి ఆధారం ఏమిటి అంటారేమో, ఒక విషయం చెబుతాను జాగ్రత్తగా వినండి…….
పూర్వకాలంలో అరణ్యంలో ఒక మహానుభావుడు మహోగ్రమైన తపస్సు చేస్తున్నాడు. ఆయన తపస్సుని పాడుచేద్దామని, ఇంద్రుడు ఒక యోధుడి వేషాన్ని ధరించి, ఒక పెద్ద ఖడ్గాన్ని పట్టుకొని ఆయన దెగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చాడు. ‘ అయ్యా! నేను ఆపదలో ఉన్నాను, నేను సైనికుడిని అని తెలిసి కొంతమంది నన్ను తరుముకుంటూ వస్తున్నారు. అలా తెలియకుండా ఉండాలంటే నాదెగ్గర ఈ ఖడ్గం ఉండకూడదు. కనుక నేను మళ్ళి వచ్చి తీసుకునేదాక ఈ ఖడ్గాన్ని మీ దెగ్గర ఉంచండి’ అని, ఆ యోధుడి వేషంలో ఉన్న ఇంద్రుడు చెప్పి వెళ్ళిపోయాడు. ఆ ఋషి కూడా సరే అన్నాడు.
మళ్ళి ఆ యోధుడు వచ్చి ఖడ్గాన్ని అడిగినప్పుడు ఇవ్వకపోతే మాట తప్పినవాడిని అవుతానని, ఆ ఋషి తాను కూర్చునే దర్భాసనం కిందనే ఆ ఖడ్గాన్ని పెట్టుకున్నాడు. తపస్సు చేస్తూ మధ్య మధ్యలో ఆ ఖడ్గం వంక చూసుకునేవాడు. అలా కొంతకాలం గడిచాక, ఊరకనే మధ్యలో ఆ ఖడ్గాన్ని చూడడం కష్టమవుతోందని, ఆ ఖడ్గం మీద చెయ్యి పెట్టి తపస్సు చేసేవాడు ఆ ఋషి. అలా ఖడ్గం మీద చెయ్యి వేసి తపస్సు చెయ్యడం వలన ఆ ఋషిలో రజోగుణం ప్రకోపించి, ఖడ్గాన్ని పట్టుకొని తిరగడం ప్రారంభించాడు. కొంతకాలానికి ఆ ఖడ్గంతో అడవిలోని చెట్లని, కొమ్మలని నరకాలనిపించింది, తరువాత మృగాలని చంపాలనిపించింది, తరువాత దారిదొంగతనాలు చెయ్యాలనిపించింది, తరువాత కొన్నాళ్ళకి ఆ ఖడ్గంతో హత్యలు చెయ్యాలనిపించింది. రామ! ఇంద్రుడు ఏమి చెయ్యలేదు, కేవలం ఒక కత్తి ఇచ్చి వెళ్ళిపోయాడు, కాని ఆ ఋషి పెద్ద హంతకుడై శరీరాన్ని విడిచిపెట్టేసాడు. ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. మీరు ఈ కోదండం, బాణాలు ఎందుకు పెట్టుకుంటున్నారు. ఆశ్రమం కట్టుకొని 14 సంవత్సరాలు తపస్సు చేసుకుంటే, మనం తిరిగి అయోధ్యకి వెళ్ళిపోవచ్చు. మీరు సింహాసనం మీద కూర్చున్నాక ఇలాంటి ప్రతిజ్ఞలు చెయ్యండి, ఈ కోదండం, బాణాలు పట్టుకోండి. కాని ఇప్పుడు ఈ ప్రతిజ్ఞలు ఎందుకు చేశారు?
Valmiki Ramayanam Telugu AranyaKaanda Day 16
మీరు నాతో ఒక మాట అనొచ్చు, ‘ నేను రాజుని కాకపోవచ్చు, కాని నేను ఒక క్షత్రియుడిని, అందుకని నేను కోదండాన్ని పట్టుకోవడంలో తప్పులేదు’ అని. మిమల్ని ఎవరైనా ఆర్తితో రక్షించమని పిలిస్తే, వారిని మీరు రక్షించండి, తప్పులేదు. అంతేకాని, ఎక్కడో ఋషులని ఎవరో రాక్షసులు ఇబ్బందిపెడుతున్నారని, రాక్షసులందరినీ చంపేస్తానని మీరు ప్రతిజ్ఞ చెయ్యడం నాకు నచ్చలేదు. నేను స్త్రీని కదా, ఒకవేళ నేను అనవసరంగా భయపడి చెప్పకూడని మాట మీకు చెప్పనేమో. మీ తమ్ముడితో ఆలోచించి, ఒక మంచి నిర్ణయానికి రండి ” అని సీతమ్మ రాముడితో అనింది.
సీతమ్మ పలికిన పలుకులకి రాముడు ఇలా సమాధానం చెప్పాడు ” సీతా! రాక్షసులు తమని బాధపెడుతుంటే ఆ ఋషులు రక్షించమని ఆర్తితో శరణాగతి చేశారు.
తే చ ఆర్తా దణ్డకారణ్యే మునయః సంశిత వ్రతాః |
మాం సీతే స్వయం ఆగమ్య శరణ్యాః శరణం గతాః ||
నేనేమి వాళ్ళని అడగలేదు, వాళ్ళంతట వాళ్ళే వచ్చి నన్ను శరణాగతి చేశారు. అప్పుడు నేను ఎంత సిగ్గుపడ్డానో తెలుసా. నేను క్షత్రియుడని కనుక వాళ్ళకి కష్టం వస్తే, ఆ కష్టాన్ని నేను తెలుసుకొని రాక్షస సంహారం చేసి తాపసులు తపస్సు చేసుకునేటట్టు నేను చూడాలి. మీకు కష్టం ఉందా అని నేను వాళ్ళని అడగలేదు, నా అంతట నేను రాక్షస సంహారం చెయ్యలేదు. నేను ఇవేమీ చెయ్యలేదు, వాళ్ళు నా దెగ్గరికి వచ్చి శరణాగతి చేశారు, అప్పుడు నేను ప్రతిజ్ఞ చేశాను. అలా చెయ్యడం క్షాత్ర ధర్మమే. ఒకసారి నేను ఎవరినన్నా రక్షిస్తానని ప్రతిజ్ఞ చేస్తే, నా శరీరంలో ప్రాణాలు ఉన్నంత వరకు వాళ్ళని రక్షించి తీరుతాను. నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి అవసరమైతే నిన్ను విడిచిపెట్టేస్తాను, లక్ష్మణుడిని విడిచిపెట్టేస్తాను, ఇంకా అవసరమైతే నా శరీరాన్ని విడిచిపెట్టేస్తాను, అంతేకాని ఎట్టి పరిస్థితులలోను మాట తప్పను. ప్రతిజ్ఞ చేశాను కనుక రాక్షస సంహారం చేసి తీరుతాను సీతా ” అని రాముడు అన్నాడు.
ఈ మాటలు విన్న సీతమ్మ చాలా ఆనందపడి ” మీరు ఎలా నిర్ణయిస్తే అలానే జెరుగుతుంది” అనింది. ముందు రాముడు, మధ్యలో సీతమ్మ, చివరన లక్ష్మణుడు నడుచుకుంటూ ఆ అరణ్యంలో వెళుతూ ఒక్కొక్క తాపస ఆశ్రమాన్ని చూస్తున్నారు. వాళ్ళతో పాటు కొంతమంది మునులు కూడా కలిసి వస్తున్నారు. అప్పుడు వాళ్ళకి ఒక చిత్రమైన పెద్ద సరస్సు కనబడింది. ఆ సరస్సులోనుంచి సంగీతం వినబడుతోంది, నృత్యం యొక్క ధ్వని వినబడుతోంది, పాటలు వినబడుతున్నాయి. ఆ సరస్సు నుండి వస్తున్న ఆ శబ్దములను విన్న రాముడు ఆశ్చర్యపోయి, తన పక్కన ఉన్నటువంటి ధర్మభృత్ అనే మునిని పిలిచి ” ఈ సరోవరం నుంచి ఇవన్నీ వినబడుతున్నాయి, ఏంటి సంగతి ” అని అడిగారు.
ఇదం పంచ అప్సరో నామ తటాకం సార్వ కాలికం |
నిర్మితం తపసా రామ మునినా మాణ్డకర్ణినా ||
అప్పుడా ధర్మభృత్ ” ఈ సరోవరాన్ని మాణ్డకర్ణి అనే ఋషి తయారు చేశారు. ఆయన 10,000 సంవత్సరాలు వాయు భక్షకుడై తపస్సు చేశాడు. ఈయన తపస్సు చేత తమ స్థానాలని ఆక్రమిస్తాడేమో అని దిక్పాలకులు అనుకొని, ఆయన తపస్సుని భగ్నం చెయ్యడానికి అయిదుగురు అప్సరసలని పంపారు. అప్పుడా మాణ్డకర్ణి ముని ఆ అప్సరసలకి వసుడయ్యాడు. అప్పుడాయన ఒక పెద్ద సరోవరాన్ని నిర్మించి అందులో ఒక పెద్ద అంతఃపురాన్ని నిర్మించాడు. ఆ అంతఃపురం లోపల ఈయన అప్సరసలతో కలిసి క్రీడిస్తూ ఉంటాడు. తన తపఃశక్తితో యవ్వనాన్ని పొంది ఈ అయిదుగురితో రమిస్తూ ఉంటాడు. లోపల ఆ అప్సరసలు పాడుతున్న పాటలు, వాయిస్తున్న వాద్యముల యొక్క శబ్దములే మనకి ఇలా బయటకి వినబడుతున్నాయి రామ ” అని అన్నాడు.
Valmiki Ramayanam Telugu AranyaKaanda Day 16
ఇది విన్న రాముడు ఆశ్చర్యపోయి అక్కడినుంచి ముందుకి పయనమయ్యాడు.
(ఈ మాణ్డకర్ణి మహర్షి జీవితాన్ని తత్వపరంగా చూస్తే, మాణ్డకర్ణి మహర్షి దెగ్గరికి వచ్చిన ఆ అయిదుగురు అప్సరసలు కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము అనే జ్ఞానేంద్రియాలు. తన ఇంద్రియాలకి లొంగినవాడై, తను ఇప్పటిదాకా సంపాదించిన తపఃశక్తిని సుఖములు అనుభవించడం కోసం ఉపయోగించాడు. తన జీవితాన్ని వ్యర్ధం చేసుకున్నాడు)
తాను చూసినటువంటి ఆశ్రమములలో రాముడు ఒకదానిలో 6 నెలలు, ఒకదానిలో 9 నెలలు, మరొకదానిలో 1 సంవత్సరము, అలా ఒక్కొక్క ఆశ్రమంలో కొంత కాలం గడిపాడు. అలా 10 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 10 సంవత్సరాలలో రాముడు అన్ని తాపసుల ఆశ్రమాలని సందర్శించాడు. తరువాత ఆయన సుతీక్ష్ణుడి ఆశ్రమానికి వెళ్ళారు.
