గుణత్రయ విభాగ యోగం(14వ అధ్యాయం)
Sri Bhagavad Gita Part14, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu
భగవానుడు:
మునుల మోక్షకారణమైన జ్ఞానాన్ని నీకు మళ్ళీ చెబుతాను విను.దీనిని ఆచరించినవారు నా స్వరూపాన్ని పొంది జననమరణాలను అతిక్రమిస్తారు.
మూడుగుణాలు కల్గిన “మాయ” అనే ప్రకృతి అనే గర్భంలో క్షేత్రబీజాన్ని నాటగా సర్వభూత ఉత్పత్తి జరుగుతోంది. అన్ని జీవరాసులకూ ప్రకృతే తల్లి, నేనే తండ్రి.
ప్రకృతి సత్వ, రజో, తమోగుణాలచే కూడి ఉంటుంది. నిర్వికార జీవికి ప్రకృతి సహవాసం కల్గినప్పుడు ఈ గుణాలకు బద్దుడవుతున్నాడు.
సత్వ గుణం పరిశుద్దమైనది. అది పాపాలనుండి దూరం చేస్తుంది. ఈ గుణం కలిగినవారు సౌఖ్యం,జ్ఞానం చే బంధితులు అవుతారు.
రజోగుణం కామ, మోహ, కోరికల కలయిక చేత కలుగుతోంది. ఈ గుణం కల్గిన జీవుడు కర్మలచే బంధితులు అవుతారు.
అజ్ఞానం చేత పుట్టు తమోగుణం జీవులను భ్రాంతిలో ముంచివేస్తోంది.సోమరితనం,నిద్ర,పొరపాటు అనేవాటితో బంధితులను చేస్తుంది.
సత్వగుణం జీవున్ని సుఖబద్దుడిగా,రజోగుణం పనిచేయువానిగా,తమోగుణం ప్రమాదకారిగా చేస్తుంది.
ఒక్కొక్కప్పుడు ఒక్కో గుణం ఆధిపత్యం వహిస్తుంది.
సర్వేంద్రియాలు జ్ఞానకాంతిచే ప్రకాశిస్తున్నప్పుడు సత్వగుణం ఉందని, లోభం,అశాంతి,ఆశలు ఉన్నప్పుడు రజోగుణం,
సోమరితనం,ప్రమాదం,మూర్ఖత్వం ఉన్నప్పుడు తమోగుణం ఉన్నాయని తెలుసుకో.
సత్వగుణం తో ఉన్నప్పుడు మరణించిన బ్రహ్మజ్ఞానులు పొందే ఉత్తమలోకాలు,రజోగుణం ఉన్నప్పుడు మరణిస్తే మానవజన్మ,తమోగుణం ఉన్నప్పుడు చనిపోయినవాడు పశుపక్ష్యాదుల జన్మ పొందుతారు.
సత్వకర్మల వలన నిర్మల సౌఖ్యం,రాజస కర్మల వలన దుఃఖం,తామసకర్మల వలన అవివేకం కలుగుతాయి.
సత్వగుణం వలన జ్ఞానం,రజోగుణం వలన లోభం,తమోగుణం వలన అజ్ఞానం,భ్రాంతి,ప్రమాదాలు ఏర్పడుతాయి.
అన్ని పనుల యందూ త్రిగుణాలే కర్తలనీ,పరమాత్మ వీటికి అతీతుడని తెలుసుకొన్నవాడు నా భావం పొందుతాడు.
జీవి వీటిని దాటినప్పుడే బ్రహ్మానందం పొందగలడు.
అర్జునుడు:
వీటిని అతిక్రమించినవారి లక్షణాలు ఏవి?అసలు ఎలా వీటిని దాటాలి?
కృష్ణుడు:
ఈ గుణాల ఫలితాలు లభిస్తే ద్వేషింపక,లభించనప్పుడు ఆశింపక, సాక్షిగా, తను ఏమీ చేయడం లేదనుకొంటూ, తన అసలు స్వభావం గ్రహించి,సుఖదుఃఖాలను, మట్టీ, రాయి, బంగారు లను సమానంగా చూస్తూ, ప్రియము, అప్రియముల పైన సమాన దృష్టి కల్గి, ధీరుడై, పొగడ్తలు, నిందలు, మానము, అవమానము, శత్రుమిత్రులందు లందు సమబుద్ధి కల్గి, నిస్సంకల్పుడై ఉన్నవాడు గుణాతీతుడు.
నిత్యమూ నన్నే నిశ్చలభక్తి తో సేవించేవాడు,త్రిగుణాలను అతిక్రమించి బ్రహ్మత్వానికి అర్హుడవుతాడు.
పరమాత్మకు,మోక్షధర్మాలకు,సచ్చిదానందానికీ,నిరాకార బ్రహ్మానికి నేనే మూలము.
*****************
Sri Bhagavad Gita Part14, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu