Valmiki Ramayanam Telugu Yuddha Kanda Day 40 | వాల్మీకి మహర్షి రామాయణం యుద్ధకాండ

Valmiki Ramayanam Telugu Yuddha Kanda Day 40

Dear All, Jai Shree Ram ! here are the details about Valmiki Ramayanam Telugu Yuddha Kanda Day 40. 

40వ దినము, యుద్ధకాండ

ఇంద్రజిత్ మరణించాడన్న వార్త విన్న రావణుడు కూర్చున్న తల్పం మీదనుండి కిందపడి దీర్ఘమూర్చని పొందాడు. తరువాత ఆయన అన్నాడు ” నా కుమారుడు ఇంద్రజిత్ ఎవరి చేత సంహరింపబడనివాడు, ఇవ్వాళ ఇంత దారుణంగా మరణించాడు. ఇంక నాకీ జీవితం ఎందుకు. అసలు ఇన్ని ఉపద్రవాలకి కారణం అయిన సీతని సంహరించేస్తాను ” అని ఒక పెద్ద కత్తి పట్టుకుని బయలుదేరాడు. ఆగ్రహంతో తన వైపుకి వస్తున్న రావణుడిని చూసి సీతమ్మ ఒణికిపోయింది. రావణుడు సీతమ్మని చంపుదామనుకునేసరికి మహాపార్షుడు అక్కడికి వచ్చి అన్నాడు ” ఇంత బతుకు బతికి, ఇంత చదువు చదివి, ఇంతమందిని ఓడించి, ఇంతమందీ చచ్చిపోయాక ఒక ఆడదాన్ని కూడా రావణుడు చంపాడన్న అపకీర్తిని మూటకట్టుకుంటావ రావణా. నువ్వు మగాడివైతే యుద్ధం చేసి రాముడిని చంపు, అంతేకాని ఆడదానిమీద ఎందుకు నీ ప్రతాపం ” అన్నాడు.

అప్పుడు రావణుడు ” రేపు అమావాస్య, రేపు రాముడితో యుద్ధం చేస్తాను ” అని అంతఃపురానికి వచ్చేశాడు.

మరునాడు రావణుడు విరూపాక్షుడుమహోదరుడుమహాపార్షుడు మొదలైన రాక్షస వీరులతో యుద్ధానికి వచ్చాడు.

ఆ యుద్ధంలో విరూపాక్షుడిని, మహోదరుడిని సుగ్రీవుడు చంపాడు, మహాపార్షుడిని అంగదుడు చంపాడు.

అప్పుడు రాముడు మండలాకారంగా తన ధనుస్సుని పట్టుకొని బాణాలు వేస్తుంటే, లోపలినుంచి కోరికలు పుట్టిస్తున్న జీవాత్మ ఎలా కనపడదో, అలా బాణపు దెబ్బలు తగులుతున్నాయి, ఏనుగుల తొండాలు తెగిపోతున్నాయి, గుర్రాలు కాళ్ళు తెగి పడిపోతున్నాయి, లక్షల రాక్షస సైన్యం పడిపోతుంది కాని రాముడు మాత్రం కనపడడం లేదు. ఆ సమయంలో రాముడు అగ్ని చక్రం తిరిగినట్టు తిరుగుతూ, మండలాకారంగా(వృత్తాకారంలో) ధనుస్సుని పట్టుకుని తిరుగుతూ కొన్ని కోట్ల రాక్షసులని కొట్టాడు.

‘ తన ఇంటి గుట్టుని రాముడికి చెప్పి ఇంతమంది రాక్షసుల మరణానికి కారణమైనవాడు ఆ విభీషణుడు ‘ అనుకొని, రావణుడు శక్తి అనే అస్త్రాన్ని విభీషణుడి మీదకి ప్రయోగించబోతుండగా, లక్ష్మణుడు బాణములతో ఆయన చేతిని కొట్టాడు. ఆగ్రహించిన రావణుడు ఆ శక్తిని లక్ష్మణుడి మీద ప్రయోగించాడు, అప్పుడా శక్తి లక్ష్మణుడి వక్షస్థలం నుండి దూసుకుపోయింది. వెంటనే ఆయన మూర్చపోయి కిందపడిపోయాడు. అప్పుడు హనుమంతుడు లక్ష్మణుడిని ఎత్తి తీసుకెళ్ళి రాముడి దెగ్గర పెట్టాడు.

అప్పుడు రాముడన్నాడు ” నా చేతిలోనుంచి ధనుస్సు జారిపోతోంది, మంత్రములు జ్ఞాపకానికి రావడం లేదు. ఏ దేశానికి వెళ్ళినా భార్య దొరుకుతుంది, ఏ దేశానికి వెళ్ళినా బంధువులు దొరుకుతారు, కాని తోడపుట్టినవాడు మాత్రం జీవితంలో ఒక్కసారే వస్తాడు ” అని బాధపడ్డాడు.