అప్పుడు రాముడు ” అయ్యా! 10 సంవత్సరాలలో తాపసుల ఆశ్రమాలన్నిటినీ చూశాను. మీరు మళ్ళి రమ్మన్నారని వచ్చాను. అగస్త్య మహర్షి ఆశ్రమం ఇక్కడెక్కడొ ఉందని విన్నాను, కాని ఈ అరణ్యం చాలా విశాలంగా ఉండడం వలన ఆయన ఆశ్రమం ఎక్కడుందో తెలియడం లేదు, అందుకని అగస్త్య మహర్షి ఆశ్రమం ఎక్కడుందో దయచేసి మీరు నాకు సెలవిస్తే ఆ ఆశ్రమాన్ని ఒకసారి సందర్శించాలని అనుకుంటున్నాను ” అని అన్నాడు.
అప్పుడా సుతీక్ష్ణుడు ” రామ! ఈ మాటే నేను నీకు చెప్పాలని అనుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడినుంచి 4 యోజనముల దూరం దక్షిణంగా వెళితే అగస్త్య భ్రాత(అంటె అగస్త్యుని తమ్ముడు అని అర్ధం, ఈయన పేరుని వాల్మీకి మహర్షి రామాయణంలొ ఎక్కడా ప్రస్తావించలేదు. రఘు అనే మహారాజు పుట్టిన వంశంలో జన్మించిన రాముడిని రాఘవుడు అని పిలిచినట్టు, అగస్త్యుడి తమ్ముడు కనుక ఆయనని అగస్త్య భ్రాత అని పిలిచేవారు) ఆశ్రమం కనబడుతుంది. నువ్వు అక్కడ ఒక రాత్రి పడుకో. మరునాడు ఉదయం అక్కడనుంచి బయలుదేరి వెళితే, నీకు ఒక పెద్ద చెట్ల గుంపు కనబడుతోంది. అక్కడినుంచి ముందుకి వెళితే నీకు అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం కనబడుతుంది. అక్కడ బోలెడన్ని పిప్పల చెట్లతో నిండిన వనం కనిపిస్తుంది. నువ్వు తప్పకుండా ఆ ఆశ్రమాన్ని సందర్శించు ” అన్నాడు
.
సీతారామలక్ష్మణులు సుతీక్ష్ణుడి దెగ్గర ఆశీర్వాదం తీసుకొని ముందుకి బయలుదేరారు. వారు అగస్త్య భ్రాత మహర్షి ఆశ్రమానికి చాలా దెగ్గరగా వచ్చాక రాముడు లక్ష్మణుడితో ” లక్ష్మణా! ఈ ఆశ్రమాన్ని అగస్త్య భ్రాత ఆశ్రమం అని ఎందుకు పిలుస్తారో తెలుసా? ఈ ఆశ్రమం వెనుక ఒక కథ ఉంది. అదేంటంటే…………..పూర్వం ఇక్కడ ఇల్వలుడు, వాతాపి అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. ఇల్వలుడు బ్రాహ్మణ రూపం దాల్చేవాడు, వాతాపి ఒక గొర్రె రూపం దాల్చేవాడు. వారు అలా కనబడ్డ బ్రాహ్మణుల దెగ్గరికి వెళ్ళి, ‘ అయ్యా, రేపు మా తండ్రిగారి ఆబ్దికము, తద్దినం పెట్టాలి కనుక మీరు భోక్తగా రండి ‘ అనేవారు. అప్పుడా ఇల్వలుడు గొర్రె రూపంలో ఉన్న తన తమ్ముడైన వాతాపిని చంపి, ఆ మాంసాన్ని వచ్చిన బ్రాహ్మణుడి విస్తట్లో వేసేవాడు( త్రేతాయుగ ధర్మం ప్రకారం తండ్రిగారికి పెట్టె తద్దిన భోజనంలో మాంసం వండేవారు, ఆ మాంసాన్ని బ్రాహ్మణులు తినేవారు). ఆ బ్రాహ్మణుడు మాంసాన్ని తిన్న తరువాత హస్తోదకం వేసి ‘ వాతాపి! రా……..’ అనేవాడు. అప్పుడా వాతాపి ఆ బ్రాహ్మణుడి శరీరాన్ని చీల్చుకొని బయటకి వచ్చేవాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఆ బ్రాహ్మణుడి శరీరాన్ని భుజించేవారు.
