Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 28 | కిష్కింధకాండ వాల్మీకి మహర్షి రామాయణం

Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 28

 

Jai Shree Ram ! Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 28.

 

28వ దినము, కిష్కింధకాండ | Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 28 | కిష్కింధకాండ వాల్మీకి మహర్షి రామాయణం

సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం 4 దిక్కులకి వెళ్ళిన వానరములలో 3 దిక్కులకి వెళ్ళిన వానరములు నెల రోజుల తరువాత వెనక్కి తిరిగి వచ్చేశాయి. వాళ్ళు అన్ని ప్రాంతాలని వెతికినా సీతమ్మ జాడ ఎక్కడా కనపడలేదు.

దక్షిణ దిక్కుకి వెళ్ళిన వానరములు వింధ్య పర్వతం దెగ్గరికి వెళ్ళి, ఆ పర్వతంలో ఉన్న చెట్లని, గుహలని, సరస్సులని, మార్గమధ్యంలో ఉన్న నదులని, పట్టణాలని, గ్రామాలని అన్వేషిస్తూ వెళుతున్నారు. అలా కొంతదూరం వెళ్ళాక నిర్జనమైన అరణ్యానికి చేరుకున్నారు. అక్కడ చెట్లకి ఒక పండు లేదు, ఆకులు లేవు, ఒక జంతువు కూడా కనబడడం లేదు. అక్కడ తినడానికి కనీసం మూలములు కూడా కనపడలేదు. ఒకప్పుడు కణ్డువు అనే మహర్షి ఈ అరణ్య ప్రాంతంలో ఉండేవారు. ఆయన తపఃశక్తికి దేవతలు కూడా భయపడేవారు. అటువంటి సమయంలో కణ్డువ మహర్షి కుమారుడు ఈ అరణ్యంలో శరీరాన్ని విడిచిపెట్టాడు. అప్పుడు కణ్డువ మహర్షికి ఈ అరణ్యంపట్ల ఒక రకమైన ఖేదం ఏర్పడి ఈ అరణ్యంలో మనుష్యులు కాని, పక్షులు కాని, చెట్లు కాని, జంతువులు కాని ఏమి ఉండవు అని శపించారు.

వాళ్ళు ఆ అరణ్యాన్ని దాటి ముందుకి వెళ్ళగా, ఒక గుహ నుండి భయంకరమైన ఆకారం కలిగిన రాక్షసుడు బయటకి వచ్చి వానరాల మీదకి పరుగులు తీశాడు. ఆ రాక్షసుడిని చూసి దేవతలు కూడా భయపడతారు. అలా వస్తున్న రాక్షసుడిని చూసిన అంగదుడు వస్తున్నది రావణుడే అనుకొని, తన శక్తినంతా కూడబెట్టి అరిచేతితో ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి రాక్షసుడి నవరంధ్రములనుండి రక్తము కారి కిందపడిపోయి మరణించాడు. అప్పుడు వారు ఆ రాక్షసుడు ఉన్నటువంటి గుహని వెతికారు, కాని ఎక్కడా సీతమ్మ జాడ కనపడలేదు.

అలా వారు ఎన్ని ప్రాంతాలని వెతికినా ఏమి ప్రయోజనం లేకపోయింది. వాళ్ళకి ఎక్కడా నీరు, ఆహారము దొరకలేదు, దాంతో వాళ్ళకి విపరీతంగా ఆకలి వేసింది. అప్పుడు వాళ్ళు తడిరెక్కలతో ఎక్కడినుంచన్నా పక్షులు వస్తున్నాయేమో అని వెతుకుతున్నారు. అప్పుడు వాళ్ళకి ఒక బిలం నుండి తడి రెక్కలతో పక్షులు రావడం కనపడింది, వాటి వెనకాల కొన్ని జంతువులు తడి శరీరాలతో బయటకి వస్తున్నాయి. అప్పుడా వానరాలు గడ్డితో, లతలతో కప్పబడి ఉన్న ఆ బిలంలోకి ప్రవేశించారు. లోపలికి వెళితే అంతా చీకటిగా ఉంది, అందుకని ఆ వానరాలు ఒకరి చేతులని ఒకరు పట్టుకొని మెల్లగా లోపలికి వెళ్ళారు.

తీరా లోపలికి వెళ్ళి చూస్తే, అక్కడ లేని వృక్షం లేదు, అక్కడ లేని లత లేదు, చెట్లన్నీ పండ్లతో, పుష్పాలతో పరమ శోభితంగా ఉన్నాయి. ఆ చెట్లకి పెద్ద పెద్ద తేనెపట్లు ఉన్నాయి, అక్కడున్న సరోవరాలలో బంగారంతో చెయ్యబడ్డ తామరపువ్వులు వికసించి ఉన్నాయి. ఆ బంగారు పువ్వు నుండి పడిన పుప్పుడి చేత ఆ సరస్సులలోని నీరు చాలా తీయగా ఉంది. అక్కడ అంతస్తులతో కూడిన మేడలు ఉన్నాయి, ఒక అంతస్తు బంగారంతో, మరొక అంతస్తు వెండితో, మరొక అంతస్తు బంగారంతో, అలా అంతస్తులన్ని బంగారం, వెండితో తాపడం చెయ్యబడి ఉన్నాయి. ఎక్కడ చూసినా వజ్రాలు పొదగబడ్డ బంగారు శయనాలు, ఆసనాలు ఉన్నాయి. ఆ వానరాలు ఈ ప్రాంతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అక్కడ సరోవరాలలో ఉన్న నీటిని తాగి దాహం తీర్చుకున్నారు.

అప్పుడు వాళ్ళకి కొద్ది దూరంలోనే ఒక స్త్రీ కనబడింది. ఆ స్త్రీ కృష్ణాజినం కట్టుకొని, నారచీర కట్టుకొని, తేజస్సుతో, తపోశక్తితో మెరిసిపోతూ ఉంది. ఆ తల్లి దెగ్గరికి ఈ వానరాలు వెళ్ళి నమస్కరించి ” మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. బయట నుంచి చూస్తే చిన్న బిలంలా ఉంది, లోపలికి వస్తే ఇంత అద్భుతంగా ఉంది. అసలు ఈ గుహ ఎవరిది, ఈ మేడలు ఎవరివి. మాకు చాలా చిత్రంగా ఉంది ” అన్నారు.