అప్పుడు హనుమంతుడు ” రామ! నువ్వు బెంగపెట్టుకోకు, లక్ష్మణుడిని ఎలా బతికించుకోవాలో నాకు తెలుసు ” అని మళ్ళి ఆకాశంలోకి ఎగిరి, హిమాలయ పర్వతాలని చేరుకొని అక్కడున్న ఓషధ పర్వతాన్ని తీసుకొచ్చాడు. అప్పుడు సుషేణుడు ఆ ఓషదులని లక్ష్మణుడి ముక్కులో పిండాడు, ఆ ఓషదుల వాసన తగలగానే లక్ష్మణుడు మళ్ళి పైకి లేచాడు.

” ఇంక నేను యుద్ధం చేస్తాను ఈ రావణుడితో ” అని రాముడు ముందుకి బయలుదేరాడు. ఆ సమయంలో ఆ యుద్ధాన్ని ఆకాశంలో నుండి చూస్తున్న దేవతలు ‘ దుర్మార్గుడు, దుష్టుడు అయిన రావణుడు రథంలో ఉండి యుద్ధం చేస్తున్నాడు, మహానుభావుడైన రాముడు భూమి మీద నుండి యుద్ధం చేస్తున్నాడు ‘ అని అనుకున్నారు. అప్పుడు ఇంద్రుడు తన సారధి అయిన మాతలిని రాముడికి సహాయం చెయ్యమని చెప్పి తన రథం ఇచ్చి పంపించాడు.

అప్పుడా మాతలి రాముడితో అన్నాడు ” రామ! ఇంద్రుడు ఈ రథాన్ని పంపించాడు. దీనికి ఆకుపచ్చని గుర్రాలు కట్టి ఉంటాయి. పూర్తిగా కాల్చిన బంగారంతో ఈ రథం నిర్మింపబడినది. ఇందులో అక్షయబాణ తూణీరాలు, ఇంద్రుడు పట్టుకునే గొప్ప ధనుస్సు ఉన్నాయి. మీరు ఈ రథాన్ని ఎక్కండి, నేను మీకు సారధ్యం చేస్తాను. శ్రీ మహావిష్ణువుని గరుడుడు వహించినట్టు నేను మీకు సారధ్యం చేస్తాను. మీకు ఇవ్వమని చెప్పి ఇంద్రుడు ఈ శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చాడు, మీరు దీన్ని స్వీకరించండి ” అన్నాడు.

రాముడు ఆ రథానికి నమస్కరించి దానిలోకి ఎక్కాడు. అప్పుడు రాముడికి రావణుడికి చండప్రచండమైన యుద్ధం జెరిగింది. రాముడి బాణాల వేగాన్ని తట్టుకోలేక ఆ రావణుడు వెనక్కి వెళ్ళాడు. వాళ్ళిద్దరికీ యుద్ధం జెరుగుతుండగా ఆకాశం అంతా చీకటిగా అయిపోయింది. పగటి వేళలో వాళ్ళిద్దరి బాణ పరంపర ఆకాశాన్ని కప్పేసింది. అప్పుడు రాముడన్నాడు ” ఇంక మీరెవ్వరు యుద్ధం చెయ్యకండి, అలా నిలబడి చూడండి. రావణుడో రాముడో తేలిపోవాలి ” అన్నాడు.

అటుపక్క రాక్షసులు, ఇటుపక్క వానరాలు నిలబడిపోయి రామ-రావణ యుద్ధాన్ని చూస్తున్నాయి. రావణుడు 20 చేతులతో ఆయుధాలని రాముడి మీదకి ప్రయోగిస్తున్నాడు. ఆ సమయంలో రావణుడు శక్తి అనే అస్తాన్ని రాముడి మీదకి విడిచిపెట్టాడు. అప్పుడు రాముడనుకున్నాడు ‘ ఈ రథం ఎక్కాక, లక్ష్మణుడు బతికాక, నాకు విపరీతమైన ఆనందం కలుగుతోంది. అన్ని అస్త్ర-సస్త్రాలు నాకు జ్ఞాపకానికి వస్తున్నాయి. ఉత్సాహం పొటమరిస్తోంది ‘ అనుకొని, ఇంద్రుడు ఇచ్చిన శక్తిని ప్రయోగించాడు. ఇద్దరి యొక్క శక్తులు ఆకాశంలో కొట్టుకొని నిర్వీర్యం అయ్యి కిందపడిపోయాయి. ఆ తరువాత రాముడు వేసిన బాణాలని రావణుడు తట్టుకోలేకపోయాడు, ఆయన చేతిలోని ధనుస్సు విరిగిపోయింది. అటువంటి సమయంలో రావణుడి సారధి ఆయన రథాన్ని యుద్ధభూమి నుండి దూరంగా తీసుకెళ్ళిపోయాడు.

అప్పుడు రావణుడు ఆ సారధితో ” ఛి నీచుడ! నా జీవితంలో లేదు ఇటువంటి అప్రతిష్ట. యుద్ధభూమిలో ఉండగా నా తలలు తెగిపోయినా పరవాలేదు, కాని నువ్వు రథాన్ని చాటుకి తీసుకొచ్చి దాచావు. నువ్వు శత్రువుల దెగ్గర లంచం తీసుకున్నావు కనుకనే ఇలాంటి పని చేశావు, నిజం చెప్పు? ” అన్నాడు.

 

 



 

అప్పుడా సారధి ” మీ దెగ్గర ఇంత కాలం పని చేశాను. ఇప్పుడు ఒకరి దెగ్గర లంచం తీసుకొని మిమ్మల్ని అవమానించవలసిన అగత్యం నాకు లేదు. నేను శాస్త్రం తెలియనివాడిని కాదు, మర్యాద తెలియనివాడిని కాదు, రధికుడు రథంలో ఉండగా ఎలా నడపాలో తెలియని భ్రష్టుడిని కాదు. నేను ఎంతో కాలంగా మీ ఉప్పు తిన్నాను, మీయందు కృతజ్ఞుడనై ఉన్నాను. ద్వంద యుద్ధం జెరుగుతున్నప్పుడు సమయోచితంగా అవసరాన్ని బట్టి రథాన్ని దెగ్గరికి తీసుకెళ్ళాలి, దూరంగా కూడా తీసుకెళ్ళాలి, గుర్రాలు అలసిపోతున్నాయేమో చూసుకోవాలి, వెనుకన ఉన్న రథియొక్క పరిస్థితిని గమనించుకోవాలి. రాముడి బాణపు వేడి చేత గుర్రాలు శోషించిపోయాయి, తిరిగి ఆయుధాన్ని ప్రయోగించలేని నీరస స్థితిని మీరు పొందుతున్నారు. అప్పుడు రథికుడిని రక్షించుకోవలసిన బాధ్యత సారధికి ఉంది, అందుకని నేను రథాన్ని వెనక్కి తెచ్చాను. అంతేకాని ఒకరి దెగ్గర లంచం తీసుకొని మిమ్మల్ని తేవలసిన అవసరం నాకు లేదు, మీ సేవలో ధన్యుడను అవ్వడానికి నీతికి కట్టబడిన సారధిని నేను ” అన్నాడు.

అప్పుడు రావణుడు ” నేను నిన్ను ఎన్ని మాటలు అన్ననురా సారధి. నువ్వు ఉత్తమ సేవకుడివి ” అని చెప్పి, తన చేతికున్న స్వర్ణ కంకణాన్ని తీసి సారధికి ఇచ్చాడు.

ఈ సమయంలోనే లంకా పట్టణంలో ఉన్న ప్రజలు ఒకరితో ఒకరు ” ఆ శూర్పణఖ జుట్టు తెల్లబడిపోయి వృద్ధురాలు అయిపోయింది, ఒళ్ళు ముడతలు పడిపోయింది, భయంకరమైన, వికృతమైన స్వరూపంతో ఉంటుంది, జారిపోయిన కడుపు ఉన్నది, కఠినమైన మాట కలిగినటువంటిది. అటువంటి శూర్పణఖ మన్మదుడితో సమానమైన ఆకృతి కలిగినవాడిని, అంత మధురముగా మాట్లాడగలిగినవాడిని, అటువంటి సౌందర్య రాశిని, చక్కటి నడువడి కలిగినవాడిని, సర్వకాలములయందు ధర్మమును అనుష్టించేవాడు అయిన రాముడిని ఏ ముఖం పెట్టుకొని కామించింది? రాముడిని పొందాలన్న కోరిక ఎలా కలిగింది? ఆ రాముడు వైముఖ్యాన్ని ప్రదర్శిస్తే, కడుపులో కక్ష పెంచుకుని సీతాపహరణానికి దారితీసేటట్టుగా రావణుడి మనస్సు వ్యగ్రత పొందేటట్టుగా ఎలా మాట్లడగలిగింది?  రావణుడు ఎంత మూర్ఖుడు, రాముడు అరణ్యంలో 14,000 మంది రాక్షసులని, ఖర-దూషణులని సంహరించాడు. అలాంటివాడితో సంధి చేసుకుందాము అన్న ఆలోచన లేకుండా శూర్పణఖ మాటలు విని సీతని అపహరించడానికి వెళ్ళాడు.

పోని అప్పటికి రాముడు అంత పరాక్రమము ఉన్నవాడని రావణుడు తెలుసుకోలేకపోయాడు అని అనుకుందాము. కాని రాజ్యభ్రష్టుడై అన్నగారి చేత తరమబడి, ఋష్యమూక పర్వత శిఖరముల మీద కూర్చున్న సుగ్రీవుడిని రక్షించడం కోసమని ఆయనతో స్నేహాన్ని చేసుకొని, వాలిని ఒక్క బాణంతో సంహరించి, చేసుకున్న స్నేహానికి, ఒప్పందానికి నిలబడి సుగ్రీవుడిని రాజ్యమునందు ప్రతిష్టించినప్పుడైనా రావణుడి కళ్ళుతెరుచుకోలేదా.

 

Valmiki Ramayanam Telugu Yuddha Kanda Day 40

 

 

పోని అప్పుడు కూడా తెలుసుకోలేకపోయాడు అని అనుకుందాము. కాని విభీషణుడు ధర్మబద్ధమైన మాట చెప్పాడు ‘ అన్నయ్యా, నువ్వు రాముడిని నిగ్రహించలేవు, లంక అంతా నాశనమయిపోతుంది. నువ్వు చేసినది పాపపు నడువడితో కూడిన పని. నా మాట విని సీతమ్మని తీసుకెళ్ళి రాముడికి ఇచెయ్యి ‘ అని చెప్పాడు. విభీషణుడి మాటలు కాని రావణుడు విని ఉంటె ఇవ్వాళ లంకా పట్టణానికి ఇంతటి చేటుకాలం దాపురించేది కాదు. తోడపుట్టినవాడైన కుంభకర్ణుడు రాముడి చేతిలో చనిపోయాడు, తన కుమారులైన నరాంతకుడు, అతికాయుడు మొదలైన వారందరూ మరణించారు, మహోదర, మహాపార్షులు మొదలైనవారు మరణించారు, ఆఖరికి ఇంద్రజిత్ కూడా లక్ష్మణుడి చేతిలో మరణించాడు. ఇంతమంది చనిపోయాక కూడా వచ్చినవాడు సామాన్య నరుడు కాదన్న ఆలోచన రావణుడికి రావట్లేదే?

ఒకానొకసారి దేవతలందరూ కూడా రావణుడు చేస్తున్న ఆగడములను భరించలేక అందరూ కలిసి బ్రహ్మగారి దెగ్గరికి వెళ్ళి ‘ అయ్యా! రావణుడు చేస్తున్న ఆగడాలు మేము భరించలేకపోతున్నాము, నరవానరముల చేతిలో తప్ప వాడికి ఎవరి చేతిలో చావు లేదు. ఇవ్వాళ వాడి ముందుకెళ్ళి నిలబడగలిగే ధైర్యం ఎవరికీ లేదు. సముద్రం కూడా కెరటాలతో వాడి ముందు నిలబడడానికి భయపడుతుంది, సూర్యుడు గట్టిగా ప్రకాశించడం లేదు, అలా దిక్పాలకులని కూడా శాసించగలిగే స్థితిలో ఉన్నాడు. వాడి చేతిలో లోకములన్నీ పీడింపబడుతున్నాయి, మేము ఎలా జీవించాలి ‘ అని అడిగారు. అప్పుడు బ్రహ్మగారు ‘ నేను ఇవ్వాల్టి నుంచి ఒక కట్టుబాటు చేస్తున్నాను. ఈ రాక్షసులు మూడు లోకములలోనూ తిరుగుతూ ఉంటారు, ఒక చోట ఉండరు, దానివల్ల మీకు కొంత ఉపశాంతి కలుగుతుంది ‘ అని అన్నారు.

దానివల్ల ఆ దేవతలు పూర్తి ఉపశాంతిని పొందకపోవడం చేత శివుడి కోసం తపస్సు చేశారు. త్రిపురములను తన కంటి మంట చేత నశింపచేసినవాడైన పరమశివుడు ఆ దేవతలయందు ప్రీతి చెంది, వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యి ‘ ఇంత తపస్సు కలిగిన రావణుడు మరణించడానికి కావలసిన విధంగా, సీత అన్న పేరుతో అమ్మవారు ఉదయించబోతోంది ‘ అని ఆరోజున శివుడు దేవతలకి వరం ఇచ్చాడు. అందుచేత రావణుడు అపహరించి తీసుకొచ్చిన ఆ మైథిలి సాక్షాత్తుగా రావణుడి ప్రాణములను తీసుకోడానికి, ఈ లంకా పట్టణాన్ని సర్వనాశనం చెయ్యడానికి, రాక్షసులందరినీ పరిమార్చడానికి కాళ రాత్రిలా వచ్చింది. ఈ విషయాన్ని రావణుడు తెలుసుకోలేక రాముడి మీదకి యుద్ధానికి వెళుతున్నాడు ” అని ఆ లంకా పట్టణంలోని ప్రజలు చెప్పుకుంటున్నారు.

ఇటుపక్కన రాముడు అలసిపోయినవాడై ‘ ఈ రావణుడిని అసలు ఎలా సంహరించడం ‘ అని ఆలోచిస్తుండగా, ఆ సమయంలో దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, ఋషులు మొదలైనవారందరూ ఆకాశంలో నిలబడ్డారు. అందరితోపాటుగా వారిలోకి గబగబా అగస్త్య మహర్షి వచ్చి ” రామ! రామ! ఇప్పుడు నేను నీకు ఆదిత్య హృదయం ఉపదేశం చేస్తున్నాను, దీనిని నువ్వు స్వీకరించు. ఇది కాని నువ్వు పొందావ, ఇక నీకు ఏ విధమైన అలసట ఉండదు. ఈ పరమమంగళమైన ఆదిత్య హృదయాన్ని నీకు భయం కలిగినప్పుడు కాని, అరణ్యంలో ఉన్నప్పుడు కాని చదువుకో, నీకు రక్ష చేస్తుంది ” అని చెప్పి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు……

Valmiki Ramayanam Telugu Yuddha Kanda Day 40

Valmiki Ramayanam Telugu Yuddha Kanda Day 40

తతౌ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం
ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః
అగస్త్య ఉవాచ:
రామరామహాబాహో శృణు గుహ్యం సనాతనం
యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి
ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం
జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం
సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం
చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం
రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం
పూజయస్వవివస్వంతం భాస్కరం భువనేశ్వరం
సర్వ దేవాత్మకో హ్యేశ తేజస్వీ రశ్మిభావనః
ఏశ దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః
ఏశ బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః
మహేంద్రో ధనదః కాలో యమస్సోమో హ్యపాంపతిః
పితరో వసవః సాధ్యాః అశ్వినౌ మరుతో మనుః
వాయుః వహ్నిః ప్రజాప్రాణా ఋతు కర్తా ప్రభాకరః
ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్
సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః
హరిదశ్వస్సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్
తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తండక అంషుమాన్
హిరణ్యగర్భహ్ శిశిరస్తపనో భాస్కరో రవిః
అగ్నిగర్భోఅదితేః పుత్రః శంఖః శిశిరనాశనహ్
వ్యోమనాథ స్తమోభెదీ ఋగ్ యజుస్సామ పారగః
ఘన వృష్టిరపాం మిత్రో వింధ్య వీథీ ప్లవంగమః
ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః
కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వ భవోధ్భవః

 




Valmiki Ramayanam Telugu Sundara Kaanda Day 34 | సుందరకాండ వాల్మీకి మహర్షి రామాయణం

 

 

నక్షత్ర గ్రహతారాణాం అధిపో విశ్వ భావనః
తెజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే
నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయె నమః
జ్యోతిర్గణాణాం పతయే దినధిపతయే నమః
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః
నమో నమస్సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః
నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః
నమః పద్మ ప్రబోధాయ ప్రచండాయ నమో నమః
బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషె నమః
తమొఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనె
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః
తప్త చామీక రాభాయ హరయే విష్వకర్మణే
నమస్తమోభినిఘ్నాయ రుచయే లొకసాక్షిణే
నాశయత్యేష వై భూతం తదైవ సృజతి ప్రభుః
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః
ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః
ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం
వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ
యాని కృత్యాని లోకేషు సర్వేషు పరమ ప్రభుః
ఏనమాపత్సు కృత్ శ్రేషు కాంతారేషు భయేషు చ
కీర్తయన్ పురుషః కశ్చిన్ నావసీదతి రాఘవః
పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి
అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి
ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం
ఏతత్ శృత్వా మహాతెజా నష్టశొకొభవత్తదా
ధారయామాస సుప్రీతొ రాఘవహ్ ప్రయతాత్మవాన్
ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్
రావణం ప్రేక్ష్య హ్రుష్టాత్మా యుద్ధాయ సముపాగమత్
సర్వ యత్నేన మహతా వధె తస్య ధృతోభవత్
అథ రవి రవదన్నిరీక్ష్య రామం
ముదితమనాః పరమం ప్రహృష్యమానః
నిశిచరపతి సంక్షయం విదిత్వా
సురగణమధ్యగతో వచస్త్వరేతి
1 నుండి 2 శ్లోకాలు అగస్త్యుడు శ్రీరాముడికి వద్ద కు వచ్చుట
3 నుండి 5 శ్లోకాలు : ఆదిత్య హృదయ పారాయణ వైశిష్టత చెప్పబడింది.
6 నుండి 15 శ్లోకాలు  : సూర్యుడంటే బయటకు వ్యక్త మవుతున్న లోపలి ఆత్మ స్వరూపమని, బాహ్యరూపము అంత స్వరూపము ఒక్కటే.
16 నుండి 20 శ్లోకాలు  : మంత్ర జపం
21 నుండి 24 శ్లోకాలు : సూర్యుడు గురించి శ్లోక మంత్రాలు
25 నుండి 30 శ్లోకాలు : పారాయణ వల్ల కలిగే ఫలం, పారాయణ చేయ వలసిన విధానం, సూర్యభగవనుడు శ్రీ రాముడు విజయాన్ని పొందేటట్లు అశీర్వదించడం