ఇలా చాలాకాలం, చాలా మందిని వారు సంహరించారు. ఒకనాడు అటుగా వెళుతున్న అగస్త్య మహర్షిని కూడా మిగతా బ్రాహ్మణుల్ని పిలిచినట్టు పిలిచారు. అగస్త్యడు త్రికాలవేది కనుక వీళ్ళు చేస్తున్న మోసాన్ని గ్రహించాడు. ఇల్వలుడు పిలిచేసరికి, అగస్త్య మహర్షి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు. భోజనం చేశాక తన కడుపు మీద చెయ్యి వేసి, ‘జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం‘ అన్నారు. ఇది తెలియని ఇల్వలుడు హస్తోదకం పోసి ‘వాతాపి! రా…..’ అన్నాడు.
కుతో నిష్క్రమితుం శక్తిర్ మయా జీర్ణస్య రక్షసః |
భ్రాతుః తే మేష రూపస్య గతస్య యమ సాదనం ||
” నీ తమ్ముడిని జీర్ణం చేసుకొని యమలోకానికి పంపించేసానురా ” అని అగస్త్య మహర్షి ఇల్వలుడితో అన్నారు.
ఆగ్రహించిన ఇల్వలుడు ఘోరమైన రూపాన్ని దాల్చి అగస్త్య మహర్షి మీద పడ్డాడు. అప్పుడు అగస్త్యుడు ఒక హుంకారం చేసేసరికి ఆ ఇల్వలుడు బూడిదై పడిపోయాడు. ఆ వాతాపిని, ఇల్వలుడిని అగస్త్య మహర్షి సంహరించిన ప్రదేశమే ఈ అగస్త్య భ్రాత యొక్క ఆశ్రమం లక్ష్మణా ” అని రాముడు అన్నాడు.
ఈ వృత్తాంతం విన్నాక అందరూ ఆ ఆశ్రమంలోనికి వెళ్ళారు. వాళ్ళకి అగస్త్య భ్రాత ఎదురొచ్చి లోపలికి ఆహ్వానించాడు, అర్ఘ్య పాద్యాలు ఇచ్చాడు, కందమూలాలు, తేనె పెట్టాడు. ఆ రాత్రికి సీతారామలక్ష్మణులు ఆ ఆశ్రమంలో పడుకున్నారు. మరునాడు లేచి అగస్త్య మహర్షి ఆశ్రమానికి దారి చెప్పవలసింది అని అడుగగా ” అదిగొ మీకు కనపడుతున్న ఆ చెట్లకి ప్రదక్షిణ చేసి దక్షిణ వైపుకి వెళితే మీకు అగస్త్య మహర్షి ఆశ్రమం కనపడుతోంది ” అని అగస్త్య భ్రాత మహర్షి చెప్పరు.
అగస్త్య మహర్షి యొక్క గొప్పతనం ఏంటంటే, ఆయన ఆశ్రమంలో దేవతలకి స్థానాలు ఉన్నాయి( అంటె ఆయన ఆశ్రమానికి దేవతలు వచ్చి, తమ తమ స్థానాలలో కూర్చొని అగస్త్యుడిని పూజించి వెళ్ళేవారు. అక్కడ శివ స్థానం తప్ప మిగిలిన అన్ని దేవతలకి స్థానాలు ఉన్నాయి, అగస్త్యుడు శివుడిని పూజించేవాడు). ఆయన ఆశ్రమంలో తపస్సు చేసుకునే ఋషులు దివ్య విమానాలలో ఊర్ధలోకాలకి వెళ్ళిపోయేవారు. ఆ ఆశ్రమంలోకి అసత్యం చెప్పేవాడు కాని, క్రూరమైన బుద్ధి ఉన్నవాడు కాని, వంచన చేసేవాడు కాని, మరొకరిని పీడించే స్వభావం ఉన్నవాడు కాని, ఎప్పుడూ కోరికలతో ఉండేవాడు కాని ఆ ఆశ్రమంలోకి వెళ్ళి కూర్చోవడం అనేది జెరగదు.
Valmiki Ramayanam Telugu AranyaKaanda Day 15 | వాల్మీకి మహర్షి రామాయణం అరణ్యకాండ
Valmiki Ramayanam Telugu AyodhyaKaanda Day 11 | వాల్మీకి మహర్షి రామాయణం అయోధ్యకాండ
సీతారామలక్ష్మణులు ఆ అగస్త్య ఆశ్రమానికి చేరుకునేసరికి, ఆ ఆశ్రమంలో ఎక్కడా చూసిన తడి బట్టలు, నార చీరలు, యజ్ఞయాగాది క్రతువులు చేసుకునే అగ్నివేదికలు, పవిత్రమైన పదార్ధాలు, పుష్పమాలికలు మొదలైనవాటితో ఆ ఆశ్రమం రంజిల్లుతోంది. అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి ” లక్ష్మణా! నేను సీతతో కలిసి బయట నిల్చుని ఉంటాను. నువ్వు లోపలికి వెళ్ళి, రాముడు సీతమ్మతో, లక్ష్మణుడితో మీ ఆశ్రమానికి వచ్చాడు, ఆయన అగస్త్య మహర్షి దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నారు. దర్శనం చేసుకోవడానికి అనుగ్రహిస్తార ” అని కబురు చెయ్యి అన్నాడు.
లక్ష్మణుడు ఆశ్రమంలోనికి వెళ్ళి ఒక ముని కుమారిడితో తన ప్రార్ధన నివేదించాడు. అప్పుడా ముని కుమారుడు అగస్త్య మహర్షితో ఈ విషయం చెప్పగా ” నేను ఎప్పటినుంచో సీతారాములని, లక్ష్మణుడిని చూడాలని అనుకుంటున్నాను. నువ్వు, రాముడు రాగానే నా దెగ్గరికి తీసుకురాకుండా, నా దెగ్గరికి వచ్చి ఈ మాటలు చెప్పి ఎందుకు కాలాన్ని వృధా చేశావు, వెంటనే వెళ్ళి సీతరాములని ప్రవేశపెట్టు ” అని అగస్త్యుడు అన్నాడు.
అప్పుడు సీతారామలక్ష్మణులు అగస్త్యుడు ఉండేటటువంటి గదిలోకి వెళుతుండగా కార్తికేయుడు, వరుణుడు, కుబేరుడు, సోముడు, బ్రహ్మ, విష్ణువు, మహేంద్రుడు, వాయువు మొదలైనవారి స్థానములు ఉన్నాయి. ఆ స్థానములలో వారు కూర్చొని అగస్త్యుడిని ఆరాధన చేసి వెళుతుంటారు. అప్పుడు అగస్త్యుడు కోటిసూర్యుల తేజస్సుతో ఆ గదినుండి బయటకి వచ్చారు.
ఏవం ఉక్త్వా మహాబాహుః అగస్త్యం సూర్య వర్చసం |
సీతయా సహ వైదేహ్యా తదా రామః స లక్ష్మణః ||
Valmiki Ramayanam Telugu AranyaKaanda Day 16
సూర్యుడిలా వెలిగిపోతున్న ఆ అగస్త్యుడిని చూడగానే రాముడు గబగబా వెళ్ళి తన రెండు చేతులతో అగస్త్య మహర్షి యొక్క పాదములను పట్టుకొని నమస్కారం చేశాడు. సీతమ్మ లక్ష్మణుడు ఆయనని చూస్తూ అంజలి ఘటిస్తూ నిలబడిపోయారు.
అప్పుడు అగస్త్య మహర్షి రాముడికి అర్ఘ్య పాద్యాలు ఇచ్చి, తాను అగ్నికార్యాన్ని పూర్తి చేసి వస్తానని చెప్పి, రాముడిని కూర్చోమన్నారు. కొంతసేపటికి బయటకి వచ్చిన అగస్త్యుడు ” నువ్వు వచ్చినప్పుడు నేను గదిలో అగ్నిశాలలో ఎందుకున్నానో తెలుసా రామా?, అగ్నికార్యం జెరిగేటప్పుడు అతిథి వస్తే, ముందు అగ్నికార్యాన్ని పూర్తిచెయ్యాలి, తరువాత అతిథిని పూజించాలి. ఇలాంటి ధర్మాన్ని పాటించనివాడు పైలోకాల్లో తన మాంసాన్ని తానే తింటాడు.
రామా! నువ్వు లోకములన్నిటిని పాలించగల రాజువి, ఇవ్వాళ మాకు ప్రియమైన అతిధిగా లభించావు, అందుకని నిన్ను పూజించాను ” అని రాముడికి వానప్రస్థులకి పెట్టె బోజనాన్ని పెట్టారు. తరువాత ఆయన రాముడికి విష్ణు ధనుస్సుని, బ్రహ్మగారు ఇచ్చిన సూర్య తేజస్సు కలిగిన బాణాన్ని, ఇంద్రుడు ఇచ్చిన రెండు అక్షయబాణ తూణీరములు, ఒక బ్రహ్మాండమైన పిడి కలిగిన ఖడ్గాన్ని ఇచ్చి, వీటి ద్వారా జయాన్ని పొందు అని ఆశీర్వదించారు.
” స్వామీ! మేము ఎక్కడ ఆశ్రమాన్ని కట్టుకోము ” అని రాముడు అడుగగా, ” నిన్ను నేను నాతోపాటే ఈ ఆశ్రమంలోనే ఉండు అని అనాలని అనుకున్నాను, కాని నా తపఃశక్తి చేత నేను నీ మనసులో ఉన్న కోరికని దర్శించాను, నీ కోరిక ఏమిటో నాకు అర్ధమయ్యింది. అందుకని రామా! ఇక్కడికి దెగ్గరిలో పంచవటి అనే గొప్ప వనం ఉంది, అక్కడ గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. కావున అక్కడ నువ్వు ఆశ్రమాన్ని నిర్మించుకో, అప్పుడు నీ కోరిక తీరుతుంది. ఎవ్వరూ చెయ్యలేని పని చేసింది సీతమ్మ, నువ్వు ఆమెని భద్రంగా కాపాడుకో ” అన్నారు.
సీతారామలక్ష్మణులు అగస్త్య మహర్షి దెగ్గర సెలవు తీసుకొని, ఆయన చెప్పిన విధంగా పంచవటికి బయలుదేరారు. వారు అలా వెళుతుండగా ఒక చెట్టు మీద పెద్ద పక్షి ఒకటి వాళ్ళకి కనబడింది. ఆ పక్షి రాముడిని చూసి, నేను మీతో వస్తాను అనింది. అప్పుడు రాముడు ” నువ్వు ఎవరు ” అని అడుగగా, ఆ పక్షి ఇలా చెప్పసాగింది…….
” నేను మీ నాన్నగారైన దశరథ మహారాజుకి స్నేహితుడిని. ప్రజాపతులలో చిట్ట చివరివాడు కశ్యప ప్రజాపతి. ఆయన దక్ష ప్రజాపతి యొక్క 60 కుమార్తెలలో 8 మందిని వివాహం చేసుకున్నాడు. ఆ ఎనిమిదిమందే అదితి, దితి, ధనువు, కాళిక, తామ్ర, క్రోధవశ, మను, అనలా. అప్పుడు కశ్యపుడు తన 8 మంది భార్యలని పిలిచి ” మీరు క్షేత్రములు కనుక, నా యొక్క తేజస్సు చేత, నాతో సమానులైన వారిని కనండి ” అన్నాడు. ఆయన మాటలని కొంతమంది భార్యలు విన్నారు, కొంతమంది వినలేదు.
అదితికి 12 మంది ఆదిత్యులు, 8 వసువులు, 11 రుద్రులు, ఇద్దరు అశ్వినులు జన్మించారు. అలా మొత్తం 33 దేవతలు అదితికి జన్మించారు. దితికి దైత్యులు జన్మించారు. ధనువుకి హయగ్రీవుడు జన్మించాడు. ఈ ముగ్గురు భార్యలు కశ్యప ప్రజాపతి మాట విన్నారు.
Valmiki Ramayanam Telugu AyodhyaKaanda Day 12 | వాల్మీకి మహర్షి రామాయణం అయోధ్యకాండ
Valmiki Ramayanam Telugu AyodhyaKaanda Day 14 | వాల్మీకి మహర్షి రామాయణం అయోధ్యకాండ
కశ్యపుడి మాట వినని భార్యలైన కాళికకి నరకుడు, కాలకుడు అనే ఇద్దరు జన్మించారు. తామ్రకి క్రౌంచి, భాసి, శ్యేని, ధృతరాష్ట్రీ, శుకి అనే 5 కన్యలు జన్మించారు. మళ్ళి క్రౌంచికి గుడ్లగూబలు పుట్టాయి. భాసికి భాస పక్షులు పుట్టాయి. శ్యేనికి డేగలు, గ్రద్దలు పుట్టాయి. ధృతరాష్ట్రీకి హంసలు, చక్రవాకములు పుట్టాయి. శుకికి నత అనే పిల్ల పుట్టింది. నతకి వినత అనే పిల్ల పుట్టింది. ఆ వినతకి గరుడుడు, అరుణుడు అనే ఇద్దరు పుట్టారు. నేను ఆ అరుణుడి కుమారుడిని, నా పేరు జటాయువు, నా అన్నగారి పేరు సంపాతి. Valmiki Ramayanam Telugu AranyaKaanda Day 16
అలాగే క్రోధవశకి మృగీ, మృగమంద, హరి, భద్రమద, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి, సురస, కద్రువ అనే 10 మంది ఆడపిల్లలు పుట్టారు. మృగికి లేళ్ళు పుట్టాయి, మృగమందకి ఎలుగుబంట్లు పుట్టాయి, హరికి సింహాలు, బలమైన వానరాలు పుట్టాయి, భద్రమదకి ఇరావతి అనే పిల్ల పుట్టింది, ఆ ఇరావతికి ఐరావతం పుట్టింది, మాతంగికి ఏనుగులు పుట్టాయి, శార్దూలికి కొండముచ్చులు, పులులు పుట్టాయి, శ్వేతకి దిగ్గజాలు పుట్టాయి, సురభికి రోహిణి, గోవులు, గంధర్వులు మొదలైనవి పుట్టాయి. సురసకి అనేక పడగలు కలిగిన నాగపాములు పుట్టాయి, కద్రువకి సాధారణమైన సర్పములు పుట్టాయి.
Valmiki Ramayanam Telugu AranyaKaanda Day 16
రామా! ఇంతకీ ఇవన్నీ నీకు ఎందుకు చెప్పానో తెలుసా, కనబడేటటువంటి ఈ పక్షులు, మృగాలు, పశువులు అన్ని కశ్యప ప్రజాపతి సంతానం నుంచి వచ్చినవే ” అని అన్నాడు ఆ జటాయువు.
ఇదంతా విన్న రామచంద్రమూర్తి జటాయువుని తమతో పాటే ఉండమన్నాడు. అక్కడినుంచి అందరూ పంచవటికి పయనమయ్యారు.
Valmiki Ramayanam Telugu AyodhyaKaanda Day 13
Valmiki Ramayanam Telugu AranyaKaanda Day 16