అప్పుడా స్త్రీ ” పూర్వం దానవ రాజు దెగ్గర మయుడనే శిల్పి ఉండేవాడు. ఆ మయుడికి అనేక మాయా శక్తులు ఉన్నాయి. ఆయన బంగారంతో ఈ ప్రాంతాన్ని నిర్మించాడు. ఆ మయుడు బ్రహ్మని గూర్చి 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. మయుడి తపస్సుకి ప్రీతి చెందిన బ్రహ్మదేవుడు ఆయనకి విశేషమైన వరాలని ఇచ్చాడు. తదనంతరం శుక్రాచార్యుల యొక్క ధనమంతా తీసుకొచ్చి మయుడికి ఇచ్చారు. కాని ఆ మయుడు హేమ అనే అప్సరస స్త్రీ యందు మనస్సు పెట్టుకున్నాడని తెలిసి, ఇంద్రుడు ఆయనని తన వజ్రాయుధంతో సంహరించాడు. మయుడు హేమ అనే అప్సరస స్త్రీ యందు మనస్సు పెట్టుకున్నాడు కనుక, ఈ గుహలో ఉన్న సమస్త ఐశ్వర్యము కూడా హేమకి చెందుతుందని బ్రహ్మగారు తీర్పు ఇచ్చారు. అప్పుడా హేమ ఈ ఐశ్వర్యానికి కాపలాగ ఉండడానికి నన్ను నియమించింది. నేను మేరుసావర్ణి యొక్క కుమార్తెని, నా పేరు స్వయంప్రభ. నాకు స్నేహితురాలైన హేమ నృత్యమునందు, సంగీతమునందు ప్రావీణ్యము కలిగిన స్త్రి. ఆమె నన్ను పిలిచి ఈ ఐశ్వర్యాన్ని, గుహని కాపాడమని అడిగింది. స్నేహము మీద ఉన్న అనురక్తి చేత నేను ఈ గుహని కాపాడుతూ ఉంటాను. మిమ్మల్ని చూస్తుంటే బాగా అలసిపోయినట్టున్నారు కనుక మీకు కావలసిన కందమూలాలని, ఫలాలని ఆరగించండి. నీళ్ళు, తేనె కావలసినంత తాగి విశ్రాంతి తీసుకోండి. విశ్రమించిన తరువాత మీరు ఎవరో, ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు చెప్పండి ” అనింది.

అప్పుడా వానరాలు కడుపునిండా కావలసిన పదార్ధాలని తిని విశ్రమించారు. అప్పుడు హనుమంతుడు స్వయంప్రభతో ” దశరథ మహారాజు కుమారుడైన రాముడు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం తన భార్య అయిన సీతమ్మతో, తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి అరణ్యవాసానికి వచ్చాడు. కాని సీతమ్మని రావణాసురుడనే రాక్షసుడు అపహరించాడు. అపహరింపబడ్డ సీతమ్మని వెతుకుతూ వాళ్ళు కిష్కిందకి చేరుకున్నారు. అక్కడ వారు సుగ్రీవుడితో మైత్రి కుదుర్చుకున్నారు. సుగ్రీవుడు రాముడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం నాలుగు దిక్కులకి వానరాలని పంపించాడు, సీతమ్మని వెతకడం కోసం. దక్షిణ దిక్కుకి యువరాజైన అంగదుడి నాయకత్వంలో వచ్చిన వానర సమూహములో నేను ఒకడిని, నన్ను హనుమ అంటారు. సీతమ్మ జాడ కనిపెట్టడం కోసం వెతుకుతున్న మాకు ఎక్కడా ఆహారం, నీరు దొరకలేదు. అటువంటి సమయంలో తడి రెక్కలతో పక్షులు ఈ గుహ నుండి బయటకి రావడం చూశాము. ఇక్కడ నీళ్ళు దొరుకుతాయనే ఆశతో మేము ఈ గుహలోకి ప్రవేశించాము. సీతమ్మ జాడ మాకు చెప్పగలవా ” అని అడిగాడు.

Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 28 | కిష్కింధకాండ వాల్మీకి మహర్షి రామాయణం

 

అప్పుడా స్వయంప్రభ ” ఈ గుహలోకి మృగములు తప్ప మిగిలినవి ఎవన్నా ప్రవేశిస్తే, ప్రాణాలతో బయటకి వెళ్ళడం కుదరదు. కాని మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది, అందుకని మీ అందరినీ నా తపఃశక్తి చేత బయటకి పంపిస్తాను. మీరు కళ్ళు మూసుకొని, కళ్ళ మీద చేతులు పెట్టుకోండి ” అనింది.

అప్పుడా వానరాలు మృదువైన కనురెప్పల్ని మూసి, తమ మృదువైన చేతులతో ఆ కన్నులని మూసుకున్నారు. మళ్ళి ఉత్తర క్షణంలో కనులు తెరిచేసరికి వాళ్ళందరూ వింధ్య పర్వతం మీద ఉన్నారు. ఆ ప్రాంతంలోని చెట్లు పువ్వులతో, పండ్లతో శోభిల్లుతుంది. అప్పుడా స్వయంప్రభ ” మీరు ఈ గుహలో 4 నెలలపాటు ఉండిపోయారు ” అని చెప్పి గుహలోకి వెళ్ళిపోయింది. ( ఆ గుహలో వానరాలు గడిపింది కొంత సమయమే అయినా, ఆ గుహలో ఉన్నంత సేపు వాళ్ళకి కాలం తెలీలేదు.)

Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 28 | కిష్కింధకాండ వాల్మీకి మహర్షి రామాయణం

Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 26 | కిష్కింధకాండ వాల్మీకి మహర్షి రామాయణం




 

Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 25 | కిష్కింధకాండ వాల్మీకి మహర్షి రామాయణం

అప్పుడు అంగదుడు ” మనం ఆశ్వయుజ మాసంలో బయలుదేరాము. కాని ఇప్పుడు వసంత కాలం వచ్చింది. మనని ఒక నెలలోపు తిరిగి వచ్చెయ్యమని సుగ్రీవుడు చెప్పాడు. కాని మనం కొన్ని నెలలు దాటిపోయాము. ఆలస్యం అయితే అయ్యింది కాని ఇందులో సీతమ్మ జాడ తెలిసినవాడు ఎవడన్నా ఉన్నాడా?, ఎవడూ లేడు. సుగ్రీవుడు చాలా క్రోధ స్వరూపుడు, సుగ్రీవుడు ఎలాంటివాడో నాకు తెలుసు. ఆయన నన్ను ఇష్టంగా యువరాజుని చెయ్యలేదు, రాముడు చెయ్యమన్నాడని నన్ను యువరాజుని చేశాడు. నేనంటే ఆయనకి చాలా కడుపుమంట. ఇప్పుడు నేను వెనక్కి వెళితే శత్రుత్వం తీర్చోకోవడానికి మంచి అవకాశం దొరికిందని మనందరి కుత్తుకలు కత్తిరిస్తాడు. అందుకని మనం అక్కడికి వెళ్ళద్దు, ఇక్కడే ప్రాయోపవేశం (దర్భలని{గడ్డిని} దక్షిణ దిక్కుకి ఉండేలా పరుచుకొని, తూర్పు దిక్కుకి తిరిగి ఆచమనం చేసి దానిమీద పడుకుంటారు. అప్పుడు అటుగా వెళుతున్న ఏ ప్రాణి అయినా వాళ్ళని తినచ్చు) చేసి చనిపోదాము. నేను వెనక్కి రాను ” అన్నాడు.

అప్పుడు మిగిలిన వానరాలన్నీ అంగదుడి బాధ చూడలేక కళ్ళు తుడుచుకొని, మనమూ ఇక్కడ ప్రాయోపవేశం చేసేద్దాము అన్నాయి.

అప్పుడు వాళ్ళల్లో ఒకడైన తారుడు అన్నాడు ” అంగదుడు చెప్పిన మాట నిజమే, మనం ఇక్కడ ప్రాయోపవేశం చేసేసి చనిపోదాము. లేదా నాకు ఒక ఆలోచన వస్తుంది, మనం ఆ స్వయంప్రభ గుహలోకి వెళ్ళిపోదాము. అందులో బోలెడన్ని చెట్లు, ఫలాలు, తేనె ఉన్నాయి. అవి తింటూ మనం అందులోనే ఉండిపోవచ్చు ” అన్నాడు.

స చతుర్ణాం ఉపాయానాం తృతీయం ఉపవర్ణయన్ |
భేదయామాస తాన్ సర్వాన్ వానరాన్ వాక్య సంపదా ||

సామ, దాన, బేధ, దండోపాయములలో ఈ వానరముల మీద సామము కాని, దానము కాని, దండోపాయము కాని పనికిరాదు. అందుకని వీళ్ళ మీద బేధము అనే ఉపాయమును మాత్రమే ప్రయోగించాలి అని హనుమంతుడు అనుకొని, అంగదుడితో ” నాయనా అంగదా! నువ్వు చాలా గొప్పవాడివి. ఈ రాజ్యభారాన్ని అంతా వహించగలిగిన శక్తి కలిగినవాడివి. కాని ఇవ్వాళ నీ బుద్ధియందు చిన్న వైక్లవ్యం కనిపిస్తుంది. నువ్వు ప్రాయోపవేశం చేస్తాను, లేకపోతె ఈ గుహలోకి వెళ్ళిపోతాను అంటున్నావు, నీతో పాటు ఈ మిగిలిన వానరాలు కూడా అలాగే చేస్తాము అంటున్నాయి. కాని జెరగబోయే పరిణామం ఎలా ఉంటుందో నేను చెబుతాను, నువ్వు కొంచెం ఆలోచించుకో, ఆ తరువాత నిర్ణయం తీసుకో.

ఒకవేళ మీరందరూ గుహలోకి వెళ్ళిపోయినా మీతో నేను రాను, జాంబవంతుడు రాడు, నీలుడు రాడు, సుహోత్రుడు రాడు. వెయ్యి పిడుగుల శక్తితో సమానమైన బాణములు లక్ష్మణుడి దెగ్గర చాలా ఉన్నాయి, ఒకవేళ మీరు గుహలోకి వెళ్ళినా లక్ష్మణుడి బాణాలు ఈ గుహని ముక్కలు చేస్తాయి. అప్పుడు మీరు ఎలా బ్రతుకుతారు. ఒకవేళ మీరందరూ గుహలోకి వెళ్ళినా కొంతకాలానికి మిగిలిన వానరాలకి తమ భార్యాపిల్లలు గుర్తుకొస్తారు. అప్పుడు వాళ్ళు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అప్పుడు నువ్వు బంధువు అన్నవాడు లేకుండా ఒక్కడివే అయిపోతావు, ఆనాడు ఒక చిన్న గడ్డిపరక కదిలినా నువ్వు భయపడతావు. నువ్వు అన్నట్టు సుగ్రీవుడు అసత్యవాది కాదు, ఆయన కూడా సమ్మతించాడు కనుకనే నీకు యువరాజ పట్టాభిషేకం చేశాడు. నువ్వు తిరిగొచ్చి పరిపాలనచెయ్యి. అన్నిటినీమించి సుగ్రీవుడికి సంతానం లేదు, నువ్వే ఈ రాజ్యానికి వారసుడివి. నామాట నమ్ము, సుగ్రీవుడు నీకు ఎన్నడూ అపాయం కల్పించడు. తిరిగి వెళ్ళి జెరిగిన విషయాలని సుగ్రీవుడికి చెబుదాము ” అన్నాడు.

అప్పుడు అంగదుడు ” ఆనాడు మా నాన్న దుందుభిని చంపడానికని ఒక బిలంలోకి ప్రవేశించాడు. కాని సుగ్రీవుడికి రాజ్యము మీద ఉన్న కాంక్ష చేత మా నాన్న తిరిగిరాకుండా ఉండడం కోసమని ఆ బిలద్వారానికి ఒక శిలని అడ్డుపెట్టాడు. మా నాన్న బతికున్నాడని తెలిసి కూడా మా అమ్మని తన భార్యగా అనుభవించాడు. నాయందు కుమారుడన్న ప్రేమ సుగ్రీవుడికి ఎన్నడూ లేదు. నేను తిరిగొస్తే సాకు దొరికిందని నన్ను చంపుతాడు. సుగ్రీవుడి చేతిలో మరణించడం కన్నా ప్రాయోపవేశం చేసి మరణించడం నాకు ఇష్టం. మీరు వెళ్ళి నేను నా పినతండ్రికి, నా తల్లికి, నా పినతల్లికి, పెద్దలకి నమస్కారం చేశానని చెప్పండి ” అని చెప్పి, ప్రాయోపవేశం చెయ్యడం కోసమని దర్భల మీద పడుకున్నాడు.

అప్పుడా మిగతా వానరాలు కూడా అంగదుడిలాగానే దర్భల మీద పడుకున్నారు. అలా కింద పడుకున్నవాళ్ళు రామ కథని గురించి మాట్లాడడం మొదలుపెట్టారు.

సాంపాతిః నామ నామ్నా తు చిర జీవీ విహంగమః |
భ్రాతా జటాయుషః శ్రీమాన్ ప్రఖ్యాత బల పౌరుషః ||

వీళ్ళందరూ రామ కథ చెప్పుకుంటూ ఉండగా అక్కడున్న కొండ శిఖరం మీదకి ఒక పెద్ద పక్షి వచ్చింది, కాని దానికి రెక్కలు లేవు. ఆ పక్షి ఇంతమంది వానరాలని చూసి ‘ ఆహా ఏమి నా అదృష్టము, ఒకడిని తింటే మిగిలిన వారు పారిపోతారు, కాని వీళ్ళు ప్రాయోపవేశం చేస్తున్నారు కనుక ఎవరూ కదలరు. మెల్లగా ఒక్కొక్కరిని తినచ్చు ‘ అని ఆ పక్షి అనుకుంది.

ఆ వానరాలు చెప్పుకుంటున్న రామ కథ వింటున్న ఆ పక్షి గట్టిగా ఒక మాట అనింది ” నా మనస్సు కంపించిపోయేటట్టుగా, నా సోదరుడైన జటాయువు రావణాసురుడి చేత వధింపబడ్డాడన్న మాట చెప్పినవాడు ఎవడురా ఇక్కడ. అసలు నా తమ్ముడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు. దశరథ మహారాజు జటాయువుకి స్నేహితుడు, దశరథుడు ఏ కారణం చేత మరణించాడు. నా రెక్కలు కాలిపోయాయి, నా అంతట నేను మీ దెగ్గర కుర్చోలేను. ఎవరన్నా వచ్చి నన్ను దించండిరా ” అనింది.

కాని కింద పడుకున్న వానరాలు ఒకరితో ఒకరు ” అదంతా ఒట్టిదే, మనన్ని తినెయ్యడానికి అలా అంటుంది. మనం అక్కడికి వెళితే అది మనన్ని తినేస్తుంది ” అన్నారు.

వాళ్ళల్లో ఒకడు అన్నాడు ” అది మనన్ని నిజంగా చంపేసిందే అనుకో, మనం ప్రాయోపవేశం చేస్తున్నాము కదా మరి దానిని తేవడానికి భయం ఎందుకు, వెళ్ళి తీసుకురండి ” అన్నాడు.

 

Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 28 | కిష్కింధకాండ వాల్మీకి మహర్షి రామాయణం

 

అప్పడు అంగదుడు వెళ్ళి ఆ పక్షిని తీసుకొచ్చాడు. అప్పుడా వానరాలన్నీ ఆ పక్షి చుట్టూ చేరాయి. అప్పుడాయన ” అసలు మా జటాయువు ఏమయ్యాడు? ” అని అడిగాడు.

అంగదుడు మళ్ళి రామ కథ చెప్పడం ప్రారంభించాడు. అంగదుడు రామ కథ మొత్తం చెప్పి ‘ నువ్వు ఎవరు? ‘ అని ఆ పక్షిని ప్రశ్నించాడు.

అప్పుడా పక్షి ” సంపాతి అనబడే నేను, జటాయువు సోదరులము. సూర్యుడు ఉదయించినప్పటినుంచి అస్తమించేలోపు ఆయనతో సమానంగా ప్రయాణం చెయ్యాలని మేము ఒకనాడు పందెం కాసుకున్నాము. అనుకున్న ప్రకారం నేను, జటాయువు సూర్యుడి వెనకాల వెళ్ళిపోతున్నాము. అలా వెళుతుండగా మిట్ట మధ్యాహ్నం వేళ మేము సూర్యుడికి దెగ్గరగా వచ్చాము. అప్పుడా సూర్యుడి వేడిని భరించలేక జటాయువు స్పృహతప్పి కిందపడిపోతున్నాడు. పెద్దవాడిని కనుక తమ్ముడిని రక్షించాలని నేను నా రెక్కలని జటాయువుకి అడ్డంగా పెట్టాను. అప్పుడా సూర్యుడి వేడికి నా రెక్కలు కాలిపోయి వింధ్య పర్వతం మీద పడిపోయాను. కాని నా తమ్ముడు ఎటు వెళ్ళిపోయాడో నాకు తెలీలేదు. మళ్ళి ఇంతకాలానికి మీవల్ల నా తమ్ముడి గురించి విన్నాను. నా తమ్ముడు చనిపోయాడన్న వార్త వినడం వల్ల నాకు చాలా బాధ కలుగుతోంది. చనిపోయిన నా తమ్ముడికి జలతర్పణ ఇవ్వాలి అనుకుంటున్నాను, కాని నేను ఎగరలేను. మీరు నన్ను తీసుకెళ్ళి ఆ సముద్ర జలాల దెగ్గర దింపండి, నేను నా తమ్ముడికి తర్పణలు ఇస్తాను ” అన్నాడు.

Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 28 | కిష్కింధకాండ వాల్మీకి మహర్షి రామాయణం

Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 27 | కిష్కింధకాండ వాల్మీకి మహర్షి రామాయణం




 

https://sharemebook.com/  https://sharemebook.com/  https://sharemebook.com/

 

Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 28 | కిష్కింధకాండ

 

Valmiki Ramayanam Telugu valmiki ramayana telugu, ramayana valmiki summary slokas, valmiki ramayanam telugu lo, baala kaanda ramayanam valmiki telugu, telugu valmiki ramayanam, valmiki ramayanam in telugu book, valmiki ramayanam telugu AranyaKaanda sloka, valmiki ramayana meaning, Valmiki Ramayanam Telugu Kishkinda Kanda Day  28 | Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 28 | కిష్కింధకాండ వాల్మీకి మహర్షి రామాయణం

the ramayana by valmiki summary, andhra valmiki ramayanam in telugu, valmiki ramayana telugu pdf, valmiki ramayanam telugu pdf slokam, samkshepa ramayanam telugu, valmiki bala kanda,valmiki ramayana telugu translation Valmiki Ramayanam Telugu AranyaKaanda | Valmiki Ramayanam Telugu Kishkinda Kanda Day  28 | వాల్మీకి మహర్షి రామాయణం Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 28

 

Valmiki Ramayanam Telugu AranyaKaanda Day 20 | వాల్మీకి మహర్షి రామాయణం అరణ్యకాండ

 

 

సంపాతి కోరిక మేరకు వాళ్ళు  ఆయనని సముద్ర తీరానికి తీసుకువెళ్ళారు, ఆయన అక్కడ జటాయువుకి తర్పణలు సమర్పించాడు.

మళ్ళి వెనక్కి తిరిగొచ్చాక ఆ వానరాలు సంపాతితో ” జటాయువు రామకార్యంలో సహాయం చేశాడు, నువ్వు కూడా రామకార్యంలో ఏమన్నా సహాయం చెయ్యగలవా. నీకు సీతమ్మ జాడ ఏమన్నా తెలుసా ” అని అడిగారు.

నిర్దగ్ధ పక్షో గృధ్రో అహం గత వీర్యః ప్లవం గమాః |
వాఙ్ మాత్రేణ తు రామస్య కరిష్యే సాహ్యం ఉత్తమం ||
అప్పుడా సంపాతి ” రెక్కలు కాలిపోయాయి నాకు, ఇవ్వాళ ఇలా పడి ఉన్నాను, ఇంతకన్నా ఏమి చెయ్యగలను. కాని రామకార్యానికి నేను మాటమాత్రం సహాయం చేస్తాను. సీతమ్మని రావణుడు ఆకాశ మార్గంలో తీసుకెళుతున్నప్పుడు ఆమె ఆభారణాలని కొంగుకి చుట్టి విడిచిపెట్టడం నేను చూశాను. ఆ రావణాసురుడు విశ్రవసోబ్రహ్మ యొక్క కుమారుడు, సాక్షాత్తు కుబేరుడి తమ్ముడు. ఆయన లంకా నగరానికి అధినేత. ఈ సముద్రానికి దక్షిణ దిక్కున 100 యోజనముల అవతల లంక ఉంటుంది. ఆ లంకలో ఎక్కడ చూసినా బంగారు స్తంభములతో నిర్మింపబడ్డ భవనాలు ఉంటాయి. అటువంటి లంకా నగరంలో దీనురాలై,  పచ్చని పట్టు పుట్టం కట్టుకుని, ఏడుస్తూ, చుట్టూ రాక్షస స్త్రీలు ఉండగా సీతమ్మ ఉంది. నాకు ఇవన్నీ ఎలా తెలుసని అడుగుతారేమో, నేను ఇక్కడే కూర్చుని సీతమ్మని చూడగలను. నేను దివ్య దృష్టితో చూడగలను, మాకు ఆ శక్తి ఉంది. ఎందుకంటే, భూమి నుండి ఆకాశానికి కొన్ని అంతరములు ఉన్నాయి. మొదటి అంతరములో తమ కాళ్ళ దెగ్గర ఉన్న ధాన్యాన్ని ఏరుకొని తినే కులింగములు అనే పక్షులు ఎగురుతాయి. రెండవ అంతరంలో చెట్ల మీద ఉండే ఫలాలని తినే పక్షులు ఎగురుతాయి. మూడవ అంతరంలో భాసములుక్రౌంచములు ఎగురుతాయి. నాలుగవ అంతరంలో డేగలు ఎగురుతాయి. అయిదవ అంతరంలో గ్రద్దలు ఎగురుతాయి. ఆరవ అంతరంలో హంసలు ఎగురుతాయి. ఏడవ అంతరంలో వినతా పుత్రులమైన వైనతేయులము కాబట్టి  మేము ఎగురుతాము. అందుకని మేము తినే తిండి చేత, సహజంగా మేము జన్మించిన జాతి చేత 100 యోజనముల అవతల ఉన్న విషయాన్ని కూడా ఇక్కడే ఉండి చూడగల దృష్టిశక్తి మా కంటికి ఉంటుంది.

అదుగో దూరంగా లంకా పట్టణంలో, అశోక వనంలో సీతమ్మ కూర్చుని ఉండడం నాకు కనిపిస్తుంది. మీలో ఎవరైనా సాహసం చేసి 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళగలిగిన వాడు ఉంటె, సీతమ్మ యొక్క దర్శనం చెయ్యవచ్చు.
తీక్ష్ణ కామాః తు గంధర్వాః తీక్ష్ణ కోపా భుజంగమాః |
మృగాణాం తు భయం తీక్ష్ణం తతః తీక్ష్ణ క్షుధా వయం ||
గంధర్వులకి కామం ఎక్కువ, పాములకి కోపం ఎక్కువ, మృగాలకి భయం ఎక్కువ, పక్షులకి ఆకలి ఎక్కువ. అందుకని నాకు ఆకలి ఎక్కువగా ఉండేది, కాని వెళ్ళి తిందామంటే నాకు రెక్కలు లేవు. నా కొడుకైన సుపార్షుడు రోజూ వెళ్ళి ఆహారం తీసుకోచ్చేవాడు. కాని ఒకనాడు ఆహారం తీసుకురావడానికి వెళ్ళిన నా కొడుకు ఎంతసేపటికీ వెనక్కి రాలేదు. కడుపు నకనకలాడుతూ నేను ఎదురుచూస్తున్నాను. ఇంతలో ఒట్టి చేతులతో నా కొడుకు వచ్చాడు, అది చుసిన నాకు కోపం వచ్చి నా కొడుకుని నిందించాను. అప్పుడు సుపార్షుడు అన్నాడు ‘ నాన్నగారు! నా దోషంలేదు, నేను పొద్దున్నే వెళ్ళి సముద్రంలో ఉన్న మహేంద్రగిరి పర్వతం మీద కూర్చొని సముద్ర జలాలలోకి చూస్తున్నాను, ఏదన్నా పెద్ద ప్రాణి కనపడగానే తీసుకొచ్చి మీకు పెడదాము అనుకున్నాను. కాని ఇంతలో ఆకాశంలో, నల్లటి స్వరూపంతో ఉన్న రాక్షసుడు, మెడలో తెల్లటి ముత్యాల హారం వేసుకొని, తెల్లటి బట్ట కట్టుకొని వెళుతున్నాడు. మేఘం మీద మెరుపు మెరిస్తే ఎలా ఉంటుందో, అలా ఒక స్త్రీ అతని చేతులలో తన్నుకుంటుంది. హ రామ, హ లక్ష్మణా అని అరుస్తుంది. నేను వాడిని చూసి మంచి ఆహారం దొరికింది అనుకున్నాను. కాని వాడు నా దెగ్గరికి వచ్చి నమస్కరించి ‘ మహానుభావ! నాకు దారి విడిచిపెట్టవయ్య ‘ అన్నాడు. ఎంతటివాడైన అలా బతిమాలుతు సామంతో మాట్లాడితే, ఇంగిత జ్ఞానం ఉన్నవాడెవడు అటువంటివాడిని దిక్కరించకూడదు కదా, అందుకని నేను వాడిని వదిలిపెట్టేశాను. కాని వాడు వెళ్ళిపోగానే ఆకాశంలో దేవగణాలు, ఋషిగణాలు నా దెగ్గరికి వచ్చి ‘ అదృష్టవంతుడివిరా బతికిపోయావు, వాడు దుర్మార్గుడు, వాడి పేరు రావణాసురుడు. వాడు చాలా బలవంతుడు, వాడికి విశేషమైన వరాలు ఉన్నాయి ‘ అని చెప్పి వెళ్ళారు.

ఈ విషయాన్ని నా కొడుకు చెప్పడం వల్ల నాకు సీతమ్మ గురించి తెలిసింది. సీతమ్మని రావణాసురుడే అపహరించి లంకకి తీసుకువెళ్ళాడు.

నేను వింధ్య పర్వత శిఖరం మీద రెక్కలు కాలిపోయి పడినప్పుడు 6 రోజుల పాటు స్పృహ లేకుండా ఉన్నాను. 6 రోజుల తరువాత తెలివొచ్చింది. నా తమ్ముడు ఎటో ఎగిరిపోయాడు, నాకేమో రెక్కలు కాలిపోయాయి, అందుకని ఆ పర్వతం మీద నుండి కిందకి దూకి మరణిద్దాము అనుకున్నాను, కాని ఇంతలో ఒక ఆలోచన వచ్చింది. మా ఇద్దరికీ రెక్కలు ఉన్న రోజుల్లో నేను నా తమ్ముడు కామరూపులము కాబట్టి మనుష్య రూపాన్ని పొందేవాళ్ళము. అక్కడ ఉండేటటువంటి నిశాకర మహర్షి పాదములకు నమస్కారం చేస్తుండేవాళ్ళము. అందుకని ఒక్కసారి ఆ మహర్షి పాదాలకి నమస్కరించి ప్రాణాలు విడిచిపెడదాము అనుకొని మెల్లగా డేకుతూ ఆ మహర్షి ఉండే ఆశ్రమానికి వచ్చాను. అప్పుడా మహర్షి స్నానం చేసి వెళుతుంటే ఎలా ఉందంటే, అభిషేకం చెయ్యబడ్డ బ్రహ్మగారు వెళుతున్నట్టు ఉన్నారు. బ్రహ్మగారి చుట్టూ ప్రాణులన్నీ ఎలా చేరుతాయో, అలా నిశాకర మహర్షి స్నానం చేసి వెళుతుంటే ఆయన చుట్టూ ఎలుగుబంట్లు, పులులు, సింహాలు, పాములు చేరి ఉన్నాయి. ఆయన లోపలికి వెళ్ళగానే ఆ మృగాలన్నీ వెళ్ళిపోయాయి. తరువాత ఆయన బయటకి వచ్చి నన్ను చూసి ‘ నిన్ను చాలాకాలం నుండి చూస్తున్నాను, నువ్వు, నీ తమ్ముడు వచ్చి నాకు నమస్కారం చేసేవారు కదా. నువ్వు రెక్కలు కాలిపోయి ఇలా ఉన్నావేంటి ‘ అని అడిగారు. అప్పుడు నేను జెరిగిన కథంతా చెప్పాను. అప్పుడాయన అన్నారు ‘ సంపాతి! బెంగ పెట్టుకోకు, భవిష్యత్తులో నీ వల్ల ఒక మహత్కార్యం జెరగవలసి ఉంది. నువ్వు కొంతకాలానికి సీతాపహరణాన్ని చూస్తావు. ఈ సీతమ్మని అన్వేషిస్తూ వానరులు వస్తారు. వాళ్ళకి నువ్వు మాట సాయం చెయ్యి. నేను నీకు అభయం ఇస్తున్నాను, అలా చేస్తే నీ కాలిపోయిన రెక్కలు మళ్ళి వస్తాయి. నాకు కూడా రామలక్ష్మణులను చూడాలని ఉంది, కాని అంతకాలం ఈ శరీరంలో ఉండాలని నాకు లేదు, ఈ శరీరాన్ని విడిచిపెట్టేద్దాము అనుకుంటున్నాను. నువ్వు మాత్రం ఈ కొండమీదే వేచి ఉండు.

Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 28 | కిష్కింధకాండ వాల్మీకి మహర్షి రామాయణం

నీకు ఇంకొక విషయం చెబుతాను, సీతమ్మని అపహరించిన తరువాత ఆమెని వశం చేసుకుందామని రావణాసురుడు తన అంతఃపురం చూపిస్తాడు, దివ్యమైన భోజనము పెడతాడు. కాని ఆ తల్లి కన్నెత్తి కూడా చూడదు, ఒక మెతుకు ముట్టదు. ఆ తల్లికోసం దేవేంద్రుడు ప్రతి రోజూ దేవతలు కూడా చూడనటువంటి దివ్యమైన పాయసాన్ని పంపిస్తాడు. కాని సీతమ్మ ఆ పాయసాన్ని తినదు. ఆమె, పైన ఉన్న పాయసాన్ని తీసి ఈ భూమండలంలో ఎక్కడైనా సరే రామలక్ష్మణులు బతికుంటే, ఈ పాయసం వారికి చెందుగాక, ఒకవేళ రామలక్ష్మణులు శరీరాలని విడిచిపెట్టి ఉంటె, ఉర్ధలోకములలో ఉన్నవాళ్ళకి ఈ పాయసం చెందుగాక, అని భూమి మీద పైన ఉన్న పాయసాన్ని పెడుతుంది. ఆ సీతమ్మ తిన్న అన్నం రావణుడు పెట్టినది కాదు. ఈ విషయాన్ని ఆ వానరులు వచ్చాక వాళ్ళకి చెప్పు ‘ అని ఆనాడు నిశాకర మహర్షి నాకు చెప్పారు. అందుకని కొన్ని వేల సంవత్సరముల నుండి ఇలా బతికి ఉన్నాను.

తస్య తు ఏవం బ్రువాణస్య సంహతైః వానరైః సహ ||
ఉత్పేతతుః తదా పక్షౌ సమక్షం వన చారిణాం ||
సంపాతి ఈ మాటలని వానరాలకి చెప్పగానే కాలిపోయిన ఆయన రెక్కలు మళ్ళి పుట్టాయి. అప్పుడాయన తన ఎర్రటి రెక్కలని అటూ ఇటూ ఊపి చూసుకున్నాడు. ఆనందంతో ఆ సంపాతి ఆకాశంలోకి ఎగిరిపోయాడు.

ఇంక అక్కడున్న వానరాలకి ఇది చూడగానే చాలా సంతోషంవేసింది. సముద్రాన్ని దాటుదామని వాళ్ళందరూ కలిసి సముద్రం యొక్క ఉత్తర తీరానికి చేరుకున్నారు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు ” ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకి వెళ్ళగలిగినవాడు ఎవడు. మిగిలిన వానర జాతికి ఎవడు ప్రాణప్రదానం చెయ్యగలిగినవాడు. ఈ సముద్రం దెగ్గర నిలబడిపోయిన వానరాలు సంతోషంగా తిరిగి వెళ్ళి తమ భార్యాపిల్లలని చూసేటట్టు చెయ్యగలిగినవాడు ఎవడు. ఎవరివల్ల ఈ కార్యం జెరుగుతుంది, ఎవరు అంతటి సమర్ధుడు ” అని అడిగారు.

అప్పుడు శరభుడు లేచి, నేను 30 యోజనములు వెళతాను అన్నాడు, అలాగే ఋషభుడు 40 యోజనములు వెళతాను అన్నాడు, గంధమాదనుడు 50మైందుడు 60ద్వివిదుడు 70సుషేణుడు 80. అప్పుడు జాంబవంతుడు లేచి అన్నాడు ” నేను యవ్వనంలో ఉన్నప్పుడు చాలా బలంగా ఉండేవాడిని. పరమేశ్వరుడు త్రివిక్రమావతారంతో(వామన) పెరిగిపోతుంటే నేను ఆయనకి 21 సార్లు ప్రదక్షిణ చేశాను. కాని ఇప్పుడు నేను ముసలివాడిని అయిపోయాను, నేను ఇప్పుడు 90 యోజనాలు ఎగరగలను ” అన్నాడు.

అప్పుడు అంగదుడు అన్నాడు ” నేను 100 యోజనాలు వెళ్ళగలను, కాని తిరిగి మళ్ళి ఈ 100 యోజనాలు రాలేను ” అన్నాడు.అప్పుడు జాంబవంతుడు ” అయ్యో, అది మహా పాపం. ప్రభువు వెళ్ళి పని చేస్తుంటే, ఆయనని సేవించేవారు హాయిగా కూర్చుంటే అది చాలా అసహ్యంగా ఉంటుంది. నువ్వు వెళ్ళకూడదు, నువ్వు మాకు పనిని పురమాయించాలి. ఎవరిని పంపాలో నాకు తెలుసు, వాడిని నేను పంపిస్తాను, మీరందరూ చూడండి ” అని ఒక్కడిగా కూర్చున్న హనుమంతుడి దెగ్గరికి వెళ్ళి ” ఏమయ్యా హనుమా! ఏమి తెలియని వాడిలా ఇలా కూర్చున్నావు. ఒకానొకప్పుడు అప్సరసలలో శ్రేష్టురాలైన పుంజికస్థల అనబడే ఒక అప్సరస శాపవశం చేత కుంజరుడు అనే వానరానికి కుమార్తెగా జన్మించింది. ఆమెకి అంజనా అని పేరు పెట్టారు. ఆమె నీ తండ్రి అయిన కేసరి యొక్క భార్య. నీ తల్లి కామరూపి అవడంచేత ఒకనాడు మనుష్య రూపం దాల్చి ఒక పర్వత శిఖరం మీద నిలబడింది. వాయువు ఆమెని చూసి మోహించి, తన దీర్ఘమైన బాహువుల చేత గట్టిగా కౌగలించుకున్నాడు. అప్పుడా తల్లి ‘ ఎవడురా దుర్మార్గుడు నా పాతివ్రత్యాన్ని చెరప చూస్తున్నవాడు ‘ అనింది. అప్పుడా వాయువు అన్నాడు ‘ అమ్మా! బ్రహ్మగారు మా తేజస్సులని వానర స్త్రీలయందు ప్రవేశపెట్టి వానరాలని సృష్టించామన్నారు. అందుకని నీ పాతివ్రత్యానికి భంగం కలగకుండా గొప్ప పరాక్రమము ఉన్నవాడు, బుద్ధిమంతుడు, నాతో సమానంగా దూకగలిగినవాడు, ఎగరగలిగినవాడైన పుత్రుడు కేవలం నిన్ను నేను మానసికముగా చూసినంత మాత్రాన నీ కడుపుయందు జన్మించనున్నాడు ‘ అన్నాడు. ఆ కారణం చేత నువ్వు జన్మించావు.

నువ్వు పుట్టగానే ఆకాశంలో ఉన్న సూర్యుడిని చూసి తినే ఫలం అనుకొని ఆయనని పట్టుకోబోయావు. సూర్య పధానికి అడ్డు వస్తున్నావని కోపమొచ్చి ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొడితే, నీ ఎడమ దవడ చొట్టపడి కింద పడ్డావు. సొట్టపడ్డ హనుములు కలిగినవాడివి కనుక నిన్ను హనుమ అని పిలిచారు. నువ్వు అలా పడిపోవడం చేత నీ తండ్రి అయిన వాయుదేవుడికి కోపం వచ్చి భూమిమీద వీచడం మానేశాడు. అప్పుడు బ్రహ్మగారు పరుగు పరుగున వచ్చి, గాలి వీచకపోతే సృష్టి ఆగిపోతుందని ” హనుమా! ఏ అస్త్రము చేత, ఏ శస్త్రము చేత నిన్ను ఎవరూ బంధించలేరు ” అని వరం ఇచ్చారు. అలాగే ఇంద్రుడు నీకు స్వచ్ఛంద మరణ వరం ఇచ్చాడు. నీ అంత నువ్వు సంకల్పం చేసి శరీరాన్ని విడిచిపెట్టాలి కాని, నిన్ను పడగొట్టగలిగే పురుషుడు ఈ బ్రహ్మాండంలో ఎక్కడా ఉండడు.

Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 28 | కిష్కింధకాండ వాల్మీకి మహర్షి రామాయణం

 

నేను ఎన్నో సందర్భాలలో సముద్రంలో ఉన్న పాముల్ని గరుగ్మంతుడు తన్నుకుపోతుండగా చూశాను. నీ తండ్రి అయిన వాయుదేవుడు ప్రభంజనుడై వీస్తే పెద్ద పెద్ద చెట్ల యొక్క కొమ్మలని విరిచేస్తాడు. అటువంటి శక్తిమంతుడైన వాయుదేవుడి కుమారుడవైన నీకు ఆ గమన శక్తి ఉంది, గరుగ్మంతుడికి ఆ గమన శక్తి ఉంది. ఇవ్వాళ కొన్ని కోట్ల వానరముల భవిత, సౌభాగ్యము, ప్రాణములు నీ చేతులలో ఉన్నాయి. నీ వీర్యమును, తేజస్సును, పరాక్రమమును ఒక్కసారి పుంజుకో. 100 యోజనముల సముద్రాన్ని అవలీలగా దాటి సీతమ్మ జాడ కనిపెట్టి ఇక్కడికి రా. హనుమా! నీ శక్తిని చూపించు ” అని జాంబవంతుడు అన్నాడు.

జాంబవంతుడి మాటలు విన్న హనుమంతుడు మేరు పర్వతం పెరిగినట్టు తన శరీరాన్ని పెంచేశాడు. గుహలో నుండి సింహం ఆవలిస్తూ బయటకి వస్తుంటే దానిని చూసిన ప్రాణులు భయంతో ఎలా నిలబడిపోతాయో, అలా అప్పటివరకూ తమతో తిరిగిన హనుమంతుడు అటువంటి స్వరూపాన్ని పొంది, ఒక్కసారి ఆవలించి, బాహువులని పైకి ఎత్తి ఒక్కసారి విదిల్చి భూమి మీద కొట్టేసరికి వానరములన్నీ భయపడిపోతూ, శ్రీమహా విష్ణువు దర్శనం అయితే ఎలా నిలబడతారో అలా హనుమంతుడిని చూసి అంజలి ఘటించి నిలబడిపోయారు.

అప్పుడు హనుమంతుడు అక్కడ ఉన్న వృద్ధులైన వానరాలకి నమస్కరించి ” నా తండ్రి వాయుదేవుడు, ఆయన అగ్నిదేవుడి యొక్క సఖుడు. వాయుదేవుడు ఎటువంటి గమనంతో వెళతాడో నేను అటువంటి గమనంతో వెళతాను. నేను వెళుతున్నప్పుడు నాకు అడ్డొచ్చిన ఏ ప్రాణినైనా నా వక్షస్థలంతో గుద్ది చంపేస్తాను. పర్వతాలని చూర్ణం చేస్తాను, సముద్రాల్ని కలయ తిప్పుతాను. నా బాహువుల శక్తి చేత ఈ సముద్రాన్ని తిరగ తోడుతాను. 100 యోజనములే కాదు 10,000 యోజనములైనా సరే కొన్ని వేల మార్లు అటువైపు నుండి ఇటువైపుకి వెళతాను. సూర్యుడు ఉదయిస్తుండగా భూమి నుండి ఆకాశంలోకి వెళతాను, సూర్యుడి సమీపంలో నిలబడి నమస్కారం చేస్తాను. సూర్యుడు అస్తమించడానికి పశ్చిమ దిక్కుకి వెళుతుంటే ఆయన దెగ్గరికి వెళ్ళి మళ్ళి నమస్కరించి వస్తాను. గరుగ్మంతుడు సముద్రం మీద తిరుగుతుండగా ఆయనకి కొన్ని వేలసార్లు ప్రదక్షిణం చేస్తాను. ఇక్కడ నుండి లేచి దక్షిణ దిక్కున ఉన్న సముద్రాన్ని ముట్టుకుంటాను. రావణాసురుడిని కొట్టి చంపేస్తాను, లేదా లంకని ఫెల్లఘించి చేతితో పట్టి సముద్రానికి ఈవలి ఒడ్డుకి తీసుకువచ్చి రాముడి పాదాల దెగ్గర పడేస్తాను. ఇక నా పరాక్రమము ముందు నిలబడగలిగినవాడు లేడు. బ్రహ్మగారు, దేవేంద్రుడు చెరొక ఆసనం మీద కుర్చూని మధ్య ఆసనంలో అమృతాన్ని పెడితే, ఇద్దరి మధ్యలోకి వెళ్ళి, చెరొక చేతితో ఇద్దరినీ అడ్డగించి అమృతాన్ని తీసుకురాగలను. ఈ భూమి నన్ను తట్టుకోలేకపోతుంది, అందుకని మహేంద్రగిరి పర్వతం మీద నుంచి బయలుదేరతాను ” అన్నాడు.

Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 28 | కిష్కింధకాండ వాల్మీకి మహర్షి రామాయణం

Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 24 | కిష్కింధకాండ వాల్మీకి మహర్షి రామాయణం

అలా హనుమంతుడు ఆ మహేంద్రగిరి పర్వతాన్ని ఎక్కుతుంటే, అక్కడున్న గంధర్వులు, విద్యాధరులు ఎగిరి పారిపోయారు. అనిల కుమారుడి పద ఘట్టనకి ఆ పర్వతం కంపించిపోయింది, చెట్లు నేలరాలిపోయాయి, మృగములన్నీ దిక్కులు పట్టి పారిపోయాయి. హనుమంతుడిని చూసిన వానరాలు ”
మహానుభావ! ఋషుల యొక్క ఆశీర్వచనము చేత, గురువుల యొక్క ఆశీర్వచనము చేత, దేవతల యొక్క ప్రభావము చేత ఏ విధమైన ప్రతిబంధకము లేకుండా 100 యోజనముల సముద్రాన్ని దాటి సీతమ్మ జాడ కనిపెట్టి తిరిగి నువ్వు ఎప్పుడు వస్తావ అని ఒంటి పాదం మీద నిలబడి ఉంటాము. ఇన్ని కోట్ల వానరాలకి ప్రాణము పెట్టిన వాడిగా కీర్తి గడించెదవుగాక. నీకోసం పుణ్య కర్మలను చేస్తూ ఇక్కడ నిలబడి ఉంటాము ” అన్నారు.

హనుమంతుడు మానసిక ఉత్సాహమును పొంది లంకా పట్టణాన్ని మనస్సుతో చేరిపోయి ఉన్నాడు.

 

Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 28 | కిష్కింధకాండ వాల్మీకి మహర్షి రామాయణం

Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 27 | కిష్కింధకాండ వాల్మీకి మహర్షి రామాయణం

Valmiki Ramayanam Telugu Kishkindha Kanda Day 28 | కిష్కింధకాండ వాల్మీకి మహర్షి రామాయణం

 

Spread iiQ8