 

https://sharemebook.com/ https://sharemebook.com/ https://sharemebook.com/

 

Valmiki Ramayanam Telugu Yuddha Kanda Day 40

 

Valmiki Ramayanam Telugu Sundara Kaanda Day 32 | సుందరకాండ వాల్మీకి మహర్షి రామాయణం

 

 

Valmiki Ramayanam Telugu Yuddha Kanda Day 40

 

 

అగస్త్యుడు అన్నాడు ” ఈ ఆదిత్య హృదయాన్ని చదువు, నువ్వు నీ సర్వ శత్రువులని జయిస్తావు, నీ శత్రువులని దునుమాడేస్తావు, నీ కోరికలన్నీ సిద్ధిస్తాయి. రావణుడు నీ చేతిలో నిహతుడు అవుతాడు ” అన్నాడు.

రాముడు ఆ ఆదిత్య హృదయాన్ని మూడు సార్లు చదివాక అగస్త్యుడు వెళ్ళిపోయాడు.

ఆ తరువాత రావణుడు నల్లటి గుర్రాలు కట్టి ఉన్న తన రథం మీద యుద్ద భూమికి తీవ్రమైన వేగంతో వచ్చాడు.

అప్పుడు రాముడు ” మాతలి! ప్రతిద్వంది వస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండు, ఎంత మాత్రం పొరబడకు. రథాన్ని కుడి చేతి వైపుకి తీసుకువెళ్ళు. నేను నీకు చెప్పాను అని మరోలా అనుకోకు, నువ్వు ఇంద్రుడికి సారధ్యం చేస్తున్నవాడివి, నీకు అన్నీ తెలుసు. కాని నీ మనస్సునందు ధైర్యం ఉండడం కోసమని ఈ మాట చెప్పాను. వేరొకలా భావించకు ” అన్నాడు.

ఆ యుద్ధ భూమిలో ఒకరికి ఎదురుగా ఒకరి రథాలని నిలబెట్టారు. ఆకాశంలో దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, ఋషులు, మహర్షులు, బ్రహ్మర్షులు అందరూ నిలబడి ” రాముడు ఈ యుద్ధంలో గెలవాలి, రావణ సంహారం చెయ్యాలి ” అని స్వస్తి వాచకం చేస్తున్నారు.

రావణుడు యుద్ధ భూమిలోకి వచ్చి నిలబడుతున్న సమయంలో ఆకాశం నుండి రక్త వర్షం కురిసింది, అదే సమయంలో మండలాకారంలో గాలులు తిరిగాయి, ఆకాశంలో గ్రద్దలు తిరుగుతూ వచ్చి ఆయన ధ్వజం మీద వాలాయి, నిష్కారణంగా అక్కడున్న భూమి కదిలింది, ఆకాశంలో మేఘాలు లేకుండానే రాక్షస సైన్యం వైపు పిడుగులు పడ్డాయి, ఆకాశం నుండి ఒక తోకచుక్క రావణుడి రథం మీద పడింది, రాక్షసులు తమ ఆయుధములను ప్రయోగిద్దామని చేతులు పైకి ఎత్తుతుంటే ఎవరో వచ్చి పట్టుకున్నట్టు చేతులు ఆగిపోయాయి, లంకా పట్టణం అంతా కాలిపోతున్నట్టు ఎర్రటి కాంతిని పొందింది, ఇళ్ళల్లో ఉన్న గోరువంకల మీద రాబందులు వచ్చి దాడి చేశాయి, సూర్యమండలం నుంచి ఎర్రటి, తెల్లటి, పసుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన కిరణాలు రావణుడి మీద పడ్డాయి, నిష్కారణంగా గుర్రాలు ఏడిచాయి, నక్కలు పెద్ద పెద్ద కూతలు కూశాయి, క్రూరమైన మృగాలు రావణుడి ముఖాన్ని చూస్తూ పెద్దగా అరిచాయి.

రామ-రావణ యుద్ధం ప్రారంభం అవ్వగానే అప్పటిదాకా కొట్టుకున్న వానరులు, రాక్షసులు ఒకరి పక్కన ఒకరు నిలబడి అలా చూస్తుండిపోయారు. రాముడు, రావణుడు ప్రయోగించిన బాణాలకి ఆకాశం అంతా చీకటి అయిపోయి, ఆకాశంలో గుద్దుకుంటున్న బాణముల మెరుపులే కనపడుతున్నాయి. అప్పుడు రావణుడు కొన్ని బాణములని రాముడి రథం యొక్క ధ్వజం మీదకి ప్రయోగించాడు. ఆ రథం యొక్క శక్తి చేత రావణుడు వేసిన బాణములు నిర్వీర్యం అయిపోయాయి. తరువాత రాముడు వేసిన బాణములకి రావణుడి ధ్వజం విరిగిపోయి నేలమీద పడిపోయింది. ఆ తరువాత రావణుడు బాణములతో రాముడి రథాన్ని లాగుతున్న గుర్రాలని కొట్టాడు. కాని ఆ గుర్రాలు రావణుడి బాణాలు తగిలినా కనీసం కదలను కూడా కదలలేదు. రావణుడు వేస్తున్న మాయతో కూడిన బాణముల నుంచి కొన్ని వేల రోకళ్ళు, పర్వతములు, వృక్షాలు, రోళ్ళు, చిత్ర విచిత్రమైనవన్నీ పుట్టి రాముడి రథం మీద పడిపోతున్నాయి. రావణుడి అన్ని బాణములకు సమాధానంగా రాముడు బాణ ప్రయోగం చేసి రావణుడి సారధిని, గుర్రాలని, ధ్వజాన్ని కొట్టాడు.

వాళ్ళిద్దరూ చేస్తున్న యుద్ధానికి సముద్రాలన్నీ క్షోభించాయి, నదులు గట్లు దాటి ప్రవహించాయి, భూమి అంతా కదిలిపోయింది, సూర్యమండలం అంతా ధూమముతో ఆవహించబడి ఉంది, బ్రహ్మాండములో ఉన్న సర్వ భూతములు కలత చెందాయి.

గగనం గగనాకారం సాగరం సాగరోపమం
రామ రావణయోర్యుద్ధం రామరావణయోరివ

ఆ భయంకరమైన యుద్ధాన్ని వర్ణిస్తూ వాల్మీకి మహర్షి ” ఆకాశానికి ఆకాశమే పోలిక, సముద్రానికి సముద్రమే పోలిక, రామ-రావణ యుద్ధానికి రామ-రావణ యుద్ధమే పోలిక ” అన్నారు.

 




Valmiki Ramayanam Telugu Sundara Kaanda Day 31 | సుందరకాండ వాల్మీకి మహర్షి రామాయణం

 

 

అప్పుడు రాముడు విషంతో కూడిన సర్పం వంటి బాణమును తీసి, వింటినారికి సధించి, రావణుడి కంఠానికి గురిచూసి విడిచిపెట్టాడు. ఆ బాణం తగలగానే రావణుడి ఒక శిరస్సు తెగిపోయి భూమి మీద పడిపోయింది. ఆ శిరస్సు అలా పడిపోగానే మళ్ళి ఒక కొత్త శిరస్సు మొలకెత్తింది. మళ్ళి బాణం పెట్టి ఇంకొక శిరస్సుని రాముడు కొట్టాడు, అది కూడా మొదటిదానిలాగానే కిందపడిపోయింది, కాని మళ్ళి కొత్త శిరస్సు పుట్టింది. అలా రాముడు మొత్తం 100 సార్లు రావణుడి సిరస్సులని కొట్టాడు.

అప్పుడు రాముడు అనుకున్నాడు ‘ ఈ బాణంతో మారీచుడిని, ఖరుడిని, దూషణుడిని, వాలిని సంహరించాను. ఈ బాణానికి ఎదురులేదు, ఈ బాణంతో ఇప్పటికి నూరు తలకాయలు భూమి మీద పడేశాను. కాని ఈ బాణం రావణుడి చంపలేకపోతుంది ‘ అని అనుకున్నాడు.

వాళ్ళిద్దరి మధ్య ఆ యుద్ధం 7 రాత్రులు, 7 పగళ్ళు, ఒక్క క్షణం కూడా విరామం లేకుండా జెరిగింది. ఆకాశం అంతా దేవతలు, ఋషులు మొదలైన వాళ్ళతో నిండిపోయింది.

అప్పుడు మాతలి ” రామ! 7 రాత్రులు 7 పగళ్ళ నుంచి యుద్ధం చేస్తున్నావు. దేవతలందరూ రావణుడి శిరస్సు పడిపోయే ముహూర్తాన్ని నిర్ణయించిన సమయం ఆసన్నమయిపోయింది. అగస్త్యడు ఇచ్చిన దివ్యమైన అస్త్రం నీయొక్క బాణతుణీరంలో ఉంది, దానిని బయటకి తీసి అభిమంత్రించి విడిచిపెట్టు ” అన్నాడు.

అప్పుడు రాముడు ఆ అస్త్రాన్ని బయటకి తీస్తుంటే, అది పుట్టలోనుంచి బయటకి వస్తున్న బ్రహ్మాండమైన సర్పంలా ఉంది. లోకాలని రక్షించమని ఆ అస్త్రాన్ని బ్రహ్మగారు దేవేంద్రుడికి ఇచ్చారు. ఆ అస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టగానే అది వాయు వేగంతో వెళ్ళిపోతుంది, దానికున్న బంగారు ములుకులో అగ్ని, సూర్యుడు ఉంటారు, దాని శరీరం బ్రహ్మమయం అయ్యి ఉంటుంది, సుర్యుడివంటి తేజస్సుతో ఉంటుంది, ధూమంతో నిండిపోయిన కాలాగ్నిలా ఉంటుంది. ఆ బాణం ఇంతకముందు ఎన్నో పర్వతాలని చీల్చుకుంటూ, ద్వారాలని బద్దలుకొడుతూ, పరిఘలని విరుచుకుంటూ, ఎందరో రాక్షసుల గుండెల్ని బేధించుకుంటూ వెళ్ళింది. దాని ఒంటి మీద కొంచెం రక్తం, కొవ్వు ఉంటాయి. ఆ బాణం ఇంతకముందు ఎక్కడెక్కడ ప్రయోగింపబడిందో అక్కడ వెంటనే డేగలు, గ్రద్దలు, రాబందులు, నక్కలు, క్రూరమృగాల గుంపులుగా వచ్చి చనిపోయిన శత్రువుల మాంసాన్ని తినేవి.

Valmiki Ramayanam Telugu Yuddha Kanda Day 42 | వాల్మీకి మహర్షి రామాయణం యుద్ధకాండ

Valmiki Ramayanam Telugu Yuddha Kanda Day 40

 

రాముడు ఆ బాణాన్ని చేతితో పట్టుకుని దానిమీద వేదప్రోక్తంగా బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించాడు. ఆయనలా బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించేసరికి భూమి అంతా కంపించింది. అప్పుడాయన ఆ బాణాన్ని వింటినారికి తగిలించి, చెవి వరకూ లాగి, పరమాత్మని స్తోత్రం చేస్తూ, శత్రువు నిగ్రహింపబడాలని కోరుకుంటూ విడిచిపెట్టాడు. ఆ బాణం ఒక్క క్షణంలో భయంకరమైన ధ్వనిని చేస్తూ, లోకాలన్నిటినీ క్షోభింప చేస్తూ, ఇంతకాలం ఏ రావణుడు లోకములన్నిటినీ పీడించాడొ, ఆ రావణుడి గుండెల్ని బద్దలు చేస్తూ ఆయన వక్షస్థలం నుండి దూసుకు వెళ్ళింది.

రావణుడి చేతిలో ఉన్న ధనుస్సు, ఆయుధములు కింద పడిపోయాయి, ప్రాణాలు విడిచిపెట్టేసి ఆ శరీరంతో కింద పడిపోయాడు.

రావణాసురుడు మరణించాడు.

రావణుడు మరణించగానే ఆకాశంలో దేవదుందుభిలు మ్రోగాయి. వెంటనే సుగ్రీవుడు, లక్ష్మణుడు, అంగదుడు, ఋషభుడు, వేగదర్శి, నీలుడు, సుషేణుడు, గందమాధనుడు, మైందుడు, జాంబవంతుడు, కొన్ని కోట్ల వానరములు అందరూ పరమానందంతో రాముడి దెగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అందరూ రాముడి పాదాల మీద పడిపోయి, ఆనందంతో పూజలు చేసి, ” రామ రామ ” అంటూ ఆయన ఒళ్ళు ముట్టుకుని పరవశించిపోయారు. హనుమంతుడు ఆనందంతో నాట్యం చేశాడు.

రావణుడు రథం మీద నుంచి కింద పడిపోయేసరికి అక్కడున్న రాక్షసులు పరుగులు తీశారు. వానరాలన్నీ కనపడ్డ రాక్షసుడిని వెంట తరిమి సంహరించారు.

ఆకాశంలో దేవతలందరూ పొంగిపోయి రాముడిని పొగిడారు .

Valmiki Ramayanam Telugu  Yuddha Kanda Day 40 వాల్మీకి రామాయణం యుద్ధకాండ తెలుగు Maharsi Valmiki

Valmiki Ramayanam Telugu Yuddha Kanda Day 37 | వాల్మీకి మహర్షి రామాయణం యుద్ధకాండ

#ValmikiRamayanam #Telugu #YuddhaKanda #వాల్మీకిరామాయణం #తెలుగు #యుద్ధకాండ

Valmiki Ramayanam Telugu Yuddha Kanda Day 40

Spread iiQ8